kamales Tiwari
-
15 సార్లు పొడిచినా చావలేదని..
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల హిందూ సమాజ్ పార్టీ నాయకుడు కమలేష్ తివారీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలేష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆ రిపోర్టును బుధవారం బయటపెట్టారు. రిపోర్టులోని వివరాలు.. దుండగులు కమలేష్‌ను దవడ నుంచి ఛాతీ వరకు 15 సార్లు కత్తితో దారుణంగా పొడిచారు. రెండు సార్లు గొంతు కోయడానికి ప్రయత్నించారు. కమలేష్ కుప్పకూలిపోయాక చనిపోయాడో లేదోనన్న అనుమానంతో తుపాకీతో ముఖంపై కాల్చారు. ఈ మేరకు కమలేష్ తలలో పాయింట్ 32 బుల్లెట్‌ను డాక్టర్లు కనుగొన్నారు. మరోవైపు నిందితుల కోసం గాలించిన పోలీసులు గుజరాత్ - రాజస్థాన్ సరిహద్దుల్లో ఇద్దరిని పట్టుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్న గుజరాత్ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ బృందం వారిని సూరత్‌కు చెందిన అష్ఫాక్ షేక్ (34), మొయినుద్దీన్ పఠాన్(27) గా గుర్తించింది. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం నిందితులను ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించింది. మరో నిందితుడు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పోలీసులకు చిక్కాడు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. -
‘మేమెవర్నీ నమ్మలేం.. వాళ్ల గురించి తెలీదు’
లక్నో : తన తండ్రిని హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని హిందూ సమాజ్ నేత కమలేశ్ తివారి కుమారుడు సత్యం తివారి డిమాండ్ చేశారు. భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ తన తండ్రి హత్య జరిగిందని.. ప్రస్తుతం తాము ఎవరినీ నమ్మే పరిస్థితుల్లో లేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజకీయ పార్టీ హిందూ సమాజ్ అధ్యక్షుడు కమలేష్ తివారీ (45) శనివారం దారుణ హత్యకు గురైన విషయం విదితమే. లక్నోలోని అత్యంత రద్దీగా ఉండే నాకా హిందోలా ప్రాంతంలో సొంత నివాసంలో దుండగులు ఆయన గొంతు కోసి.. ఆపై పలుమార్లు కాల్పులకు తెగబడి అంతమొందించారు. ఈ ఘటనతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కమలేశ్‌కు ప్రాణహాని ఉందన్న వార్తల నేపథ్యంలో స్థానిక పోలీసులు ఇద్దరు సాయుధ పోలీసులను ఆయన నివాసం వద్ద కాపలా పెట్టారు. అయితే హత్య జరిగిన సమయంలో వారిద్దరు కమలేశ్ ఇంటి వద్ద లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తివారీ హత్య కేసులో ఐదుగురి హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముస్లిం మత గురువు అన్వర్-ఉల్ -హక్‌ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా తివారీ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గతంలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన భర్తను హత్య చేసేందుకు మహ్మద్ ముఫ్తీ నదీమ్ కాజ్మి, ఇమామ్ మౌలానా అన్వర్-ఉల్-హక్ కుట్ర చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త తలకు రూ.1.5 కోట్లు వెల కట్టారని ఆరోపించారు.(చదవండి : హిందూ సమాజ్ పార్టీ అధ్యక్షుడు దారుణ హత్య) ఈ ఘటన గురించి కమలేశ్ కుమారుడు సత్యం తివారి మీడియాతో మాట్లాడుతూ... ‘పోలీసులు అరెస్టు చేసిన వారు నిజమైన నిందితులో కాదో నాకు తెలియదు. ఒకవేళ అమాయకులను పట్టుకుని నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందా అన్న విషయంలో కూడా స్పష్టత లేదు. ఆ ఐదుగురు నిజమైన నిందితులే అయితే.. తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను పోలీసులు ఎన్ఐఏకు సమర్పించాలి. కేసు వారికి అప్పగించాలి. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారో లేదో అసలు అర్థంకావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు’ అని యోగి సర్కారుపై సందేహం వ్యక్తం చేశారు. ఇక కమలేశ్ హత్యకు సూరత్‌లో పథకం రచించినట్లుగా భావిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కేసులో గుజరాత్‌కు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని... రషీద్ పఠాన్ అనే వ్యక్తి హత్యకు ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. ఘటనాస్థలంలో స్వీట్ బాక్స్ దొరికిందని... ఈ కేసును 24 గంటల్లో ఛేదిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. తన భర్తకు న్యాయం జరగకపోతే తాను ఆత్మహత్యకు పాల్పడతానని కమలేశ్ భార్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే తమను కలిసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
‘హెబియస్ కార్పస్’కు అధిక ప్రాధాన్యమివ్వాలి: సుప్రీం
వ్యక్తుల నిర్బంధం, అరెస్టుల చట్టబద్ధతను ప్రశ్నించే హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్లను తక్షణమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదివారం పేర్కొంది. అఖిల భారత హిందూ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ కమలేశ్ తివారి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఇలా స్పందించింది. మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే భాషతో ప్రెస్ నోట్ ను జారీ చేశారనే ఆరోపణలతో ఆయన్ను నిర్బంధించారు. కమలేశ్ విజ్ఞప్తిని నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని సుప్రీం కోర్టు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌కు సూచించింది. హెబియస్ కార్పస్ రిట్‌కు అధిక ప్రాధాన్యమిచ్చి, త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి. హైకోర్టులకు కూడా ఇది వర్తిస్తుంది. నాలుగు వారాల్లో వీటి విచారణ పూర్తిచేసి తీర్పు వెలువరించాలి ’ అని జస్టిస్ దీప్క్ మిశ్రా, సి. నాగప్పలతో కూడిన ధర్మాసనం తెలిపింది. హెబియస్ రిట్ సత్వర పరిష్కారం కోసం మార్గదర్శకాలు రూపొందించేలా సంబంధిత అధికార గణాలకుదిశా నిర్దేశం చేయాలని కమలేష్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జాతీయ భద్రతా చట్టం కింద తనను యూపీ పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ వద్ద హెబియస్ కార్పస్ రిట్‌ను దాఖలు చేశానని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.