వ్యక్తుల నిర్బంధం, అరెస్టుల చట్టబద్ధతను ప్రశ్నించే హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌లను తక్షణమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదివారం పేర్కొంది. అఖిల భారత హిందూ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ కమలేశ్ తివారి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఇలా స్పందించింది. మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే భాషతో ప్రెస్ నోట్ ను జారీ చేశారనే ఆరోపణలతో ఆయన్ను నిర్బంధించారు.
కమలేశ్ విజ్ఞప్తిని నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని సుప్రీం కోర్టు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌కు సూచించింది. హెబియస్ కార్పస్ రిట్‌కు అధిక ప్రాధాన్యమిచ్చి, త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి. హైకోర్టులకు కూడా ఇది వర్తిస్తుంది. నాలుగు వారాల్లో వీటి విచారణ పూర్తిచేసి తీర్పు వెలువరించాలి ’ అని జస్టిస్ దీప్‌క్ మిశ్రా, సి. నాగప్పలతో కూడిన ధర్మాసనం తెలిపింది. హెబియస్ రిట్ సత్వర పరిష్కారం కోసం మార్గదర్శకాలు రూపొందించేలా సంబంధిత అధికార గణాలకుదిశా నిర్దేశం చేయాలని కమలేష్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జాతీయ భద్రతా చట్టం కింద తనను యూపీ పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ వద్ద హెబియస్ కార్పస్ రిట్‌ను దాఖలు చేశానని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.