మహానందిలో 21 నుంచి దసరా శరన్నవరాత్రులు
– వివిధ అలంకారాల్లో దర్శనమివ్వనున్న అమ్మవారు
మహానంది: సెపె్టంబర్ 21 నుంచి మహానంది క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం పండితుడు రవిశంకర అవధాని తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 21న శైలపుత్రిదుర్గ, 22న బ్రహ్మచారిణీదుర్గ, 23న చంద్రఘంట దుర్గ, 24న కూష్మాండదుర్గ, 25న స్కందమాత దుర్గ, 26న కాత్యాయినీదుర్గ, 27న కాళరాత్రి దుర్గ, 28న మహాగౌరీదుర్గ, 29న సిద్ధిధాత్రిదుర్గ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారన్నారు. 30వ తేదీన విజయదశమి రోజున మహానంది క్షేత్రంలో వెలిసిన కామేశ్వరీదేవి అమ్మవారి నిజరూపంలో దర్శనమిస్తారన్నారు. అదేరోజు సాయంత్రం కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారి ఉత్సవమూర్తులు స్థానిక ఈశ్వర్నగర్ వద్ద ఉన్న జమ్మిచెట్టు వద్దకు చేరుతారన్నారు. జమ్మిచెట్టు వద్ద స్వామి, అమ్మవారికి విశేష పూజల అనంతరం తిరిగి మహానందికి వస్తారని తెలిపారు. మహానంది క్షేత్రంలో జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు స్వయంగా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని, దాతలు రూ.11,116 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వీరికి నవరాత్రుల్లో ఒకరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంతసేవ వరకు, శత చండీయాగం, అలంకార పూజ, సహస్రదీపాలంకరణసేవ, గ్రామోత్సవం సేవల్లో పాల్గొనవచ్చన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలోనే వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు స్వామి, అమ్మవారి శేష వస్త్రాలు, వెండిడాలరు అందించి వేదాశీర్వచనం చేయిస్తామన్నారు.