అమ్మకు ‘వంద’నం
- శతవసంతాల నాగలక్ష్మమ్మ
- రేపు బామ్మకు శతజయంతి వేడుకలు
- కనకాభిషేకం చేయనున్న కుమారుడు
కర్నూలు(హాస్పిటల్): శతమానం భవతిః అంటే నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వాదం. ఈ ఆశార్వాదం కర్నూలు నగరానికి చెందిన నాగలక్ష్మమ్మకు అక్షరాలా వర్తిస్తుంది. ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదు. తినడానికి కొదవలేదు. ఉండటానికి ఇబ్బంది లేదు. ఈ నేపథ్యంలో ఆమె ఈ నెల 28వ తేదిన నూరేళ్లు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె చిన్నకుమారుడు కనకాభిషేక మహోత్సవం ఏర్పాటు చేశారు. గూడూరు మండలం నాగలాపురం గ్రామానికి చెందిన కమలాపురం సుంకయ్య భార్యే నాగలక్ష్మమ్మ. వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే వీరికి ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. 45 ఏళ్ల క్రితం నాగలక్ష్మమ్మ భర్త అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి కర్నూలు నగరంలోని వన్‌టౌన్ ప్రాంతంలోని రాములవారి దేవాలయం వద్ద నివసిస్తున్న కె. శేషగిరిశెట్టి వద్దే ఉంటున్నారు. ఆయన జమ్మిచెట్టు ప్రాంతంలో కేబుల్ టీవీ(డిష్) బాధ్యతలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. నాగలక్ష్మమ్మ పెద్ద కుమారుడు వెంకట్రామయ్య(85) బంగారుపేటలో ఉంటున్నారు. నాల్గవ కుమారుడైన లక్ష్మయ్య శెట్టి(70) నాగులాపురంలో వ్యవసాయం చేస్తున్నారు. 5వ కుమారుడైన కృష్ణమూర్తిశెట్టి (65) హైదరాబాద్‌లో ఉంటున్నారు. నాగలక్ష్మమ్మకు ప్రస్తుతం కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మునిమనవళ్లు, మునిమనవరాళ్లు, అనిమనవళ్లు, అనిమనవరాళ్లు కలిపి మొత్తం 148 మంది ఉన్నారు.
మితాహారం, దైవారాధనే ఆరోగ్య రహస్యం
వందేళ్లు పూర్తి చేసుకున్న నాగలక్ష్మమ్మ ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటారు. ఆమెకు ఎలాంటి అనారోగ్యమూ దరిచేరలేదు. చపాతి, కొర్రన్నం, జొన్నరొట్టెను సైతం ఆరగించి అరిగించుకుంటారు. ప్రతి నిత్యం కాసేపు నడక, తన పనులు తానే చేసుకోవడం, ఇంటి సమీపంలో ఉన్న రామాలయం వెళ్లి దైవారాధన చేసుకోవడం, వార్తాపత్రికలు తిరగేయడం ఆమె దినచర్య. ఎలాంటి మానసిక ఒత్తిళ్లు, అసూయ, ద్వేషం లేకుండా జీవించడమే తన ఆరోగ్య రహస్యమని నాగలక్ష్మమ్మ చెప్పారు.
నాగలక్ష్మమ్మకు కనకాభిషేక మహోత్సవం
శతవసంతాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నాగలక్ష్మమ్మకు ఆమె చిన్నకుమారుడు కమలాపురం శేషగిరిశెట్టి తన అదృష్టానికి సంతోషిస్తూ ఈ నెల 28వ తేదీన స్థానిక పూలబజార్‌లోని చిన్న అమ్మవారి శాలలో కనకాభిషేక మహోత్సవ ఏర్పాట్లు చేశారు. ఆమె శేషజీవితం సుఖమయంగా సాగాలని ప్రార్థిస్తూ గణపతిపూజ, గణపతి హోమం, రుద్రాభిషేకం, నవగ్రహ హోమం, ఆయుష్య హోమం, సూర్యనారాయణ హోమం, సుదర్శనహోమం, పూర్ణాహుతితో పాటు శ్రీ లలితాసహస్రనామావళి పారాయణం,సాయినాథుని భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆమె స్వగోత్రీయులు 148 మందితో పాటు బంధువులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.