జేసీని చేర్చుకుంటే చస్తాం... : మురళీప్రసాదరెడ్డి
* అనంత తెలుగుయువత అధ్యక్షుడు కందిగోపుల కన్నీరు
* సి.ఎం.రమేష్ నాకు పురుగు మందు కొనిస్తామన్నారు
* ఎక్కువ మాట్లాడితే మెడపట్టి బయటకు గెంటమన్నారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు చెందిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డిని టీడీపీలో చేర్చుకుంటే పురుగు మందు తాగి చస్తామని అనంతపురం జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు కందిగోపుల మురళీప్రసాదరెడ్డి హెచ్చరించారు. ఇదే మాటను ఈ అంశంపై తనను పిలిచి మాట్లాడిన పార్టీ అధినేత చంద్రబాబు సన్నిహితుడు సి.ఎం.రమేష్‌తో అంటే.. ‘నీవు మగాడివైతే తాగి చావు, నీవు పురుగు మందు కొని తెచ్చుకునేది ఎందుకు.. నేనే కొనిస్తా’ అంటూ దారుణంగా వ్యవహరించారని కందిగోపుల ఆ తరువాత మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. జేసీ చేరికను కందిగోపుల తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఆయన్ను సముదాయించే బాధ్యతను తన కోటరీలోని ముఖ్యుడు సి.ఎం.రమేష్‌కు అప్పగించారు. కందిగోపులను సోమవారం మాజీ ఎంపీ కాలువ శ్రీనివాసులు వెంట బెట్టుకుని రమేష్ నివాసానికి చేరుకున్నారు.
జేసీ చేరికపై చర్చ సందర్భంగా ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా జేసీని చేర్చుకుంటే తాము పురుగుల మందు తాగి చస్తామని హెచ్చరించగా, రమేష్ ఏమాత్రం ఖాతరు చేయకుండా నీ ఇష్టమొచ్చింది చేసుకోమని వ్యాఖ్యానించారని.. ఎక్కువ మాట్లాడితే మెడపెట్టి గెంటేయండని భద్రతా సిబ్బందికి సూచించారని కందిగోపుల తెలిపారు. జేసీ లాంటి వారిని చేర్చుకుంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఏసీ గదుల్లో కూర్చోబెట్టుకుని రాచమర్యాదలు చేస్తున్నారని, తమ లాంటి నిజమైన కార్యకర్తలను చంద్రబాబు కలవనివ్వటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పార్టీలో సీటు వస్తుంది కాబట్టే జేసీ లాంటి వారు చేరుతున్నారని, రేపు మరో పార్టీ సీటు ఇచ్చి గెలిపిస్తామంటే అందులో చేరతారని అన్నారు. జేసీ లాంటి వారిని చేర్చుకుంటే సీఎం రమేష్ తమకు విషం కొనివ్వక్కర్లేదని, తామే కొనుక్కొని బాబు ఇంటి ముందు తాగి చస్తామని హెచ్చరించారు.