Kanhaiya Lal
-
కస్టడీకి ‘అమరావతి’ సూత్రధారి
అమరావతి(మహారాష్ట్ర): అమరావతికి చెందిన కెమిస్ట్ ఉమేశ్ కోల్హె హత్య కేసులో ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్(35)కు కోర్టు ఈ నెల 7వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. శనివారం నాగపూర్‌లో అరెస్ట్ చేసిన ఇర్ఫాన్‌ఖాన్‌ను ఆదివారం ఎన్ఐఏ బృందం కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ప్రశ్నించింది. అనంతరం అతడిని డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో హాజరుపరచగా 7వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించినందుకు ఉమేశ్ కోల్హెను దుండగులు జూన్ జూన్ 21వ తేదీన హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇర్ఫాన్ ఖాన్ ఏడో నిందితుడు. అమరావతికి చెందిన ఉమేశ్‌కు వెటరినరీ మందుల దుకాణం ఉంది. ఈయన వెటరినరీ వైద్యులతో కూడిన వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఇర్ఫాన్ ఖాన్ సభ్యుడు. ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఇర్ఫాన్ రాహ్బర్ అనే స్వచ్ఛంద సంస్థను కూడా నిర్వహిస్తున్నాడు. వాట్సాప్ గ్రూప్‌లో నుపుర్ శర్మకు అనుకూలంగా ఉమేశ్ పెట్టిన పోస్టుపై ఇర్ఫాన్ ఆగ్రహంతో ఉన్నాడు. ఇతడే ఉమేశ్ హత్యకు పథకం వేసి, కొందరికి బాధ్యతలు అప్పగించాడు. వీరిలో నలుగురు ఇతడి స్వచ్ఛంద సంస్థకు చెందిన వారే. ఉమేశ్ హత్య అనంతరం అంత్యక్రియల్లో కూడా ఇర్ఫాన్ పాల్గొన్నాడు. కన్హయ్యాలాల్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఏకే ఈ కేసును కూడా అప్పగిస్తున్నట్లు హోం శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన సమాచారం అధికారంగా అందాల్సి ఉందని అమరావతి పోలీస్ కమిషనర్ ఆర్తి సింగ్ చెప్పారు. దర్జీ హత్యపై భారీ నిరసన ర్యాలీ ఉదయ్‌పూర్‌లో కన్హయ్యాలాల్ అనే దర్జీ దారుణ హత్యకు నిరసనగా జైపూర్‌లో ఆదివారం భారీ ర్యాలీ జరిగింది. -
మహారాష్ట్రలో కెమిస్ట్ దారుణ హత్య
నాగపూర్: మహారాష్ట్రలోని అమరావతి నగరంలో దారుణం జరిగింది. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టును షేర్ చేశాడన్న కారణంతో 54 ఏళ్ల కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాదరావు కొల్హేను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. జూన్ 21న ఈ సంఘటన జరిగిందని, ఇప్పటిదాకా ఆరుగురిని అరెస్టు చేశామని అమరావతి పోలీసు కమిషనర్ డాక్టర్ ఆర్తీసింగ్ శనివారం తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ (32)ను నాగపూర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్యలాల్ హత్య కంటే వారం ముందే ఉమేశ్ హత్య జరిగినట్లు స్పష్టమవుతోంది. నుపుర్ శర్మకు మద్దతుగా నిలిచినందుకు కన్హయ్యలాల్‌ను ఇద్దరు వ్యక్తులు పొడిచి చంపేసిన సంగతి తెలిసిందే. ఉమేశ్ అమరావతి సిటీలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతుగా వాట్సాప్ గ్రూప్‌ల్లో ఒక పోస్టును షేర్ చేశాడని పోలీసులు చెప్పారు. సదరు గ్రూపుల్లో అతడి కస్టమర్లతోపాటు కొందరు ముస్లింలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఉమేశ్‌పై కక్ష పెంచుకున్న ఇర్ఫాన్ ఖాన్ అతడిని హత్య చేయాలని పథకం రచించాడని, ఇందుకోసం ఐదుగురిని రంగంలోకి దింపాడని తెలిపారు. హత్య చేస్తే రూ.10,000 ఇస్తానని, పోలీసులకు దొరక్కుండా పారిపోవడానికి కారు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడని వివరించారు. జూన్ 21న రాత్రి 10 నుంచి 10.30 గంటల మధ్య దుకాణం మూసివేసి, ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ఉమేశ్‌ను మెడపై పదునైన కత్తితో నరికి, హత్య చేశారని వెల్లడించారు. నిందితులంతా కూలీలు.. ఉమేశ్ కుమారుడి ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్ ఖాన్, ముదాసిర్ అహ్మద్(22), షారుఖ్ పఠాన్(25), అబ్దుల్ తౌఫిక్(24), షోయబ్ ఖాన్(22), అతీబ్ రషీద్(22)పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. వీరంతా అమరావతి వాసులేనని, రోజు కూలీలుగా పనిచేస్తున్నారని చెప్పారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్య దృశ్యాలు నమోదైన సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)ను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అమరావతికి ఎన్ఐఏ బృందం అమరావతిలో కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాదరావు హత్యపై ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి శనివారం ట్విట్టర్లో వెల్లడించారు. ఉమేశ్ హత్య కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో నిజానిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. ఎన్ఐఏ బృందం శనివారం అమరావతికి చేరుకుంది. ఆదివారం నుంచి దర్యాప్త చేపట్టనుంది. మహారాష్ట్ర పోలీసు శాఖకు చెందిన యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) టీమ్ కూడా ఔరంగబాద్ నుంచి అమరావతికి వచ్చింది. ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్యలాల్ హత్యపై ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన విషయం విదితమే. కన్హయ్య కుటుంబానికి రూ.కోటి విరాళంగా సమకూర్చి అందజేస్తామని బీజేపీ ప్రకటించింది. -
స్వచ్ఛందం పేరిట వసూళ్ల దందా
ఉదయ్‌పూర్: కన్హయ్యాలాల్ హత్య కేసులో ప్రధాన నిందితులిద్దరికీ దావత్–ఇ–ఇస్లామ్ అనే సంస్థతో సంబంధాలున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ సరిహద్దు జైసల్మేర్, బర్మేర్ ప్రాంతాల్లో ఉగ్రవాద ప్రచార కార్యక్రమాల కోసం స్థానికుల నుంచి విరాళాలను సేకరిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. నెల క్రితం సుమారు రూ.20 లక్షలను ఇస్లాం స్వచ్ఛంద సేవాకార్యక్రమాల కోసమంటూ విరాళాలను సేకరించిందని, ఒక రాజకీయ నేత కూడా రూ.2 లక్షలను అందించారని తేల్చాయి. వివరణ కోసం ప్రయత్నించగా ఆ నేత స్పందించడం లేదని తెలిపాయి. నిందితులు జ్యుడీషియల్ కస్టడీకి ఉదయ్‌పూర్‌లో దర్జీని పొట్టనబెట్టుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు ప్రధాన నిందితులైన రియాజ్ అఖ్తారీ, గౌస్ మొహమ్మద్‌ల ను భారీ బందోబస్తు మధ్య ఉదయ్‌పూర్ కోర్టుకు తీసుకువచ్చారు. ఐడెంటిఫికేషన్ కోసం కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. కన్హయ్యాలాల్ హత్యను నిరసిస్తూ ఉదయ్‌పూర్‌లో భారీ ర్యాలీ జరిగింది.ఉదయ్‌పూర్‌లోని కన్హయ్యాలాల్ ఇంటికి సీఎం సీఎం అశోక్ గహ్లోత్ వెళ్లారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, నిందితులకు సాధ్యమైనంత త్వరగా శిక్షలు పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.. -
నా అకౌంట్ లోకి 15 లక్షలు ఎప్పుడొస్తాయి?
న్యూఢిల్లీ: నా ఖాతాలోకి రూ.15 లక్షలు ఎప్పుడొస్తాయి? అని రాజస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ప్రధాన మంత్రి కార్యాలయా(పీఎంవో)నికి దరఖాస్తు చేశాడు. అతనికి 15 రోజుల్లోపు సమాచారమివ్వాల్సిందిగా పీఎంవోను కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘నల్ల ధనాన్ని వెనక్కి రప్పించి, దేశంలోని ప్రతి పేదవాడికి రూ.15 లక్షలిస్తా’ అని మోదీ హామినిచ్చారనీ, ఆ హామీ అమలు ఎంతవరకు వచ్చిందో చెప్పాలని ఝాలావాడ్ జిల్లాకు చెందిన కన్హయ్య లాల్ పీఎంవో సహ చట్టం కింద దరఖాస్తు చేశారు. దేశం నుంచి అవినీతిని తరిమికొట్టడానికి కొత్త చట్టం ఎప్పుడు తెస్తారో కూడా చెప్పాలని కన్హయ తన దరఖాస్తులో పేర్కొన్నాడు. రైలు ప్రయాణాల్లో వృద్ధులకు 40 శాతం రాయితీని ఇస్తూ యూపీఏ తీసుకొచ్చిన పథకాన్ని తొలగించే ఆలోచన ఏదైనా ఉందా అని కూడా కన్హయ్య అడిగారు. సమాధానం లేకపోవడంతో ఆయన అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించారు. విచారణకు వచ్చిన పీఎంవో అధికారి తమ వాదన వినిపిస్తూ, అర్జీ తమ వద్దకు రాలేదనీ, అందుకే సమాచారమివ్వలేక పోయామని చెప్పారు. 15 రోజుల్లో కన్హయ్యకు సమాచారం ఇవ్వాలని ప్రధాన సమాచార కమిషనర్ రాధాకృష్ణ మాథూర్ పీఎంవోను ఆదేశించారు.