నాగపూర్: మహారాష్ట్రలోని అమరావతి నగరంలో దారుణం జరిగింది. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టును షేర్ చేశాడన్న కారణంతో 54 ఏళ్ల కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాదరావు కొల్హేను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. జూన్ 21న ఈ సంఘటన జరిగిందని, ఇప్పటిదాకా ఆరుగురిని అరెస్టు చేశామని అమరావతి పోలీసు కమిషనర్ డాక్టర్ ఆర్తీసింగ్ శనివారం తెలిపారు.
పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ (32)ను నాగపూర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్యలాల్ హత్య కంటే వారం ముందే ఉమేశ్ హత్య జరిగినట్లు స్పష్టమవుతోంది. నుపుర్ శర్మకు మద్దతుగా నిలిచినందుకు కన్హయ్యలాల్‌ను ఇద్దరు వ్యక్తులు పొడిచి చంపేసిన సంగతి తెలిసిందే. ఉమేశ్ అమరావతి సిటీలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతుగా వాట్సాప్ గ్రూప్‌ల్లో ఒక పోస్టును షేర్ చేశాడని పోలీసులు చెప్పారు.
సదరు గ్రూపుల్లో అతడి కస్టమర్లతోపాటు కొందరు ముస్లింలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఉమేశ్‌పై కక్ష పెంచుకున్న ఇర్ఫాన్ ఖాన్ అతడిని హత్య చేయాలని పథకం రచించాడని, ఇందుకోసం ఐదుగురిని రంగంలోకి దింపాడని తెలిపారు. హత్య చేస్తే రూ.10,000 ఇస్తానని, పోలీసులకు దొరక్కుండా పారిపోవడానికి కారు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడని వివరించారు. జూన్ 21న రాత్రి 10 నుంచి 10.30 గంటల మధ్య దుకాణం మూసివేసి, ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ఉమేశ్‌ను మెడపై పదునైన కత్తితో నరికి, హత్య చేశారని వెల్లడించారు.
నిందితులంతా కూలీలు..
ఉమేశ్ కుమారుడి ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్ ఖాన్, ముదాసిర్ అహ్మద్(22), షారుఖ్ పఠాన్(25), అబ్దుల్ తౌఫిక్(24), షోయబ్ ఖాన్(22), అతీబ్ రషీద్(22)పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. వీరంతా అమరావతి వాసులేనని, రోజు కూలీలుగా పనిచేస్తున్నారని చెప్పారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్య దృశ్యాలు నమోదైన సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)ను నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
అమరావతికి ఎన్‌ఐఏ బృందం
అమరావతిలో కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాదరావు హత్యపై ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి శనివారం ట్విట్టర్‌లో వెల్లడించారు. ఉమేశ్ హత్య కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో నిజానిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. ఎన్‌ఐఏ బృందం శనివారం అమరావతికి చేరుకుంది. ఆదివారం నుంచి దర్యాప్త చేపట్టనుంది. మహారాష్ట్ర పోలీసు శాఖకు చెందిన యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) టీమ్ కూడా ఔరంగబాద్ నుంచి అమరావతికి వచ్చింది. ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్యలాల్ హత్యపై ఎన్‌ఐఏ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన విషయం విదితమే. కన్హయ్య కుటుంబానికి రూ.కోటి విరాళంగా సమకూర్చి అందజేస్తామని బీజేపీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment