జయలలిత జీవిత కథతో అమ్మ
అక్రమ ఆస్తుల కేసులో దోషిగా జైలు జీవితం అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ వెండితెరకెక్కుతోంది. నటిగా చలన చిత్ర పరిశ్రమలోను, ముఖ్యమంత్రిగా రాజకీయాల్లోనూ విప్లవ నాయకురాలిగా చరిత్ర సృష్టించిన జయలలిత జీవితం సంచలనాల మయం. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ‘అమ్మ’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. జయలలితగా ప్రముఖ కన్నడ నటి రాగిణీ ద్వివేది నటిస్తున్నారు.
ఇప్పటి వరకు తమిళ, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తొలిసారిగా హిందీ, తెలుగు భాషలకు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఫైజల్ సైఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలను ముంబయ్, బెంగళూరుల్లో చిత్రీకరించారు. కాగా, చిత్రంలో జయలలిత అరెస్టు అయ్యి జైలుకెళ్లే సన్నివేశాలు కూడా చోటు చేసుకుంటాయని దర్శకుడు అంటున్నారు.
కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడిగా పేరొందిన ఈయన ఇటీవల ‘మై హూ రజనీకాంత్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం తన ఇమేజ్‌కు భంగం కలిగించేదిగా ఉందంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ చిత్రం విడుదలపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఇప్పుడు జయలలిత జీవిత చరిత్రతో సినిమా తీస్తున్నారు కాబట్టి... కచ్చితంగా వివాదాలు ఎదురవుతాయన్నది పలువురి ఊహ.