Kanteru
-
Guntur: కంతేరులో నల్లపు సునీత ఆత్మహత్యాయత్నం
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ చేస్తున్న స్వార్ధ రాజకీయాలపై మనస్థాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం కంతేరులో ఈ ఘటన జరిగింది. వ్యక్తిగత గొడవను రాజకీయరంగు పులమడంపై మనస్థాపం చెందిన నల్లపు సునీత అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, సోమవారం రోజున నల్లపు సునీత మాట్లాడుతూ.. రెండు కుటుంబాల మధ్య గొడవకు రాజకీయ రంగు పులిమి తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తాడికొండ మండలం కంతేరుకు చెందిన బాధితురాలి తల్లి నల్లపు సునీత ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య వచ్చిన గొడవకు, టీడీపీ నాయకులకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. తానూ టీడీపీకి చెందిన మహిళనేనని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డును చూపించారు. తనతో పాటు వైఎస్సార్సీపీకి చెందిన వారిని కూడా బయటకు లాగి తప్పుడు కేసులు పెట్టించడం దుర్మార్గమని అన్నారు. ఆడపిల్లపై బురదచల్లి రోడ్డుపైకి లాగడం న్యాయమేనా అని ప్రశ్నించారు. భర్తలేని తను చిన్న టీ కొట్టు పెట్టుకొని జీవిస్తున్నానని, ఆడపిల్లకు పెళ్ళి చేయాలంటే తన పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు రక్షణ కల్పించి, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండి: (యువతితో అసభ్యంగా ప్రవర్తించిన వెంకాయమ్మ కుమారుడు.. బాబు డైరెక్షన్లో..) -
యువతితో అసభ్యంగా ప్రవర్తించిన వెంకాయమ్మ కుమారుడు.. బాబు డైరెక్షన్లో..
కంతేరు(తాడికొండ): తాడికొండ మండలం కంతేరు గ్రామంలో టీడీపీ కార్యకర్త కర్లపూడి వెంకాయమ్మ కొడుకు వంశీ గ్రామంలోని ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పంచాయితీ పెట్టారు. దీనిపై ఇరు కుటుంబాల మధ్య రెండురోజులుగా వివాదం నడుస్తోంది. ఈనేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం వెంకాయమ్మ, ఆమె కొడుకు వంశీ ఆ యువతి కుటుంబ సభ్యులపై తిట్లదండకం అందుకున్నారు. దాడికి యత్నించారు. వారి నుంచి రక్షణగా యువతి కుటుంబ సభ్యులు ఎదురుదాడికి యత్నించారు. దీంతో రాజకీయ రంగు పులిమేందుకు టీడీపీ నేతలు యత్నించారు. వైఎస్సార్ సీపీ నేతలు దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలంటూ హడావుడి చేశారు. ఆ తర్వాత ఇరువర్గాలూ ఫిర్యాదులు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు గాయపడినట్టు చెబుతున్న వంశీని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మాజీ మంత్రి నక్కా ఆనందబాబుతోపాటు ఒక్కొక్కరిగా టీడీపీ నేతలు తాడికొండ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ దుర్గా ప్రసాద్, ఎస్ఐ వెంకటాద్రితో వాగ్వివాదానికి దిగారు. యువతిపై అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు వచ్చిందని చెబుతున్నా పట్టించుకోకుండా వెంకాయమ్మ కొడుకుపై కేసు ఎందుకు నమోదు చేశారంటూ వాదనకు దిగారు. చదవండి: (ఏది నిజం?: బాబు కోసమే ఆ ‘మత్తు’!! ) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఫోన్ కలిపి వెంకాయమ్మతో మాట్లాడించి ఎల్లో మీడియా ఎదుట లేనిది ఉన్నట్లు సృష్టించే యత్నం చేశారు. బాధితురాలి బంధువులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయికి వత్తాసు పలుకుతారా.. అంటూ టీడీపీ నేతలను నిలదీశారు. దీంతో ఓ దశలో పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఇరువర్గాలకూ నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు.