karate prabhakar
-
కరాటే ప్రభాకర్ మృతి
సాక్షి, మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రభాకర్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. చెన్నూర్‌కు చెందిన వడ్లకొండ ఎల్లయ్య, ఎల్లమ్మ దంపతుల చిన్న కుమారుడు ప్రభాకర్ (కరాటే ప్రభాకర్) మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టి వాడ వంద ఫీట్ల రోడ్ సమీపంలో గత నెల 25న ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాలుకాగా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అవయవాలు దానం... ప్రభాకర్ అంగీకారం మేరకు ఆయన అవయవాలను అతని కుటుంబసభ్యులు దానం చేశారు. అందరికి మార్గదర్శకంగా నిలిచాడు. కరాటేలో ప్రావీణ్యుడు చిన్నతనం నుంచే కరాటేపై ఉన్న మక్కువతో ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్ సైతం కైవసం చేసుకున్నాడు. పలుమార్లు జాతీయస్థాయి కరాటే పోటీల్లో పాల్గొని గోల్డ్‌మెడల్స్ సాధించాడు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా కోశాధికారిగా పనిచేశాడు. నేటి యువతకు ఆత్మరక్షణ అవసరమని ఉచితంగా మంచిర్యాల జిల్లాలోని పలు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాడు. తద్వారా తన ఇంటిపేరు కరాటేగా ముద్ర పడిపోయింది. వడ్లూరి ప్రభాకర్ అంటే ఎవరికీ తెలియదు.. కరాటే ప్రభాకర్ అంటేనే రెవెన్యూ అధికారులు, తన స్నేహితులకు తెలుస్తుంది. నేడు అంత్యక్రియలు అవయవదానం అనంతరం నేడు ప్రభాకర్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. జైపూర్ మండలంలోని చెన్నూర్‌లో ఉన్న ప్రభాకర్ వ్యవసాయ భూమిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
కరాటే ప్రభాకర్ ఇంట్లో పేకాట
ప్రభాకర్‌తోపాటు ఆరుగురి అరెస్ట్ రూ.6.61 లక్షల నగదు స్వాధీనం ఏసీపీ సురేంద్రనాథ్ వెల్లడి వరంగల్: కాంగ్రెస్ నాయకుడు కొయ్యడ ప్రభాకర్ అలియాస్ కరాటే ప్రభాకర్ ఇంట్లో పేకాట ఆడుతుండగా ఏడుగురిని వరంగల్ ఏసీపీ సురేంద్రనాథ్ నేతృత్వంలో మిల్స్‌కాలనీ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఏసీపీ కథనం ప్రకారం... వరంగల్ అండర్ బ్రిడ్జి శివనగర్ సమీపంలోని కరాటే ప్ర భాకర్ ఇంట్లో మూడు ముక్కల పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మిల్స్‌కాలనీ సీఐ వేణు, ఎస్సై రవీందర్, పీఎస్సై సాయన్న తనిఖీలు నిర్వహించారు. ఇంటి రెండో ఫ్లోర్లో మద్యం తాగుతూ పేకాట ఆడుతున్న కరాటే ప్రభాకర్‌తోపాటు వరంగల్ నగరానికి చెందిన కూర మధూకర్, గుజ్జ నరేష్, బోడకుంటి రవిశంకర్, అడువాల సూర్యనారాయణ, పోతి రెడ్డి పాపిరెడ్డి, సాటింపు నాగేశ్వర్రావును అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 6లక్షల 61 వేల 910స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌కు తరలించిన ట్లు ఏసీపీ తెలిపారు. కాగా కరాటే ప్రభాకర్ గతంలో శ్రీనివాస ట్రస్ట్ క్లబ్ పెట్టి నడిపిస్తుండగా ఇంతెజార్గంజ్ పోలీస్టేషన్లో బైండోవర్ చేసినట్లు చెప్పారు. ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పోలీ సులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
కొట్టుకున్న చిరంజీవి అభిమాన సంఘం నేతలు
కరీంనగర్: చిరంజీవి అభిమాన సంఘం నేతల విభేదాలు కొట్లాటకు దారితీశాయి. దీనిపై పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం వెంకట్రావుపల్లిలో ఆదివారం చిరంజీవి అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమానికి సంఘం రెండు రాష్ట్రాల అధ్యక్షులు కరాటే ప్రభాకర్, స్వామి నాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన విందు అనంతరం నాయకులంతా సాయంత్రం 5 గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. గ్రామం సమీపంలోని రైల్వేగేట్ సమీపంలో గోదావరిఖనికి చెందిన సంఘం నేత రాము, అతని అనుచరులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కరాటే ప్రభాకర్‌పై దాడికి దిగారు. దీనిపై ప్రభాకర్ ఫిర్యాదు మేరకు పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనపై సినీ నటుడు చిరంజీవికి కూడా సమాచారం అందించినట్లు నాయకులు తెలిపారు.