karimanagr
-
అక్బర్ ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కరీంనగర్లో ప్రసంగంలో ఎలాంటి విద్వేషపూరిత, రెచ్చ గొట్టే వ్యాఖ్యలు లేవని న్యాయ నిపుణులు తేల్చి నట్టు నగర పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నెల 23న కరీంనగర్లో జరిగిన సభలో అక్బర్ పాల్గొన్నారు. ఈ సభలో ఒక వర్గం మనోభావాలను కించపరిచే విధంగా, విద్వేషాలను రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ ప్రసంగించారని మూడు రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వైరల్ అయింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాలని కమిషనర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా తానెలాంటి విద్వేషపూరిత ప్రసంగం చేయలేదని వివరణ ఇచ్చారు. ‘ముందు జాగ్రత్త చర్యగా అక్బరుద్దీన్ ప్రసంగాన్ని రికార్డు చేయించాం. ఆ వీడియోను అనువాద నిపుణుల సహాయంతో ట్రాన్స్‌లేట్ చేయించి, వీడియో రికార్డింగును, అనువాద ప్రతిని న్యాయ నిపుణుల సలహా కోసం పంపించాం. అయితే.. ఆ వీడియో ప్రసంగంలో ఎటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు గానీ, రెచ్చగొట్టే పదాలు గానీ లేవని , ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెప్పారు’’అని సీపీ తెలిపారు. ఈ మేరకు ఎలాంటి కేసు నమోదు చేయడం లేదని స్పష్టం చేశారు. -
అద్దెలపై బల్దియా దృష్టి
సాక్షి, కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఏళ్ల తరబడిగా ఖాళీగానే ఉంటున్న షట్లర్లను అద్దెలకు ఇచ్చేందుకు బల్దియా నడుం బిగించింది. ఆదాయ వనరులను పెంచుకునేందుకు ఉన్న వనరులను ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో ఉన్న రాజీవ్‌గాంధీ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఖాళీగా ఉన్న షట్టర్లను అద్దెలకు ఇచ్చేందుకు వేలం పాటకు సిద్ధపడుతున్నారు. వీటికి తోడు రెండేళ్ల క్రితం ఐడీఎస్ఎంటీ నిధులతో నిర్మించిన నూతన షాపింగ్ కాంప్లెక్స్‌లో కూడా షట్టర్లను అద్దెలకు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. అద్దెల ద్వారా రూ.లక్షల్లో ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇన్నాళ్లు వేలం పాటలో ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆదాయం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో ఒకటి రెండు సార్లు దుకాణాలకు వేలం పాట వేస్తున్నామని హడావిడి చేసినప్పటికీ వేలం వేయకుండానే చేతులు దులుపుకున్నారు. మున్సిపల్ ఆవరణలో ఉన్న షాపింగ్‌కాంప్లెక్స్‌లో దాదాపు నాలుగేళ్లుగా పైఅంతస్తులో 14 గదులు ఖాళీగా ఉంటున్నాయంటే అధికారులు ఏమేరకు శ్రద్ధ వహిస్తున్నారో అర్థమవుతోంది. మున్సిపల్ పాత గెస్ట్‌హౌస్ స్థలంలో ఐడీఎస్‌ఎమ్‌టీ నిధులు రూ.3.5కోట్లతో 42 షెట్టర్లను నిర్మించారు. అద్దెలకు ఇస్తే వాటిపై కూడా ఆదాయం వస్తుంది. ఇప్పటికే కాంప్లెక్స్ సెల్లార్లో పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు. గతంలో వేలం నిర్వహించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఎవరూ అద్దెలకు రాలేదు. అయితే ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా ఎలాగైనా అద్దెలకు ఇవ్వాలని అధికారులు పట్టుదలతో ఉన్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు నగరపాలక సంస్థ ఆవరణలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న దుకాణాలను కొంత మంది అద్దెలకు తీసుకుని ఇతరులకు ఎక్కువ కిరాయికి ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి వారిని గుర్తించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇలాంటి వారిపై ఉదాసీనంగా వ్యవహరించకుండా కఠినంగా ఉండి, అద్దె అగ్రిమెంట్ గడువు ముగియడంతోనే వారిని ఖాళీ చేయించేందుకు నోటీసులు సిద్ధం చేస్తున్నారు. అద్దెలకు తీసుకున్న వారు తప్ప ఇతరులు ఎవరైనా ఆ దుకాణాల్లో వ్యాపారం నిర్వహిస్తే మున్సిపల్ నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అద్దెలపై దృష్టి సారించాం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఖాళీగా ఉన్న షెట్టర్లతోపాటు ఐడీఎస్‌ఎమ్‌టీ నిధులతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌లోనూ షెట్లర్లు అద్దెకు ఇచ్చేందుకు దృష్టిసారించాం. ప్రస్తుతం అద్దెలకు తీసుకున్న షెట్టర్లలో ఇతరులు వ్యాపారం చేస్తే ఖాళీ చేయిస్తాం. అదనపు అద్దెల కోసం అక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి గడువు ముగిశాక ఇతరులకు ఇవ్వడం జరుగుతుంది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు చేపడతాం. – సత్యనారాయణ, కమిషనర్ -
దూసుకెళ్లిన కారు
హుజూరాబాద్‌రూరల్: మూడో విడత పంచాయతీలు ఎన్నికలు బుధవారం ప్రశాం తంగా జరిగాయి. హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, వి.సైదా పూర్ మండలాల్లో తుది దశ ఎన్నికలు నిర్వహించారు. 109 గ్రామపంచాయతీలకు గాను, 13 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 96 గ్రామపంచాయతీల్లోని సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అలాగే 1024 వార్డులకు గాను 1210 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా... ఏకగ్రీవ పంచాయతీలతో కలుపుకుని మొత్తం 817 పంచాయతీలలో టీఆర్ఎస్ మద్దతుదారులు విజయఢంకా మోగించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు దీటుగా.. టీఆర్ఎస్కు పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటర్లు పట్టం కట్టారు. బుధవారం జరిగిన మూడో విడతలో మొత్తం 407 పంచాయతీలకు గాను రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గొల్లపల్లిలో ఎన్నిక వాయిదా పడ్డాయి. ఎన్నికలు జరిగిన 406 పంచాయతీల్లో టీఆర్ఎస్ 279, కాంగ్రెస్ 55 బీజేపీ 15, టీడీపీ 02, స్వతంత్రులు 55 స్థానాల్లో గెలుపొందారు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఈ విడతలో కాంగ్రెస్‌కు అత్యధికంగా 40 చోట్ల విజయం చేకూరింది. అసెంబ్లీ ఎన్నికల విజయఢంకా మోగించిన టీఆర్ఎస్.. పంచాయతీ ఎన్నికల్లోను జోరు కొనసాగడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. మూడు విడతల్లోనూ ఆధిక్యమే... ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1210 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ మూడు విడతల్లో కూడా అత్యధికంగా టీఆర్ఎస్ మద్దతుదారులే సర్పంచ్‌లుగా విజయం సాధించారు. 21న మొదటి విడతలో మొత్తం 414 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా టీఆర్ఎస్ 289, కాంగ్రెస్ 82 చోట్ల గెలుపొందగా, బీజేపీ ఎనిమిది, టీడీపీ 03 స్వతంత్రులు 32 చోట్ల విజయం సాధించారు. రెండో విడతలో 389 పంచాయతీలకు 249 టీఆర్ఎస్, 68 కాంగ్రెస్, 16 బీజేపీ, 01 టీడీపీ, 07 సీపీఐ, 48 స్వతంత్రులు గెలుచున్నారు. బుధవారం జరిగిన మూడో విడతలో 407 పంచాయతీలకు 279 టీఆర్ఎస్ మద్దతుదారులు ఎన్నిక కాగా, 55 కాంగ్రెస్, 15 బీజేపీ, టీడీపీ 02, స్వతంత్రులు 55 గెలుచుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన మూడు విడతల ఎన్నికల్లో బీజేపీ 39 స్థానాలకు పరిమితం కాగా, సీపీఐ ఏడింట గెలిచింది. తెలుగుదేశం పార్టీ ఫలితాలు మరింతగా దిగజారిపోయాయి. కేవలం ఆరు స్థానాలకే పరిమిత కావాల్సి వచ్చింది. 2013లో ఎన్నికల్లో 379కే టీఆర్ఎస్ పరిమితం... 2013లో పూర్వ కరీంనగర్ జిల్లాల్లో 1207 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే.. 379 గ్రామాల్లో టీఆర్ఎస్, 372 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. 137 టీడీపీ, 37 బీజేపీ, 30 వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. 17 చోట్ల సీపీఐ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, 235 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించారు. అయితే 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘గ్రామాలు అభివృద్ధి బాటన నడవాలంటే అధికార పార్టీ పంచన చేరడమే మేలని’ భావించిన చాలా మంది సర్పంచ్‌లు ప్లేట్ ఫిరాయించారు. దీంతో మూడింట రెండు వంతులకు పైగా గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసింది. జిల్లాలో ఇద్దరు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహించడం, జగిత్యాల నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండటంతో పలువురు ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. గతేడాది ఆగస్టు 2న సర్పంచ్‌లు పదవీ విరమణ చేసే నాటికి 942 మంది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లుగా అప్పట్లో ప్రకటించారు. తాజా ఎన్నికల్లో మొత్తం 1210 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా... ఏకగ్రీవ పంచాయతీలో కలుపుకుని మొత్తం 817 పంచాయతీలలో టీఆర్ఎస్ మద్దతుదారులు విజయఢంకా మోగించడంతో ఉమ్మడి జిల్లాలో గులాబీ గుబాళించింది. -
క్లైమాక్స్‌లో డీసీసీలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కమిటీలపై కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాల కమిటీలను రద్దు చేసి ఏ జిల్లాకు ఆ జిల్లాగా కమిటీలు వేయాలని ఏఐసీసీ, టీపీసీసీ ఇప్పటికే ఆదేశించాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లికి జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఖరారు చేసే పనిలో నాయకత్వం నిమగ్నమైంది. ఏఐసీసీ, టీపీసీసీ అత్యవసర సమావేశం అనంతరం తక్షణమే జిల్లా కమిటీల ఏర్పాటు చేయాలని ఈ నెల 5న అన్ని జిల్లాలకు మార్గదర్శకాలు జారీ చేశారు. మొదట ఈ నెల 10 వరకే కమిటీలను ఖరారు చేసి టీపీసీసీ పంపాలని సూచించినప్పటికీ గ్రామపంచాయతీ ఎన్నికలు, కమిటీల కోసం అక్కడక్కడ పోటీ తీవ్రంగా ఉండటం తదితర కారణాల వల్ల సాధ్యం కాలేదు. అయితే తక్షణమే కమిటీలను నియమించాలని మరోసారి టీపీసీసీ సూచించడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కమిటీలను ప్రతిపాదించే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన నేతలు, సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ కమిటీలను నాలుగైదు రోజుల్లో అధికారులకు అందజేసే అవకాశం ఉందని తెలిసింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్లకు ఖరారు... పెద్దపల్లి నుంచి ఫైనల్‌కు రెండు పేర్లు... జిల్లా కాంగ్రెస్ కమిటీల కసరత్తు తుది దశకు చేరుకుంటుండగా, ఆశావహులు సైతం పెరుగుతున్నారు. అయితే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు దాదాపుగా డీసీసీ అధ్యక్షులు ఖరారైనట్లేనని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల విషయానికి వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కటకం మృత్యుంజయం పేరు మొదట్లో వినిపించినా.. ఆయన కరీంనగర్‌పైనే పట్టుతో ఉన్నట్లు చెప్తున్నారు. ‘సెస్’ మాజీ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సంగీత శ్రీనివాస్, ముడికె చంద్రశేఖర్ పేర్లు ప్రధానంగా వినిపించినా.. చివరకు నాగుల సత్యనారాయణగౌడ్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. జగిత్యాల జిల్లా నుంచి ప్రధానంగా జువ్వాడి నర్సింగరావు, అడ్లూరి లక్ష్మన్‌కుమార్, మద్దెల రవిందర్, బండ శంకర్ ఆశించినట్లు ప్రచారం జరిగింది. అయితే ధర్మపురి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి 400 పైచిలుకు తేడా ఓడిపోయిన అడ్లూరు లక్ష్మణ్‌కుమార్‌కు డీసీసీ పదవి దాదాపుగా ఖరారైనట్లే. ఇదిలా ఉండగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి రేసులో ప్రధానంగా పీసీసీ కార్యవర్గ సభ్యుడు ఈర్ల కొంరయ్య, చింతకుంట్ల విజయరమణారావు, చేతి ధర్మయ్య ఆసక్తిగా ఉండగా.. ఉమ్మడి జిల్లాలో రెండు గ్రూపులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు నేతల్లో ఒకరు విజయరమణరావు పేరును, ఇంకొకరు ఈర్ల కొంరయ్యను సూచిస్తున్నట్లు సమాచారం. అయితే కూర్చుండి మాట్లాడేందుకు నిర్ణయించుకున్న ఈ గ్రూపుల నేతలు ఇద్దరిలో ఒకరి పేరును ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. కరీంనగర్ డీసీసీపై పీటముడి...ససేమిరా అంటున్న ‘కటకం’ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన కటకం మృత్యుంజయం ఈసారి కూడా పట్టుబడుతుండటంతో కరీంనగర్ డీసీసీపై పీటముడి వీడటం లేదని తెలిసింది. కరీంనగర్ డీసీసీ పగ్గాల కోసం కటకం మృత్యుంజయంతో పాటు పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మేయర్ డి.శంకర్, ప్యాట రమేష్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కర్ర రాజశేఖర్‌లతో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిలో ఏడెనిమిది మంది ఉన్నా.. చివరకు నలుగురి విషయంలో తర్జనభర్జన జరుగుతున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన మృత్యుంజయం ఈసారి తప్పుకుం టారన్న ప్రచారం జరిగింది. కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుందన్న చర్చ కూడా ఆ పార్టీలో కొనసాగుతోంది. అయితే మృత్యుం జయం కూడా గట్టిగా పట్టుబడుతుండటంతో కరీంనగర్‌పై ఎటూ తేల్చలేకపోతున్నారని తెలుస్తోంది. కాగా హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మేయర్ డి.శంకర్, పటేల్ రాజేందర్ పేర్లపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే ఉప్పుల అంజనీప్రసాద్, ప్యాట రమేష్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కర్ర రాజశేఖర్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, గందె మాధవి తదితరులు కూడా ఆశిస్తున్నామంటున్నారు. కీలకంగా పొన్నం, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు.. నాలుగు జిల్లాల కాంగ్రెస్ కమిటీలను త్వరలోనే ఖరారు చేసేందుకు టీపీసీసీ సీనియర్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుందని సమాచారం. ఇందుకోసం ఉమ్మడి కరీంనగర్లో డీసీసీ రేసుకు దూరంగా ఉన్న పది మంది సీని యర్లను పరిగణలోకి తీసుకుంటుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అలాగే మాజీ విప్ ఆరెపెల్లి మోహన్, కేకే మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, డాక్టర్ మేడిపల్లి సత్యం, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి తదితరులు కూడా డీసీసీల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలి సింది. ఏదేమైనా అధిష్టానం సూచనల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీలపై ఇప్పటికే ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇప్పటికే స్పష్టత రాగా, పెద్దపల్లిపైనా ఈర్ల కొంరయ్యకు లైన్‌క్లియర్ అయినట్లేనంటున్నారు. రెండుమూడు రోజుల్లో కరీంనగర్‌పై స్పష్టత వస్తే త్వరలోనే కమిటీలపై ప్రకటన వెలువడవచ్చని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ పేర్కొన్నారు. -
చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలి
ముకరంపుర : చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆలిండియా ఫోరమ్ ఫర్ స్మాల్, మీడియం ఇండస్ట్రీస్ రాష్ట్ర కన్వీనర్ కోటేశ్వర్రావు కోరారు. మంగళవారం కరీంనగర్‌లోని ప్రెస్‌భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కరువు పరిస్థితులు, వ్యాపారం, ముడిసరుకు లేక పరిశ్రమల కోలుకోలేకపోతున్నాయన్నారు. ఈపరిస్థితుల్లో బ్యాంకులకు వడ్డీలు, వాయిదాలు కట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. అప్పులు చెల్లించలేక పరిశ్రమలు మూతపడుతున్నాయని, బ్యాంకు రుణాలు ప్రభుత్వం మాఫీ చేయాలని కోరారు. రాష్ట్ర కన్వీనర్లు ప్రభాకర్‌రావు, రాజేశ్వర స్వామి, కళ్యాణ్ చక్రవర్తి, ఎం.వాసుదేవచారి, జడల భాస్కర్‌రావు, రవీందర్, మేరుగు పర్శరాములు, తాటికొండ రాజు, దేవదాసు, గుడ్లపల్లి సుధాకర్, శ్యాంసుందర్, వీరేశం, శనిగరం సునీత, మధు పాల్గొన్నారు.