క్లైమాక్స్‌లో డీసీసీలు | DPCC President Congress Leaders Process Karimnagar | Sakshi
Sakshi News home page

క్లైమాక్స్‌లో డీసీసీలు

Published Thu, Jan 24 2019 9:15 AM | Last Updated on Thu, Jan 24 2019 9:20 AM

DPCC President Congress Leaders Process Karimnagar - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కమిటీలపై కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాల కమిటీలను రద్దు చేసి ఏ జిల్లాకు ఆ జిల్లాగా కమిటీలు వేయాలని ఏఐసీసీ, టీపీసీసీ ఇప్పటికే ఆదేశించాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లికి జిల్లా కాంగ్రెస్‌ కమిటీలను ఖరారు చేసే పనిలో నాయకత్వం నిమగ్నమైంది. ఏఐసీసీ, టీపీసీసీ అత్యవసర సమావేశం అనంతరం తక్షణమే జిల్లా కమిటీల ఏర్పాటు చేయాలని ఈ నెల 5న అన్ని జిల్లాలకు మార్గదర్శకాలు జారీ చేశారు. మొదట ఈ నెల 10 వరకే కమిటీలను ఖరారు చేసి టీపీసీసీ పంపాలని సూచించినప్పటికీ గ్రామపంచాయతీ ఎన్నికలు, కమిటీల కోసం అక్కడక్కడ పోటీ తీవ్రంగా ఉండటం తదితర కారణాల వల్ల సాధ్యం కాలేదు. అయితే తక్షణమే కమిటీలను నియమించాలని మరోసారి టీపీసీసీ   సూచించడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్‌ నేతలు కమిటీలను ప్రతిపాదించే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన నేతలు, సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ కమిటీలను నాలుగైదు రోజుల్లో అధికారులకు అందజేసే అవకాశం ఉందని తెలిసింది.

జగిత్యాల, రాజన్న సిరిసిల్లకు ఖరారు... పెద్దపల్లి నుంచి ఫైనల్‌కు రెండు పేర్లు...
జిల్లా కాంగ్రెస్‌ కమిటీల కసరత్తు తుది దశకు చేరుకుంటుండగా, ఆశావహులు సైతం పెరుగుతున్నారు. అయితే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు దాదాపుగా డీసీసీ అధ్యక్షులు ఖరారైనట్లేనని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల విషయానికి వస్తే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కటకం మృత్యుంజయం పేరు మొదట్లో వినిపించినా.. ఆయన కరీంనగర్‌పైనే పట్టుతో ఉన్నట్లు చెప్తున్నారు. ‘సెస్‌’ మాజీ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్, సంగీత శ్రీనివాస్, ముడికె చంద్రశేఖర్‌ పేర్లు ప్రధానంగా వినిపించినా.. చివరకు నాగుల సత్యనారాయణగౌడ్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

జగిత్యాల జిల్లా నుంచి ప్రధానంగా జువ్వాడి నర్సింగరావు, అడ్లూరి లక్ష్మన్‌కుమార్, మద్దెల రవిందర్, బండ శంకర్‌ ఆశించినట్లు ప్రచారం జరిగింది. అయితే ధర్మపురి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి 400 పైచిలుకు తేడా ఓడిపోయిన అడ్లూరు లక్ష్మణ్‌కుమార్‌కు డీసీసీ పదవి దాదాపుగా ఖరారైనట్లే. ఇదిలా ఉండగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడి రేసులో ప్రధానంగా పీసీసీ కార్యవర్గ సభ్యుడు ఈర్ల కొంరయ్య, చింతకుంట్ల విజయరమణారావు, చేతి ధర్మయ్య ఆసక్తిగా ఉండగా.. ఉమ్మడి జిల్లాలో రెండు గ్రూపులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు నేతల్లో ఒకరు విజయరమణరావు పేరును, ఇంకొకరు ఈర్ల కొంరయ్యను సూచిస్తున్నట్లు సమాచారం. అయితే కూర్చుండి మాట్లాడేందుకు నిర్ణయించుకున్న ఈ గ్రూపుల నేతలు ఇద్దరిలో ఒకరి పేరును ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. 

కరీంనగర్‌ డీసీసీపై పీటముడి...ససేమిరా అంటున్న ‘కటకం’
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన కటకం మృత్యుంజయం ఈసారి కూడా పట్టుబడుతుండటంతో కరీంనగర్‌ డీసీసీపై పీటముడి వీడటం లేదని తెలిసింది. కరీంనగర్‌ డీసీసీ పగ్గాల కోసం కటకం మృత్యుంజయంతో పాటు పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మేయర్‌ డి.శంకర్, ప్యాట రమేష్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కర్ర రాజశేఖర్‌లతో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడి కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిలో ఏడెనిమిది మంది ఉన్నా.. చివరకు నలుగురి విషయంలో తర్జనభర్జన జరుగుతున్నట్లు తెలుస్తోంది.

చాలా కాలంగా కాంగ్రెస్‌ పార్టీకి సేవలందిస్తూ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన మృత్యుంజయం ఈసారి తప్పుకుం టారన్న ప్రచారం జరిగింది. కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుందన్న చర్చ కూడా ఆ పార్టీలో కొనసాగుతోంది. అయితే మృత్యుం జయం కూడా గట్టిగా పట్టుబడుతుండటంతో కరీంనగర్‌పై ఎటూ తేల్చలేకపోతున్నారని తెలుస్తోంది. కాగా హుజూరాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మేయర్‌ డి.శంకర్, పటేల్‌ రాజేందర్‌ పేర్లపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే ఉప్పుల అంజనీప్రసాద్, ప్యాట రమేష్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కర్ర రాజశేఖర్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, గందె మాధవి తదితరులు కూడా ఆశిస్తున్నామంటున్నారు. 

కీలకంగా పొన్నం, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు.. 
నాలుగు జిల్లాల కాంగ్రెస్‌ కమిటీలను త్వరలోనే ఖరారు చేసేందుకు టీపీసీసీ సీనియర్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుందని సమాచారం. ఇందుకోసం ఉమ్మడి కరీంనగర్‌లో డీసీసీ రేసుకు దూరంగా ఉన్న పది మంది సీని యర్లను పరిగణలోకి తీసుకుంటుంది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అలాగే మాజీ విప్‌ ఆరెపెల్లి మోహన్, కేకే మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, డాక్టర్‌ మేడిపల్లి సత్యం, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి తదితరులు కూడా డీసీసీల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలి సింది. ఏదేమైనా అధిష్టానం సూచనల మేరకు జిల్లా కాంగ్రెస్‌ కమిటీలపై ఇప్పటికే ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇప్పటికే స్పష్టత రాగా, పెద్దపల్లిపైనా ఈర్ల కొంరయ్యకు లైన్‌క్లియర్‌ అయినట్లేనంటున్నారు. రెండుమూడు రోజుల్లో కరీంనగర్‌పై స్పష్టత వస్తే త్వరలోనే కమిటీలపై ప్రకటన వెలువడవచ్చని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్‌ పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement