DPCC President
-
క్లైమాక్స్‌లో డీసీసీలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కమిటీలపై కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాల కమిటీలను రద్దు చేసి ఏ జిల్లాకు ఆ జిల్లాగా కమిటీలు వేయాలని ఏఐసీసీ, టీపీసీసీ ఇప్పటికే ఆదేశించాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లికి జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఖరారు చేసే పనిలో నాయకత్వం నిమగ్నమైంది. ఏఐసీసీ, టీపీసీసీ అత్యవసర సమావేశం అనంతరం తక్షణమే జిల్లా కమిటీల ఏర్పాటు చేయాలని ఈ నెల 5న అన్ని జిల్లాలకు మార్గదర్శకాలు జారీ చేశారు. మొదట ఈ నెల 10 వరకే కమిటీలను ఖరారు చేసి టీపీసీసీ పంపాలని సూచించినప్పటికీ గ్రామపంచాయతీ ఎన్నికలు, కమిటీల కోసం అక్కడక్కడ పోటీ తీవ్రంగా ఉండటం తదితర కారణాల వల్ల సాధ్యం కాలేదు. అయితే తక్షణమే కమిటీలను నియమించాలని మరోసారి టీపీసీసీ సూచించడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కమిటీలను ప్రతిపాదించే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన నేతలు, సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ కమిటీలను నాలుగైదు రోజుల్లో అధికారులకు అందజేసే అవకాశం ఉందని తెలిసింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్లకు ఖరారు... పెద్దపల్లి నుంచి ఫైనల్‌కు రెండు పేర్లు... జిల్లా కాంగ్రెస్ కమిటీల కసరత్తు తుది దశకు చేరుకుంటుండగా, ఆశావహులు సైతం పెరుగుతున్నారు. అయితే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు దాదాపుగా డీసీసీ అధ్యక్షులు ఖరారైనట్లేనని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల విషయానికి వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కటకం మృత్యుంజయం పేరు మొదట్లో వినిపించినా.. ఆయన కరీంనగర్‌పైనే పట్టుతో ఉన్నట్లు చెప్తున్నారు. ‘సెస్’ మాజీ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సంగీత శ్రీనివాస్, ముడికె చంద్రశేఖర్ పేర్లు ప్రధానంగా వినిపించినా.. చివరకు నాగుల సత్యనారాయణగౌడ్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. జగిత్యాల జిల్లా నుంచి ప్రధానంగా జువ్వాడి నర్సింగరావు, అడ్లూరి లక్ష్మన్‌కుమార్, మద్దెల రవిందర్, బండ శంకర్ ఆశించినట్లు ప్రచారం జరిగింది. అయితే ధర్మపురి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి 400 పైచిలుకు తేడా ఓడిపోయిన అడ్లూరు లక్ష్మణ్‌కుమార్‌కు డీసీసీ పదవి దాదాపుగా ఖరారైనట్లే. ఇదిలా ఉండగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి రేసులో ప్రధానంగా పీసీసీ కార్యవర్గ సభ్యుడు ఈర్ల కొంరయ్య, చింతకుంట్ల విజయరమణారావు, చేతి ధర్మయ్య ఆసక్తిగా ఉండగా.. ఉమ్మడి జిల్లాలో రెండు గ్రూపులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు నేతల్లో ఒకరు విజయరమణరావు పేరును, ఇంకొకరు ఈర్ల కొంరయ్యను సూచిస్తున్నట్లు సమాచారం. అయితే కూర్చుండి మాట్లాడేందుకు నిర్ణయించుకున్న ఈ గ్రూపుల నేతలు ఇద్దరిలో ఒకరి పేరును ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. కరీంనగర్ డీసీసీపై పీటముడి...ససేమిరా అంటున్న ‘కటకం’ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన కటకం మృత్యుంజయం ఈసారి కూడా పట్టుబడుతుండటంతో కరీంనగర్ డీసీసీపై పీటముడి వీడటం లేదని తెలిసింది. కరీంనగర్ డీసీసీ పగ్గాల కోసం కటకం మృత్యుంజయంతో పాటు పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మేయర్ డి.శంకర్, ప్యాట రమేష్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కర్ర రాజశేఖర్‌లతో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిలో ఏడెనిమిది మంది ఉన్నా.. చివరకు నలుగురి విషయంలో తర్జనభర్జన జరుగుతున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన మృత్యుంజయం ఈసారి తప్పుకుం టారన్న ప్రచారం జరిగింది. కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుందన్న చర్చ కూడా ఆ పార్టీలో కొనసాగుతోంది. అయితే మృత్యుం జయం కూడా గట్టిగా పట్టుబడుతుండటంతో కరీంనగర్‌పై ఎటూ తేల్చలేకపోతున్నారని తెలుస్తోంది. కాగా హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మేయర్ డి.శంకర్, పటేల్ రాజేందర్ పేర్లపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే ఉప్పుల అంజనీప్రసాద్, ప్యాట రమేష్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కర్ర రాజశేఖర్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, గందె మాధవి తదితరులు కూడా ఆశిస్తున్నామంటున్నారు. కీలకంగా పొన్నం, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు.. నాలుగు జిల్లాల కాంగ్రెస్ కమిటీలను త్వరలోనే ఖరారు చేసేందుకు టీపీసీసీ సీనియర్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుందని సమాచారం. ఇందుకోసం ఉమ్మడి కరీంనగర్లో డీసీసీ రేసుకు దూరంగా ఉన్న పది మంది సీని యర్లను పరిగణలోకి తీసుకుంటుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అలాగే మాజీ విప్ ఆరెపెల్లి మోహన్, కేకే మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, డాక్టర్ మేడిపల్లి సత్యం, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి తదితరులు కూడా డీసీసీల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలి సింది. ఏదేమైనా అధిష్టానం సూచనల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీలపై ఇప్పటికే ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇప్పటికే స్పష్టత రాగా, పెద్దపల్లిపైనా ఈర్ల కొంరయ్యకు లైన్‌క్లియర్ అయినట్లేనంటున్నారు. రెండుమూడు రోజుల్లో కరీంనగర్‌పై స్పష్టత వస్తే త్వరలోనే కమిటీలపై ప్రకటన వెలువడవచ్చని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ పేర్కొన్నారు. -
లవ్లీ చేతికి ఢిల్లీ కాంగ్రెస్ పగ్గాలు
డీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం సాక్షి, న్యూఢిల్లీ: అర్విందర్ సింగ్ లవ్లీ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షునిగా నియమితులయ్యారు. గత ఆరు సంవత్సరాలుగా ఈ బాధ్యతలు నిర్వర్తించిన జైప్రకాశ్ అగర్వాల్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ సమర్పించిన రాజీనామాను కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. అర్విందర్ సింగ్ లవ్లీని డీపీసీసీ అధ్యక్షునిగా నియమించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది గురువా రం ప్రకటించారు. సోనియా గాంధీ లవ్లీని డీపీసీసీ అధ్యక్షునిగా నియమించారని, ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఆయన చెప్పారు. 46 సంవత్సరాల అర్విందర్ సింగ్ లవ్లీ గాంధీనగర్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనానికి తట్టుకుని తాజా ఎన్నికలలో గెలిచిన షీలా సర్కారులోని ఇద్దరు మంత్రులలో లవ్లీ ఒకరు. లవ్లీ 1987 నుంచి ఢిల్లీ రాజకీయాలలో చరుకుగా పనిచేస్తున్నారు. 1990లో ఢిల్లీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 1992 ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన లవ్లీ 1998లో తొలిసారిగా గాంధీనగర్ నుంచి అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి గెలిచారు. 28 సంవత్సరాల వయసులోనే ఎమ్మెల్యే అయిన ఆయన ఆ తరువాత 2003, 2008, 2013 ఎన్నికల్లో తన విజయ ప్రస్థానాన్ని కొనసాగించారు. లవ్లీ 2003 నుంచి షీలా సర్కారులో మంత్రిగా ఉన్నారు. ఆయన రవాణా, విద్య, రెవెన్యూ వంటి కీలక శాఖలను నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తా: లవ్లీ డీపీసీసీ అధ్యక్షుడిగా తనకు బాధ్యతలు అప్పగించినందుకు సంతోషంగా ఉందనని, సమర్థవంతంగా నిర్వర్తించి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అర్విందర్ సింగ్ లవ్లీ చెప్పారు. పార్టీని సామాన్యుడికి చేరువ చేసేందుకు మరింతగా ప్రయత్నిస్తానని, యువకులు, మహిళలను కలుపుకొని ముందుకు వెళ్తానన్నారు. సోనియాకు, రాహుల్‌కు కృతజ్ఞతలు తెలిపిన లవ్లీ వారి అంచనాలకు తగ్గకుండా పనిచేస్తానన్నారు. షీలా, అగర్వాల్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, పార్టీ కోసం వారు ఎంతగానో కష్టపడ్డారన్నారు. -
కొత్త సారథి ఎవరు ?
న్యూఢిల్లీ:ఇటీవల విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయానికి బాధ్యత వ హిస్తూ జైప్రకాశ్ అగర్వాల్ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షపదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడీ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై ఊహాగానాలు మొదల య్యాయి. అగర్వాల్ రాజీనామాను ఆమోదించినట్లు పార్టీ ఇంకా ప్రకటించలేదు కానీ ఆయన వారసుడి ఎంపికపై చర్చలు నడుస్తున్నాయి. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తరువాత కూడా అగర్వాల్ రాజీనామా చేశారు. అయితే అప్పట్లో ఆయన రాజీనామాను ఆమోదించలేదు. ఆరు సంవత్సరాల కింద అగర్వాల్ డీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత కొన్ని నెలలకే నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లో కూడా పార్టీ ఏడింటికి ఏడు స్థానాలను గెలుచుకుంది. ఈశాన్య ఢిల్లీ నుంచి అగర్వాల్ స్వయంగా గెలిచారు. తదనంతరం ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ముఖ్యమంత్రికి అగర్వాల్‌కు మధ్య సయోధ్య లేదన్న వార్తలొచ్చాయి. అనేక సందర్భాల్లో వారి మధ్యనున్న విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. రాహుల్‌గాంధీ ఆదేశంతో వీళ్లు తమ విభేదాలను పక్కన బెట్టినట్లు కనిపించినప్పటికీ పార్టీ నుంచి సరైన సహకారం అందలేదని షీలాదీక్షిత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత పేర్కొన్నారు. ఈ ఆరోపణపై అగర్వాల్ స్పందించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యతను వహిస్తూ, ఆమ్ఆద్మీ పార్టీ ఏర్పాటుచేసే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతును వ్యతిరేకిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అగర్వాల్ రాజీనామాను పార్టీ ఆమోదించవచ్చని, డీపీసీసీ పీఠం హరూన్ యూసుఫ్ లేదా అర్విందర్ సింగ్ లవ్లీ లేదా అజయ్ మాకెన్‌కు గానీ దక్కవచ్చని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని, అందువల్ల ఈ ఓటుబ్యాంకు కాపాడుకోవడానికి పీసీసీ అధ్యక్ష పదవిని హరూన్ యూసుఫ్‌కు కట్టబెట్టవచ్చని చెబుతున్నారు. హరూన్ షీలా సర్కారులో విద్యుత్‌శాఖ మంత్రిగా ఉన్నారు. గాంధీనగర్ నుంచి గెలిచిన మరో మంత్రి అర్విందర్ సింగ్ లవ్లీ పేరును కూడా అధిష్టానం పరిశీలించవచ్చని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఢిల్లీ కాంగ్రెస్‌లో షీలాదీక్షిత్ పాత్ర తగ్గిపోవచ్చని, ఆమెకు కేంద్ర రాజకీయాల్లో స్థానం ఇవ్వవచ్చని కొందరు వాదిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర రాజకీయాల్లో ఉన్న అజయ్ మాకెన్‌కు ఢిల్లీ కాంగ్రెస్‌లో కీలక స్థానం అప్పగించవచ్చని అంటున్నారు. ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: కార్యకర్తలకు షీలా సూచన ఎన్నికల రేసులో వెనుకబడిన ప్రతిసారి కాంగ్రెస్ మళ్లీ పుంజుకుని తన సత్తా చాటుకుందని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అన్నారు. ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆమె సోమవారం పిలుపు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం తరువాత ఆమె మెట్టమొదటిసారిగా ఆమె పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేసి పార్టీకి మరోసారి భారీ విజయం కట్టబెట్టాలని కోరారు. ఓటమికి నిరాశపడకుండా పనిచేయాలని సూచిం చారు. రాజేందర్‌నగర్ నియోజకవర్గంలో 800 మంది కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. రాజేందర్ నగర్ షీలా మంత్రివర్గ సహచరుడైన రమాకాంత్ గోస్వామి నియోజకవర్గం. ఇక్కడ ఆయన ఓటమి పాలయ్యారు. మహిళలను అంతా గౌరవించాలి మహిళ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని షీలా దీక్షిత్ అన్నారు. మనదేశంలో మహిళలను ఇప్పటికీ రెండోస్థాయి వ్యక్తులుగా చూసే సంస్కృతి ఉందన్నారు. వారి సంరక్షణకు ఎలాంటి చట్టాలూ అవసరం లేదని, సమాజం తగిన భద్రత కల్పిస్తే చాలన్నారు. నిర్భయ ఘటనకు ఏడాది నిండిన సందర్భంగా నగరంలో జాతీయ మహిళా సంఘం సోమవారం ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ ఆమె పైమాటననారు. కేంద్రమంత్రి గిరిజా వ్యాస్, ఇతర రాజకీయ పక్షాల మహిళా నాయకురాళ్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.