కొత్త సారథి ఎవరు ? | Who is New DPCC President ...? | Sakshi
Sakshi News home page

కొత్త సారథి ఎవరు ?

Published Mon, Dec 16 2013 11:39 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Who is New DPCC President ...?

న్యూఢిల్లీ:ఇటీవల విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయానికి బాధ్యత వ హిస్తూ జైప్రకాశ్ అగర్వాల్ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షపదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడీ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై ఊహాగానాలు మొదల య్యాయి. అగర్వాల్ రాజీనామాను ఆమోదించినట్లు పార్టీ ఇంకా ప్రకటించలేదు కానీ ఆయన వారసుడి ఎంపికపై చర్చలు నడుస్తున్నాయి.   గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తరువాత కూడా అగర్వాల్ రాజీనామా చేశారు. అయితే అప్పట్లో ఆయన రాజీనామాను ఆమోదించలేదు. ఆరు సంవత్సరాల కింద అగర్వాల్ డీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత కొన్ని నెలలకే నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. 
 
లోక్‌సభ ఎన్నికల్లో కూడా పార్టీ ఏడింటికి ఏడు స్థానాలను గెలుచుకుంది. ఈశాన్య ఢిల్లీ నుంచి అగర్వాల్ స్వయంగా గెలిచారు. తదనంతరం ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ముఖ్యమంత్రికి అగర్వాల్‌కు మధ్య సయోధ్య లేదన్న వార్తలొచ్చాయి.  అనేక సందర్భాల్లో వారి మధ్యనున్న విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. రాహుల్‌గాంధీ ఆదేశంతో వీళ్లు తమ విభేదాలను పక్కన బెట్టినట్లు కనిపించినప్పటికీ పార్టీ నుంచి సరైన సహకారం అందలేదని షీలాదీక్షిత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత పేర్కొన్నారు. ఈ ఆరోపణపై అగర్వాల్ స్పందించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యతను వహిస్తూ, ఆమ్‌ఆద్మీ పార్టీ ఏర్పాటుచేసే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతును వ్యతిరేకిస్తూ ఆయన రాజీనామా చేశారు. 
 
ఈ నేపథ్యంలో అగర్వాల్ రాజీనామాను పార్టీ ఆమోదించవచ్చని, డీపీసీసీ పీఠం హరూన్ యూసుఫ్ లేదా అర్విందర్ సింగ్ లవ్లీ లేదా అజయ్ మాకెన్‌కు గానీ దక్కవచ్చని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని, అందువల్ల ఈ ఓటుబ్యాంకు కాపాడుకోవడానికి పీసీసీ అధ్యక్ష పదవిని హరూన్ యూసుఫ్‌కు కట్టబెట్టవచ్చని చెబుతున్నారు. హరూన్ షీలా సర్కారులో విద్యుత్‌శాఖ మంత్రిగా ఉన్నారు. గాంధీనగర్ నుంచి గెలిచిన మరో మంత్రి అర్విందర్ సింగ్ లవ్లీ పేరును కూడా అధిష్టానం పరిశీలించవచ్చని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఢిల్లీ కాంగ్రెస్‌లో షీలాదీక్షిత్ పాత్ర తగ్గిపోవచ్చని, ఆమెకు కేంద్ర రాజకీయాల్లో స్థానం ఇవ్వవచ్చని కొందరు వాదిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర రాజకీయాల్లో ఉన్న అజయ్ మాకెన్‌కు ఢిల్లీ కాంగ్రెస్‌లో కీలక స్థానం అప్పగించవచ్చని అంటున్నారు.
 
ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: కార్యకర్తలకు షీలా సూచన
ఎన్నికల రేసులో వెనుకబడిన ప్రతిసారి కాంగ్రెస్ మళ్లీ పుంజుకుని తన సత్తా చాటుకుందని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అన్నారు. ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆమె సోమవారం పిలుపు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం తరువాత ఆమె మెట్టమొదటిసారిగా ఆమె పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.  కాంగ్రెస్ కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేసి పార్టీకి మరోసారి భారీ విజయం కట్టబెట్టాలని కోరారు. ఓటమికి నిరాశపడకుండా పనిచేయాలని సూచిం చారు. రాజేందర్‌నగర్ నియోజకవర్గంలో 800 మంది కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. రాజేందర్ నగర్ షీలా మంత్రివర్గ సహచరుడైన రమాకాంత్ గోస్వామి నియోజకవర్గం. ఇక్కడ ఆయన ఓటమి పాలయ్యారు.
 
మహిళలను అంతా గౌరవించాలి
మహిళ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని షీలా దీక్షిత్ అన్నారు. మనదేశంలో మహిళలను ఇప్పటికీ రెండోస్థాయి వ్యక్తులుగా చూసే సంస్కృతి ఉందన్నారు. వారి సంరక్షణకు ఎలాంటి చట్టాలూ అవసరం లేదని, సమాజం తగిన భద్రత కల్పిస్తే చాలన్నారు. నిర్భయ ఘటనకు ఏడాది నిండిన సందర్భంగా నగరంలో జాతీయ మహిళా సంఘం సోమవారం ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ ఆమె పైమాటననారు. కేంద్రమంత్రి గిరిజా వ్యాస్, ఇతర రాజకీయ పక్షాల మహిళా నాయకురాళ్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement