లవ్లీ చేతికి ఢిల్లీ కాంగ్రెస్ పగ్గాలు
డీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం
సాక్షి, న్యూఢిల్లీ: అర్విందర్ సింగ్ లవ్లీ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షునిగా నియమితులయ్యారు. గత ఆరు సంవత్సరాలుగా ఈ బాధ్యతలు నిర్వర్తించిన జైప్రకాశ్ అగర్వాల్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ సమర్పించిన రాజీనామాను కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. అర్విందర్ సింగ్ లవ్లీని డీపీసీసీ అధ్యక్షునిగా నియమించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది గురువా రం ప్రకటించారు. సోనియా గాంధీ లవ్లీని డీపీసీసీ అధ్యక్షునిగా నియమించారని, ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఆయన చెప్పారు. 46 సంవత్సరాల అర్విందర్ సింగ్ లవ్లీ గాంధీనగర్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనానికి తట్టుకుని తాజా ఎన్నికలలో గెలిచిన షీలా సర్కారులోని ఇద్దరు మంత్రులలో లవ్లీ ఒకరు.
లవ్లీ 1987 నుంచి ఢిల్లీ రాజకీయాలలో చరుకుగా పనిచేస్తున్నారు. 1990లో ఢిల్లీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 1992 ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన లవ్లీ 1998లో తొలిసారిగా గాంధీనగర్ నుంచి అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి గెలిచారు. 28 సంవత్సరాల వయసులోనే ఎమ్మెల్యే అయిన ఆయన ఆ తరువాత 2003, 2008, 2013 ఎన్నికల్లో తన విజయ ప్రస్థానాన్ని కొనసాగించారు. లవ్లీ 2003 నుంచి షీలా సర్కారులో మంత్రిగా ఉన్నారు. ఆయన రవాణా, విద్య, రెవెన్యూ వంటి కీలక శాఖలను నిర్వహించారు.
పార్టీ బలోపేతానికి కృషిచేస్తా: లవ్లీ
డీపీసీసీ అధ్యక్షుడిగా తనకు బాధ్యతలు అప్పగించినందుకు సంతోషంగా ఉందనని, సమర్థవంతంగా నిర్వర్తించి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అర్విందర్ సింగ్ లవ్లీ చెప్పారు. పార్టీని సామాన్యుడికి చేరువ చేసేందుకు మరింతగా ప్రయత్నిస్తానని, యువకులు, మహిళలను కలుపుకొని ముందుకు వెళ్తానన్నారు. సోనియాకు, రాహుల్‌కు కృతజ్ఞతలు తెలిపిన లవ్లీ వారి అంచనాలకు తగ్గకుండా పనిచేస్తానన్నారు. షీలా, అగర్వాల్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, పార్టీ కోసం వారు ఎంతగానో కష్టపడ్డారన్నారు.