రైతుకు రొక్కం
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ప్రారంభించనున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి శివారు ఇందిరానగర్ వేదికపై ఉదయం 11 గంటలకు ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. బుధవారం రాత్రే కరీంనగర్ చేరుకున్న సీఎం.. మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురువారం ఉదయం కరీంనగర్ నుంచి ప్రత్యేక బస్సులో బయల్దేరి రోడ్‌షో ద్వారా ఇందిరానగర్ వేదిక వద్దకు చేరుకుంటారు.
ధర్మరాజుపల్లె గ్రామానికి చెందిన 10 మంది రైతులకు వేదికపై పాస్‌బుక్కులు, పెట్టుబడి సాయం చెక్కులను అందజేస్తారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు రైతులకు చెక్కులను పంపిణీ చేస్తారు. గురువారం నుంచి వారం పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మొత్తంగా 1.43 కోట్ల ఎకరాలకు చెందిన 58.33 లక్షల మంది రైతులకు రూ.5,730 కోట్లు పంపిణీ చేయనున్నారు. హరితహారం, రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా నుంచే శ్రీకారం చుట్టిన సీఎం.. రైతు బంధు పథకాన్ని కూడా ఇక్కడ్నుంచే మొదలు పెడుతుండటం గమనార్హం.
సభకు భారీగా ఏర్పాట్లు
సీఎం కేసీఆర్ గురు, శుక్రవారాల్లో కరీంనగర్ జిల్లాలోనే పర్యటించనున్నందున అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మంత్రి ఈటల రాజేందర్ నాలుగు రోజులుగా కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంటలో జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అటు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి కూడా ఏర్పాట్లపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ కరీంనగర్‌లోనే మకాం వేసి సభ ఏర్పాట్లపై సమీక్షించారు. సభకు భారీ సంఖ్యలో రైతులను తరలించేందుకు కసరత్తు పూర్తి చేశారు.
అసాధారణ భద్రత!
సీఎంకు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందన్న సమాచారం మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల తాజా హెచ్చరికల నేపథ్యంలో గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి అసాధారణ భద్రత చర్యలు చేపట్టారు. అదనపు బలగాలను మోహరించారు. ఈ మేరకు కమిషనర్ కమలాసన్‌రెడ్డి పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు. కరీంనగర్ నుంచి ఇందిరానగర్ వరకు సీఎం బస్సులోనే వెళ్లనున్న నేపథ్యంలో.. దారిపొడవునా కల్వర్టులు, వంతెనల సమీపంలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు.
బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కేసీఆర్ బస చేసే తెలంగాణ భవన్ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, ర్యాలీలపై నిషేధాజ్ఞలు విధించారు. సభావేదికపైకి కూడా ప్రజాప్రతినిధులను పరిమితంగానే అనుమతించే అవకాశం ఉంది.
ఆధార్ లేకున్నా చెక్కులు
రైతులు పాటించాల్సిన సూచనలను వివరిస్తూ వ్యవసాయ శాఖ ఓ కరపత్రం రూపొందించింది. అందులో సూచనలివీ..
– 17వ తేదీ వరకు గ్రామాలవారీగా షెడ్యూల్ ప్రకారం చెక్కులిస్తారు. ఉదయం 7–11 గంటలు, సాయంత్రం 5–7 గంటల మధ్య పంపిణీ ఉంటుంది
– టోకెన్‌తో పాటు ఆధార్ కార్డు, అది లేకుంటే మరేదైనా ఫొటో గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి
– ఆధార్ కార్డు నంబరు ఇవ్వని వారికి ఫోటో సరిగా దిగని వారికి పాస్‌బుక్కులు రాకుండా కేవలం చెక్కులు మాత్రమే వచ్చాయి. ఆ రైతులు చెక్కు తీసుకొని వారి ఆధార్ కార్డు జిరాక్స్‌ను అధికారులకు ఇవ్వాలి. త్వరలో ఆ రైతులకు పాస్ బుక్కులు కూడా ఇస్తారు
– చెక్కులను గ్రామసభల్లో రైతులే నేరుగా తీసుకోవాలి. వారి తరపున మరొకరు తీసుకోవడానికి వీలులేదు
– అనారోగ్యంతో రాలేని రైతులకు ఇంటికి వచ్చి చెక్కు అందజేస్తారు
– టోకెన్‌లో సూచించిన కౌంటర్ల వద్దకు వెళ్లి పాసు పుస్తకం, చెక్కు తీసుకోవాలి. అనంతరం అక్కడి రిజిస్టర్లో సంతకం చేయాలి
– బ్యాంకులో నగదు తీసుకునేప్పుడు పాసు పుస్తకం విధిగా తీసుకెళ్లాలి. పుస్తకం మొదటి పేజీ జిరాక్సును సమర్పించాలి
– 300 మంది రైతులకు ఒకటి చొప్పున అధికార బృందాలను ఏర్పాటు చేశారు. వారి ఆధ్వర్యంలోనే చెక్కుల పంపిణీ జరుగుతుంది
– రైతులకు ఫిర్యాదులుంటే గ్రామసభలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో వాటిని నమోదు చేయవచ్చు
– గ్రామసభలో చెక్కులు తీసుకోలేని రైతులు నెలలోపు మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్ల నుంచి పొందవచ్చు
– రైతుబంధు సొమ్మును స్వచ్ఛందంగా వదులుకోవాలనుకుంటే ‘గివ్ ఇట్ అప్’ఫారంలో వివరాలు నింపి గ్రామసభలో అధికారులకివ్వాలి
– రైతులకు ఆర్డర్ చెక్కులిస్తారు. ఇందుకు మండలానికో బ్యాంకును నిర్దేశించారు. అందులో చెక్కును నగదు చేసుకోవచ్చు. లేదంటే రాష్ట్రంలో ఎక్కడైనా అదే బ్యాంకు తాలూకు వేరే శాఖలోనూ తీసుకోవచ్చు
– చెక్కుపై ముద్రించిన తేదీ నుంచి మూడు నెలల్లోపే నగదు చేసుకోవాలి
– రైతులు తమ బ్యాంకు ఖాతాలోనూ చెక్కులను జమ చేసుకోవచ్చు
– పాసు పుస్తకం లేకుండా చెక్కు పొందిన రైతులు బ్యాంకులో నగదుగా మార్చుకోవాలంటే ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఉపాధి హామీ కార్డు, పాస్‌పోర్టు, పాన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలి. జిరాక్సు కాపీ ఇవ్వాలి
నగదు కష్టాలు తప్పవా?
రైతుబంధు పథకానికి నగదు కష్టాలు తప్పేలా లేవు. వారం రోజుల వ్యవధిలో ఏకంగా రూ.5,730 కోట్లు విలువ చేసే చెక్కులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అయితే చెక్కులను నగదుగా మార్చి రైతులకు చెల్లించేందుకు బ్యాంకుల వద్ద తగిన మొత్తంలో కరెన్సీ లేదు. మరోవైపు డబ్బుల్లేవంటూ రైతులను వెనక్కు పంపొద్దని సర్కారు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నగదు కొరత ఉన్నా తర్వాత రమ్మని మాత్రమే చెప్పాలని, డబ్బుల్లేవంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వొద్దని స్పష్టంచేసింది.
ఇప్పటికే బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల్లో నగదు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. పది వేలు కావాలంటే పది ఏటీఎం కేంద్రాలకు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. రైతుబంధు కోసం నగదు కావాలని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుకు విన్నవించినా.. ఇప్పటివరకు నగదు నిల్వలు రాష్ట్రానికి రాలేదని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. గురు లేదా శుక్రవారం వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. వారం వ్యవధిలో బ్యాంకులు రూ. 5,730 కోట్ల సొమ్మును ఇవ్వాల్సి ఉంది. అంటే రోజుకు సరాసరి రూ.818 కోట్లు. అందరూ ఒకేరోజు తీసుకోరని అనుకున్నా ఆయా రోజుల్లో సరాసరి రూ.500 కోట్లు బ్యాంకుల్లో సిద్ధంగా ఉంచాల్సి ఉంటుంది.
ఈ సొమ్ముతోపాటు రోజువారీ కస్టమర్లకు కూడా సొమ్ము అందుబాటులో ఉంచాలి. రైతులంతా ఒకేసారి వస్తే అంత సొమ్ము ఇవ్వడం సాధ్యం కాదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. మరోవైపు రిజర్వు బ్యాంకు నుంచి రైతుబంధుకు ప్రత్యేకంగా డబ్బు సమకూర్చామని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి వెల్లడించారు. బుధవారం ఆయన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చని చెప్పారు.