తెలుగు అభ్యర్థులపై దాడులు
కర్ణాటక బ్యాంకింగ్ పరీక్ష సందర్భంగా స్థానిక అభ్యర్థుల రచ్చ
సాక్షి, బెంగళూరు/నంద్యాల: కర్ణాటకలో బ్యాంకింగ్ పరీక్షలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. స్థానికేతరులు పరీక్ష రాయడాన్ని నిరసిస్తూ కన్నడ అభ్యర్థులు పరీక్షా కేంద్రాల ఎదుట ఆందోళనకు దిగారు. తమ ఉద్యోగాలను తన్నుకుపోతున్నారంటూ బెంగళూరు, హుబ్లీ, గుల్బార్గాతో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల రచ్చరచ్చ చేశారు. కన్నడ సంఘాలు కూడా స్థానిక అభ్యర్థులకు మద్దతు తెలపడంతో వారు మరింతగా రెచ్చిపోయారు. తెలుగు విద్యార్థులపై దాడి చేసి హాల్ టికెట్లను చించివేశారు. దీంతో తెలుగు విద్యార్థులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఇంతలో పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. బెంగళూరు తప్ప మిగిలిన చోట్ల పోలీసుల రక్షణ మధ్య పరీక్ష యథావిధిగా జరిగింది.
ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ..
కర్ణాటకలోని గ్రామీణ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్(పీవో) పోస్టుల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్స్(ఐబీపీఎస్) నిర్వహించే పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. బెంగళూరుతో పాటు హుబ్లీ, గుల్బర్గా, కేజీఎఫ్ తదితర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కన్నడ వచ్చిన వారు మాత్రమే ఆ రాష్ట్రంలో ఉద్యోగ పరీక్షలు రాయాలన్న నిబంధనను ఎత్తివేయడంతో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు కూడా ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ముందుగానే సమాచారమందుకున్న కన్నడ అభ్యర్థులు పరీక్షా కేంద్రాల ఎదుట ఆందోళనకు దిగారు. స్థానికేతరులను అడ్డగించారు.
ముఖ్యంగా తెలుగు అభ్యర్థులు.. తమకు దక్కాల్సిన ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తూ వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న కన్నడ సంఘాలు పరీక్షా కేంద్రాలకు చేరుకుని స్థానిక అభ్యర్థులకు మద్దతు పలికాయి. దీంతో వారు రెచ్చిపోయి తెలుగు అభ్యర్థులపై దాడి చేశారు. చేతికి చిక్కిన వారందరి హాల్‌టికెట్లను లాక్కొని చించేశారు. హుబ్లీ– ధార్వాడాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 800 మంది అభ్యర్థులు వచ్చారు. దీంతో సలీం అనే స్థానికఅభ్యర్థి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇతర తెలుగు వాళ్లను అనుమతిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ.. బ్లేడుతో చేతిపై కోసుకున్నాడు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా∙స్థలానికి చేరుకొని సలీంను అదుపులోకి తీసుకున్నారు. లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం భద్రతా బలగాల రక్షణలో పరీక్ష యథావిధిగా జరిగింది.
వెనుతిరిగిన 8వేల మంది!
మరోవైపు బెంగళూరు శివార్లలోని ఉల్లాలలో ఉన్న ఎస్జేఎం ఇన్ఫోటెక్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి స్థానికులు, కన్నడ సంఘాల నాయకులు చేరుకొని నిరసనకు దిగారు. పరీక్ష జరగనివ్వ బోమని అడ్డుకున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు చేసిన యత్నాలు కూడా విఫలమవ్వడంతో శనివారం జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది. దీంతో స్థానికేతరులు తీవ్ర ఆవేదనతో వెనుతిరిగారు. అలాగే కోలారు జిల్లా కేజీఎఫ్‌లోని డాక్టర్ టి.తిమ్మయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వద్ద కూడా కన్నడ సంఘాలు ఆందోళనకు దిగాయి. సమాచారమందుకున్న ఆ జిల్లా ఎస్పీ లోకేశ్ కుమార్ అదనపు బలగాలను రంగంలోకి దించి పరీక్ష సజావుగా జరిగేలా చూశారు.
వివిధ ప్రాంతాల్లో బ్యాంక్ పరీక్షలకు శిక్షణ తీసుకున్న వారితో పాటు సొంతంగా సన్నద్ధమై కర్ణాటక వెళ్లిన దాదాపు 20 వేల మంది తెలుగు అభ్యర్థుల్లో శనివారం 8 వేల మంది వరకు పరీక్ష రాయలేకపోయినట్లు నంద్యాలకు చెందిన గురురాఘవేంద్ర కోచింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ షేక్షావలి రెడ్డి తెలిపారు. తమ ఇన్స్టిట్యూట్కు చెందిన వారే మూడు వేల మంది వరకు పరీక్ష రాయలేకపోయారని వివరించారు. ఈ పరీక్ష మళ్లీ నిర్వహిస్తామంటూ ఐబీపీఎస్ నుంచి అభ్యర్థులకు మెయిల్ వచ్చినట్టు ఆయన తెలిపారు.
ఏడాది కష్టం వృథా అయ్యింది
ఏడాదిగా పడ్డ కష్టం వృథా అయ్యింది. ఐబీపీఎస్ నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రంలో ఉద్యోగం వస్తే.. ఆ రాష్ట్రానికి చెందిన భాషను ఆరు నెలల్లోపు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సిద్ధమయ్యే పరీక్ష రాసేందుకు వచ్చాం. ముందుగా మనమంతా భారతీయులం.. ఆ తర్వాతే తెలుగు వాళ్లం, కన్నడిగులం. ఈ విధంగా దాడి చేయడం సరికాదు. ఆదివారమైనా పరీక్ష జరగనిస్తారో.. లేదో అనుమానమే.
– ప్రియాంక, తెలుగు అభ్యర్థి
కన్నడిగులకే దక్కాలి
కర్ణాటకలోని ఉద్యోగాలు కన్నడిగులకే దక్కాలి. ఇందుకోసం ఎంతవరకైనా పోరాడుతాం. కర్ణాటకలోని బ్యాంకింగ్ పరీక్షలకు తెలుగు వాళ్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ముఖ్యంగా నంద్యాలలోని కోచింగ్ సెంటర్లకు చెందినవారే అధికంగా ఉంటున్నారు. వారిని పంపించొద్దని అక్కడి కోచింగ్ సెంటర్లను హెచ్చరించినా వినలేదు. అందుకే తెలుగు వాళ్లను అడ్డుకున్నాం.
– కుమారస్వామి, కన్నడ సంఘాల ప్రతినిధి
తెలుగు ఉద్యోగార్థులపై దాడులు శోచనీయం
-ట్వీటర్లో వైఎస్ జగన్