సరిహద్దు లొల్లి..
సాక్షి, ముంబై: కర్ణాటక సరిహద్దులోని ‘యెళ్లూర్’ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ‘సరిహద్దు ప్రాంతాల్లో రోజురోజుకీ మరాఠీ ప్రజలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. కర్ణాటక పోలీసులు యెళ్లూర్ గ్రామంలోని మరాఠీ ప్రజలను ఇళ్లల్లోకి చొరబడి చితకబాదారు. ఇది చాలా అమానుష’ మంటూ దుయ్యబట్టారు.
భారత్-పాక్ సరిహద్దు అంశం ఎంత కీలకమైనదో.., శివసేనకు కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు అంశం కూడా అంతే కీలకమైనదని ఉద్దవ్ నొక్కి చెప్పారు. సరిహద్దులోని యెల్లూర్ సంఘటనపై సోమవారం ప్రచురితమైన ‘సామ్నా’ సంపాదకీయంలో ఉద్ధవ్ ఠాక్రే కర్ణాటక తీరుపై మండిపడ్డారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులపై విమర్శలు గుప్పించారు. సరిహద్దు సంఘటనపై ఏపార్టీ నాయకులూ ఎందుకు నోరు విప్పడంలేదని నిలదీశారు.‘ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ సంఘటనపై అన్ని పార్టీలూ రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నించాయి.
మరి ఈ ఘటనపై ఎవరూ ఎందుకు నోరు విప్పడంలేదో అర్థం కావడంలేదు.. ఇది మన ఆత్మగౌరవ సమస్య..’ అని అన్నారు. సరిహద్దులోని మరాఠీ ప్రజలకు శివసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే అక్కడ భవిష్యత్తులో ఎటువంటి దుర్ఘటనలు జరిగినా కేంద్రం బాధ్యత వహించాల్సి వస్తుందని పరోక్షంగా బీజేపీని హెచ్చరించారు.
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో కొన్నేళ్లుగా సమస్య నడుస్తోంది.
సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రాంతాల్లో ఉన్న మరాఠీలు తమను కర్ణాటక ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, తమ ప్రాంతాలను మహారాష్ట్రలో కలపాలని ఎప్పటినుంచో ఉద్యమం చేస్తున్నారు. అదే నేపథ్యంలో ఐదు దశాబ్దాల కిందట యెళ్లూర్లో ఏర్పాటుచేసిన మహారాష్ట్ర రాజ్-యెళ్లూర్’ అనే హోర్డింగ్‌ను పోలీసులు శనివారం తొలగించారు. దిమ్మెను పగలగొట్టేశారు. దాంతో స్థానిక మరాఠీలు ఆందోళనకు దిగడంతో కర్ణాటక పోలీసులు మరాఠీయులను చితకబాదారు. శని,ఆదివారాల్లో జరిగిన ఘటనలో సుమారు 50మందికి పైగా మరాఠీలు గాయపడ్డారు. దీంతో సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. ‘ముంబైలో కర్ణాటక సంఘం, భవనం కూడా ఉన్నాయి. అలాగే పలు ప్రాంతాల్లో వాళ్లు హోటల్ వ్యాపారాలు చేసుకుంటున్నారు.
వారికి స్థానిక మరాఠీలు ఎన్నడూ ఎటువంటి హానీ తలపెట్టలేదు. కాని కర్ణాటకలో ఉన్న మరాఠీయులను మాత్రం స్థానిక ప్రభుత్వం అణగదొక్కేందుకు యత్నిస్తోంది..’ అని ఠాక్రే విమర్శించారు. ఇదే విషయమై గతంలో బేల్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యవర్గాన్ని రద్దు చేసేశారు. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో సైతం మరాఠీ ప్రతినిధులే విజయం సాధించారని.. దీన్ని బట్టి అక్కడి స్థానికుల్లో ఉన్న ఆకాంక్షను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలకు కేంద్రం న్యాయం చేయాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు.
కర్ణాటక సీఎంకు పృథ్వీరాజ్ చవాన్ ఫోన్..
యెళ్లూర్ ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఫోన్ చేసి మాట్లాడారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలను భయాందోళనలకు గురి చేసే చర్యలకు దిగకూడదని హితవు పలికారు. సరిహద్దులో శాంతి స్థాపనకు కృషిచేయాలన్నారు.
ఇదిలా ఉండగా, మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే కుమారుడైన నితీష్ రాణే మాట్లాడుతూ ముంబైలో కర్ణాటక దినోత్సవాన్ని జరగకుండా అడ్డుకుంటామన్నారు. అలాగే ముంబైలోని డబ్బావాలాలు సైతం కర్ణాటకలో మరాఠాలపై జరిగిన దాడిని ఖండించారు. ఈ మేరకు సోమవారం నగరంలో ఆందోళన నిర్వహించారు. యెళ్లూర్ ఘటన జరిగి ఉండాల్సింది కాదని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఘటనకు కారకులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని, సరిహద్దు గ్రామాల్లో శాంతిస్థాపనకు కృషిచేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు.