పసిమొగ్గను చిదిమేసింది
♦ స్కూల్ బస్సు చక్రం కింద నలిగి14 నెలల చిన్నారి దుర్మరణం
♦ వనస్థలిపురంలో ఘటన
హైదరాబాద్: స్కూల్ బస్సు రూపంలో వచ్చిన మృత్యువు ఆ పసిమొగ్గను చిదిమేసింది. ప్రతి రోజు అక్క పాఠశాలకు వెళ్లే బస్సే ఆ చిన్నారి పాలిట మృత్యుశకటంగా మారింది. ఈ హృదయ విదారకమైన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం కడుకుంట్లకు చెందిన మిద్దె బాల్‌రాజ్, జనని భార్యాభర్తలు. బాల్‌రాజ్ వృత్తిరీత్యా పెయింటర్. వీరికి నమ్రత(4), మహాలక్ష్మీ(14 నెలలు) ఇద్దరు పిల్లలు. వీరు వనస్థలిపురం శాతవాహన నగర్లో నివసిస్తున్నారు. నమ్రత ఎస్కేడీ నగర్‌లోని బాలకార్తికేయ పాఠశాలలో నర్సరీ చదువుతోంది. ప్రతిరోజు పాఠశాలకు చెందిన బస్సులోనే స్కూలుకు వెళ్లివస్తుంది.
రోజూ మాదిరిగానే పాఠశాల నుంచి బుధవారం సాయంత్రం 4.30 గంటలకు పాఠశాల బస్సు(టీఎస్08యూబీ3347) ఇంటి ముందు వచ్చి ఆగింది. తల్లి జనని బస్సులో నుంచి నమ్రతను తీసుకుంది. ఇదే సమయంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న 14 నెలల చిన్నారి మహాలక్ష్మీ అక్కను చూడాలనే ఆత్రుతతో బస్సు ముందుకొచ్చింది. పసిపాపను గమనించని డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో చిన్నారి చక్రాల కింద నలిగిపోయింది. తల నుజ్జునుజ్జవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందింది. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. వనస్థలిపురం సీఐ పుష్పన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి బస్సును పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. చిన్నారి దుర్మరణంతో శాతవాహన నగర్లో విషాదఛాయలు అలముకున్నాయి.