Kashmir Governor
-
కేంద్రంపై కశ్మీర్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తాజా వ్యాఖ్యలు కేంద్రంలోని బీజేపీ సర్కారును ఇరకాటంలో పడేశాయి. అసెంబ్లీని తాను రద్దు చేయకుంటే కేంద్రం ఒత్తిడి కారణంగా జేకేపీసీ (జమ్మూ కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్) పార్టీ అధినేత సజ్జాద్‌లోన్‌తో తాను సీఎంగా ప్రమాణం చేయించాల్సి వచ్చేదని సత్యపాల్ అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నిజాయితీ లేని వ్యక్తిగా మిగిలిపోవడం ఇష్టం లేకనే తాను అసెంబ్లీని రద్దు చేశానని పేర్కొన్నారు. ‘ఇప్పుడు ఆ సమస్య మొత్తం ముగిసింది. ఎవరేమనుకున్నా, నేను సరైన నిర్ణయమే తీసుకున్నానని నా మనస్సు చెబుతోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ పాలనలో ఉన్న కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్‌ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ గవర్నర్‌ను పీడీపీ కోరడం, తర్వాత కొన్ని గంటల్లోనే బీజేపీ మద్దతుతో తామూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు జేకేపీసీ సంప్రదించడంతో గవర్నర్ సత్యపాల్ అసెంబ్లీనే రద్దు చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ఆదేశాల మేరకే గవర్నర్ ఇలా చేశారని కాంగ్రెస్ ఆరోపించగా.. ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్- మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మాత్రం భిన్నంగా స్పందించారు. శాసనసభను రద్దు చేయకుండా సమావేశపరిచి గవర్నర్ బలపరీక్ష నిర్వహించి ఉంటే ఎవరి బలం ఎంతో తేలేదని ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడగా... ‘ఫ్యాక్స్ యంత్రాన్ని పట్టించుకోకుండా, కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేసి అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ నిర్ణయం జమ్మూ కశ్మీర్‌కు నిజంగా గొప్పది’ అని ముఫ్తీ ట్వీట్ చేశారు. -
ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించండి
కశ్మీర్ గవర్నర్‌కు పీడీపీ-బీజేపీ కూటమి లేఖలు జమ్మూ: జమ్మూ కశ్మీర్లో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు తాము సిద్ధమని పీడీపీ-బీజేపీ పార్టీలు శనివారం రాష్ట్ర గవర్నర్‌కు తెలిపాయి. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుకు అనుమతివ్వాలంటూ పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ గవ ర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కలసి లేఖను సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతునిస్తూ బీజేపీ కూడా ఆయనకు లేఖను అందించింది. అనంతరం మెహబూబా విలేకరులతో మాట్లాడుతూ బేషరతుగా మద్దతిచ్చిన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వం శాంతి, సామరస్యం, అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుందన్నారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడన్న అంశంపై ఇరు పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ ప్రమాణస్వీకారం చేయనుండగా, డిప్యూటీ సీఎంగా నిర్మల్‌సింగ్ వ్యవహరిస్తారు. పీడీపీ-బీజేపీ సంకీర్ణ కూటమి కలసికట్టుగా ముందుకు సాగుతుందని, ప్రమాణస్వీకార తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. మెహబూబా తండ్రి ముఫ్తీ మహమూద్ సయీద్ మరణానంతరం ఈ ఏడాది జనవరి 8న రాష్ట్రంలో గవర్నర్ పాలన ను విధించారు. ఎలాంటి విభేదాలూ లేవు: నయీమ్ అక్తర్ కేబినెట్ పదవుల పంపకంలో బీజేపీతో ఎలాంటి అభిప్రాయభేదాలూ లేవని పీడీపీ అధికార ప్రతినిధి నయీమ్ అక్తర్ తెలిపారు. మంత్రి పదవులపై విభేదాల వార్తలు పూర్తిగా నిరాధారమని ఆయన కొట్టివేశారు.