Jammu Kashmir election results: కశ్మీర్ లోయలో ఎర్రజెండా
జమ్మూకశ్మీర్ రాజకీయ ముఖచిత్రం నెమ్మదిగా మారుతోంది. కానీ స్థిరంగా ఉన్నది ఒకే ఒక నాయకుడు మహమ్మద్ యూసఫ్ తరిగామి. పచ్చని కశ్మీరీ లోయలో ఎర్రజెండాను రెపరెపలాడిస్తున్న సీపీఎం వెటరన్ లీడర్. కుల్గాం జిల్లాలో 1996 నుంచి సీపీఎంను విజయపథాన నడిపిస్తున్న నేత. జమాతే వెన్నుదన్నుతో మతం పేర ఓట్లడిగిన స్వతంత్ర అభ్యర్థి సయార్ అహ్మద్ రేషిని తన అభివృద్ధితో ఓడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ నిజానికి తరిగామి ఆయన ఇంటిపేరు కాదు.. ఊరి పేరు అసలే కాదు. షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్న 1979లో యూసఫ్‌ను అరెస్టు చేశారు. ఆయన అరెస్టు గురించి ఓ జర్నలిస్టు సీఎంను ప్రశ్నించగా.. ‘ఓ జో తరిగామ్ వాలా?’అంటూ ప్రస్తావించారు. అప్పటినుంచి తరిగామి ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఆయన ఎన్నికల అఫిడవిట్లో కూడా తరిగామి ఉంటుంది. దక్షిణ కశ్మీర్లో ఉన్న కుల్గాం.. 1996 నుంచి సీపీఎం పారీ్టకి మంచి పట్టున్న ప్రాంతం. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ.. రాష్ట్రాన్ని ఏ పార్టీ అయినా పరిపాలించనీ. కుల్గామ్ మాత్రం తరిగామీదే. అందుకే మంగళవారం ఆయన గెలుపొందిన తరువాత ‘హక్ కా హామీ తరిగామీ’అంటూ కుల్గామ్ వీధులన్నీ మారుమోగాయి. గట్టిపోటీని తట్టుకుని..ఈ ఎన్నికల్లో కుల్గాంలో గట్టిపోటీ నేలకొంది. నిషేధిత జమాతే ఇస్లామీ బలపరిచిన అభ్యర్థి సయార్ అహ్మద్ రేషితో తరిగామి తలపడ్డారు. మత తీవ్రవాదానికి పేరుగాంచిన జమాత్ 1980 తర్వాత ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ఇదే తొలిసారి. అంతకుముందు దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని బహిష్కరించింది. దీన్ని కేంద్రం 2019లో నిషేధించింది. 2024 జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 10 మంది జమాత్ మద్దతు గల స్వతంత్ర అభ్యర్థుల్లో రేషి ఒకరు. నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, సీపీఎం పార్టీలతో కూడిన పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పీఏజీడీ) తమ అభ్యరి్థగా తరిగామికి మద్దతు ఇచి్చంది. 85 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఒక్క కుల్గాంలోనే సీపీఎం పోటీ చేసింది. జమాత్ సైద్ధాంతిక ఆకర్షణతో రేషి రంగంలోకి దిగారు. తాను ఓడిపోతే.. ఇస్లాం ఓడిపోయినట్టేనంటూ ప్రచార ర్యాలీలో చెప్పారు. కానీ తరిగామి తన అభివృద్ధి మంత్రంతోనే ముందుకెళ్లారు. ఆరి్టకల్ 370 పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని తరిగామి ప్రాతినిధ్యం వహించిన (పీఏజీడీ) చెబుతూ వచి్చంది. తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి మాత్రమే ప్రచారంలో తరిగామి వివరించారు. నియోజకవర్గంలోని రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చాల్సి ఉందన్నారు. ప్రత్యర్థి రేషి ప్రచారం ఇందుకు విరుద్ధంగా ఉంది. కేవలం ఆరి్టకల్ 370 చుట్టే తిరిగింది. అంతిమంగా, ఇస్లాం మతతత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ తరిగామి విజయం సాధించారు. కుల్గాంలో తరిగామి విజయం ప్రజాస్వామ్యం, లౌకికత్వం విజయమని సీపీఎం పార్టీ కొనియాడింది. జైలు జీవితం.. గృహ నిర్భందం.. 1949లో జని్మంచిన తరిగామి.. అబ్దుల్ కబీర్ వని ప్రభావంతో చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 18 ఏళ్ల వయసులో అనంత్ నాగ్ కాలేజీలో సీట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1960, 1970 దశకాల్లో జమ్ముకశ్మీర్ లో జరిగిన పలు విద్యారి్థ, రైతు ఉద్యమాల్లో పాలు పంచుకన్నారు. 1979లో పాకిస్తాన్ మాజీ ప్రధాని జులి్ఫకర్ అలీ భుట్టో ఉరిశిక్ష తర్వాత కశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. ఈ సందర్భంగా ఆయన జైలుకు వెళ్లారు. వివాదాస్పద ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద నిర్భందానికి గురైన వామపక్ష నాయకుల్లో తరిగామి ఒకరు. 2019లో ఆరి్టకల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు తరిగామిని శ్రీనగర్‌లో 35 రోజుల పాటు గృహనిర్భందలో ఉంచారు. నిర్భందంలో ఉన్న సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న తరిగామిని ఎయిమ్స్‌కు తరలించేందుకు ఆయన సహచరుడు సీతారాం ఏచూరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.