‘కస్తూర్బా’ కష్టాలు
ఖమ్మం, న్యూస్‌లైన్ : జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినులు అష్టకష్టాలు పడుతున్నారు. అద్దెభవనాల్లో వసతులు లేక వారి ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మెనూ సక్రమంగా అమలు చేయపోవడం, కుళ్లిన కాయకూరలు, నీళ్లచారు, చద్ది అన్నం పెట్టడంతో తరుచూ అస్వస్థతకు గురవుతున్నారు. చాలీ చాలని ఇరుకు గదుల్లోనే ముడుచుకుంటున్నారు. టాయిలెట్స్ శుభ్రంగా లేకపోవడంతో బహిర్భూమికి బయటకు వెళ్లలేక బాలికలు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలతోపాటు, బయట వాతావరణం కూడా అడవులను తలపించే విధంగా ఉండటం, చిన్న పాటి వర్షాలకే పాఠశాలలు చెరువులుగా మారుతుండడంతో విషజ్వరాల బారిన పడుతున్నారు. తమ పిల్లలను అసౌకర్యాల నడుమ ఉంచలేక తల్లిదండ్రులు పాఠశాల నుంచి ఇంటికి
తీసుకెళ్లే పరిస్థితి నెలకొంది. ఇన్ని ఇబ్బందు మధ్య కేజీబీవీల్లో ఉండలేమని విద్యార్థులు మధ్యలోనే చదువు మానేసి ఇంటి బాటపడుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా నేటికీ సగం మందికి ట్రంకుపెట్టెలు, దుప్పల్లు, ప్లేట్లు అందలేదు.
విష జ్వరాలతో విలవిల..
జిల్లాలో కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులు విషజ్వరాలతో విలవిల్లాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 33 పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవు. అద్దెభవనాల్లో నడుస్తున పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడం, ఉన్నా అపరిశుభ్రంగా మారడంతో విద్యార్థులు బహిర్భూమికి బయటకెళ్లాల్సి వస్తోంది. పాఠశాలలు, పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. బాలికలకు దుప్పట్లు కూడా పంపిణీ చేయపోవడంతో దోమలు కుట్టి జ్వరాల బారిన పడుతున్నారు.
అమలు కాని మెనూ..
కస్తూర్బా పాఠశాలల్లో మెనూ కూడా సక్రమంగా అమలు కావడం లేదు. ప్రతిరోజు ఉదయం రాగిజావ, పాలు కలిపిన ఆహారం, ఉప్మా, పులిహోర, పూరీ, ఇడ్లీ వంటి టిఫిన్, మధ్యాహ్న భోజనంలో పప్పు, చారు, కూర, మజ్జిగ, సాయంత్రం 4 గంటలకు స్నాక్స్, రాత్రి భోజనంలో రసం, కూర, మజ్జిగ ఇవ్వాలి. నెలల తరబడి బిల్లులు రాలేదనే నెపంతో పలు పాఠశాలల్లో రాగిజావ, స్నాక్స్ పెట్టడం మానేశారు. భోజనంలో నీళ్లచారుతోనే విద్యార్థులు కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 6 నుంచి పదో తరగతి చదివే పిల్లలకు ఈ వయస్సులోనే ఎదుగుదల ఎక్కువగా ఉంటుందని, ఈ సమయంలో పౌష్టికాహారం అందిస్తేనే ఆరోగ్యవంతులుగా తయారవుతారని ఆరోగ్య నిపుణులు చెపుతున్నా.. అధికారుల నిర్లక్ష్యంతో బాలికలు బక్కచిక్కి పోతున్నారు. అపరిశుభ్రమైన వాతావరణంతోపాటు, భోజనంలో నాణ్యత లోపించడంతో విద్యార్థులు పాఠశాలకు రావాలంటేనే భయపడుతున్నారు. పలువురు విద్యార్థులు ఇప్పటికే బడిమానేసి ఇంటిబాట పడుతున్నారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న రఘునాధపాలెం మండలం మంచుకొండ కేజీబీవీలో ఇటీవల విద్యార్థులు విషజ్వరాలు సోకి ఇబ్బంది పడటమే ఇందుకు నిదర్శనం.
అద్దె భవనాల్లో అవస్థలు..
చాలీచాలని గదుల్లోనే విద్యార్థులతో పాటు వారి వస్తువులు, పాఠశాలకు సంబంధించిన వంటపాత్రలు కూడా పెడుతుండడంతో బాలికలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో 21, ఐటీడీఏ పరిధిలో 8, ఏపీడబ్ల్యూఆర్‌ఎస్ పరిధిలో 4 పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో జిల్లా వ్యాప్తంగా 5,492 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో కామేపల్లి, పెనుబల్లి, ముదిగొండ, తిరుమలాయపాలెం, బోనకల్లు, వాజేడు, వెంకటాపురం, పినపాక, ఎర్రుపాలెం పాఠశాల భవన నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలాయి. సొంత భవనాలు లేకపోవడంతో నెలకు రూ.8 వేలకు పైగా అద్దె చెల్లించి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లు, పురాతన భవనాలు, వసతులు లేని ఇళ్లలో పాఠశాలలు నిర్వహిస్తున్నారు. వీటి అద్దెలు కూడా రెండేళ్లుగా చెల్లించకపోవడంతో ఇంటి యజమానులు వచ్చి ఖాళీ చేయాలని గొడవ పెడుతున్నారు. ఒక్కో పాఠశాలకు రూ.1.25 కోట్లు మంజూరైనా సకాలంలో పూర్తిచేయాల్సిన ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీరిని అప్రమత్తం చేయాల్సిన ఉన్నతాధికారులు కూడా మామూళ్ల మత్తులో ఉండడంతో పాటు ఇంజనీరింగ్ విభాగంలో అక్రమంగా బిల్లులు డ్రా చేశారనే ఆరోపణలు రావడంతో కాంట్రాక్టర్లను, ఇంజనీరింగ్ అధికారులను ఏమీ అనడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
నేటికీ పూర్తిగా అందని దుప్పట్లు...
పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా కేజీబీవీల్లో చదివే సగం మంది బాలికలకు నేటి కీ ట్రంకుపెట్టెలు, దుప్పట్లు, ప్లేట్లు అందలేదు. జిల్లాలోని రాజీవ్ విద్యామిషన్ పరిధిలో ఉన్న 21 పాఠశాలల్లో మొత్తం 3,094 మంది విద్యార్థులు ఉండగా ఇందులో 1260 మందికి మాత్రమే గ్లాసులు, ప్లేట్లు, బెడ్షీట్లు, ట్రంకుపెట్టెలు ఇచ్చారు. మిగిలిన 1834 మంది బాలికలకు ఇవ్వలేదు. అద్దెభవనాల్లో కిటికీలకు తలుపుల లేక, చలికి కప్పుకోవడానికి దుప్పట్లు లేక విద్యార్థులు గజగజ వణుకుతున్నారు. ఇక పెట్టెలు లేకపోవడంతో వస్తువులు, దుస్తులు ఎక్కడ భద్రపర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.
ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఖర్చు చేసి బాలికా విద్యను ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఆలోచన అధికారుల నిర్లక్ష్యం మూలంగా నీరుగారిపోతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని కేజీబీవీల్లో మెరుగైన వసతులు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. లేకుంటే పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.