పెగ్గెర్ల ఎంపీటీసీ సభ్యురాలు కిడ్నాప్
కథలాపూర్, న్యూస్‌లైన్ : కథలాపూర్ మండలం పెగ్గెర్ల ఎంపీటీసీ సభ్యురాలు రాపెల్లి భాగ్యలక్ష్మి కిడ్నాప్‌నకు గురైనట్లు ఆమె భర్త రాపెల్లి గంగారాం గురువారం రాత్రి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... ఈ నెల 13న జగిత్యాల శివారులో ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యాక పెగ్గెర్ల ఎంపీటీసీ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో మండలంలోని సింగిల్‌విండో చైర్మన్‌తోపాటు ఓ సర్పంచి భర్త తమ భార్యను కిడ్నాప్ చేసి ఆమె వద్ద ఉన్న మూడు సెల్ఫోన్లు లాక్కున్నారని గంగారాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కథలాపూర్ ఎస్సై రవి భూషణరావుపేటలో గురువారం పలువురిని ఆరా తీశారు.
కిడ్నాప్ సంఘటన వాస్తవేమనని పోలీసులు నిర్ధారణకు వచ్చి కేసు ఫైల్ తయారుచేశారు. గురువారం రాత్రి కథలాపూర్ పోలీసులు క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకున్నాకా కిడ్నాప్ జరిగిన సంఘటన తమ పరిధిలోకి రాదని, జగిత్యాల పరిధిలోకి వస్తుందని బాధితులకు తెలపడంతో వారు జగిత్యాలకు బయలుదేరి వెళ్లారు. ఈ విషయమై కథలాపూర్ ఎస్సై రవిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా... ‘పెగ్గెర్ల ఎంపీటీసీ సభ్యురాలు కిడ్నాప్‌నకు గురైందని ఫిర్యాదు రావడంతో వివరాలు సేకరించాం. వాస్తవమే అని తేలింది. సంఘటన జగిత్యాల పరిధిలోకి వస్తుందని తెలిసి వారిని అక్కడికి వెళ్లాలని సూచించాం’ అని ఎస్సై రవి వివరించారు.