వాఙ్మయ సుధాతరంగాలు...
ఆర్ష వాఙ్మయంలో, ప్రాచీనార్యుల వచనాలలో నిండి ఉన్న చింతనను ఈ తరం వారికి ఉపయుక్తంగా ఉండేలా అందించడానికి సముద్రాల శఠకోపాచార్య చేసిన మంచి ప్రయత్నం ఇది. వేదాలలో, రామాయణ, మహాభారతాలలో మనిషి రుజుమార్గంలో నడవడానికి, చెడు బారిన పడకుండా ఉండటానికి అనేక హితోక్తులు ఉన్నాయి. వాటిని వెతికి పాఠకులకు అందించారు శఠకోపాచార్య. తల్లి విలువ, తండ్రి విలువ, స్నేహం విలువ, ధైర్యం విలువ, సత్యం విలువ.. వీటి విలువ తెలుసుకుంటే విలువైన జీవితం వృథా కాకుండా చూసుకోవచ్చు.
రావణుడి వల్ల యుద్ధంలో గాయపడిన సుగ్రీవుణ్ణి చూసి రాముడు బాధపడుతూ ‘త్వయి కించిత్ సమాపన్నే కింకార్యం సీతయా మమ!!’ అన్నాడట. అంటే ‘నీకేదైనా జరగరానిది జరిగితే ఇక నాకు సీతతో ఏమి పని’ అని అర్థం. ‘నా ప్రాణాల కంటే నాకు సీతే ముఖ్యం’ అన్న రాముడు భార్య కంటే స్నేహానికి ఇచ్చిన విలువ అది. ‘కఠోపనిషత్’లో ఒక వాక్యం ఉంది. ‘ఉత్తిష్ఠత! జాగ్రత్త! ప్రాప్య వరాన్నిబోధత’ అని. అంటే ‘మేల్కొండి. కర్తవ్యోన్ముఖులు కండి. శ్రేష్ఠులను ఆశ్రయించి వారి నుండి సదుపదేశాల్ని గ్రహించండి’ అని అర్థం. వివేకానందుడు చెప్పింది అదే. ఈ పుస్తకం చెబుతున్నదీ అదే.
వాఙ్మయ సుధా తరంగాలు- సముద్రాల శఠకోపాచార్య
వెల: రూ. 40 ప్రతులకు: 9959324703, 9848373067