రేప్ కేసులో మరో వృద్ధ బాబా
సాక్షి, జైపూర్: ఆధ్యాత్మిక ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్న దైవాంశసంభూతుల ఉదంతాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. రాజస్థాన్‌లో మరో స్వామిజీ నిర్వాకం బయటపడింది. ఓ న్యాయ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ ఆరోపణలపై స్వామి కుశలేంద్ర ప్రపనాచార్య ఫలాహరి మహరాజ్ పై కేసు నమోదయ్యింది.
నకిలీ బాబా.. సన్యాసి కాదు
70 ఏళ్ల కుశలేంద్ర అల్వార్‌లో ఆశ్రమం నడుపుతున్నారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, విదేశీయులు ఆయన భక్తుల జాబితాలో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌కు చెందిన 21 ఏళ్ల యువతి ఈ మధ్యే తన న్యాయవిద్యను పూర్తి చేసింది. ఆమె కుటుంబం కూడా కుశలేంద్రకు వీర భక్తులు. ఈ నేపథ్యంలో ఆశ్రమానికి చందా ఇచ్చేందుకు ఆగష్టు 7న యువతి ఆశ్రమానికి వెళ్లింది.
ఆమెను తన మందిరంలో కాసేపు వేచి ఉండాలని చెప్పిన బాబా.. తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం. దీంతో తల్లిదండ్రుల సాయంతో బిలాస్పూర్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అనారోగ్యంతో అల్వార్ లోని ఓ ఆస్పత్రిలో కుశలేంద్ర చికిత్స తీసుకుంటున్నాడని అల్వార్ పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి హిమ్‌రాజ్ మీనా తెలిపారు. వైద్యుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాత బాబాను ప్రశ్నిస్తామని ఆయన తెలిపారు. దర్యాప్తులో శైలేంద్ర పలుమార్లు బాధిత యువతి ఇంటికి వెళ్లినట్లు వెల్లడైందని హిమరాజ్ చెప్పారు.