గోదారి తీరాన అష్టదిగ్గజ కవనలహరి
అలరించిన భువన విజయం
రాజమహేంద్రవరం కల్చరల్ :
సురలోకంలో ఉన్న సాహితీ సమరాంగణ సార్వభౌముడు, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు మదిలో చిన్న కోరిక ఉదయించింది. నన్నపార్యుడు నడయాడిన గౌతమీతీరాన అష్టదిగ్గజాలతో భువన విజయ సభ నిర్వహించాని భావించాడు. సురరాజు అనుమతితో ఆదివారం రాత్రి పావన గోదావరీతీరాన ఉన్న కోళ్ళ వీరాస్వామి కల్యాణమండపంలో కొలువు తీరాడు. కవిరాజుల ఆనందం మిన్నుముట్టింది. కళాగౌతమి వారికి ఆతిథ్యమిచ్చింది. శ్రీకృష్ణదేవరాయల పరాక్రమపాటవాన్ని, కవితాభినివేశాన్ని, దానగుణాలను కవులు పద్యరూపంలో ప్రస్తుతించారు. ‘భూపాలాగ్రణీ! సత్యసంధా!..సాహిత్యగోష్ఠీ పాండిత్య ధురీణ! దానవిద్యాపారీణ’ అని అయ్యలరాజు రామభద్రుడు కొనియాడాడు. రాయలు అర్థి బృందానికి ‘ధనం’, ప్రత్యర్థి బృందానికి ‘నిధనం’(మరణం) కలగచేస్తాడని పింగళి సూరన వర్ణించాడు. ‘కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చె¯ŒS’ పద్యపూరణంతో రామకృష్ణుడు ఆలస్యంగా సభలోకి ప్రవేశిస్తాడు. భువనవిజయ కార్యక్రమంలో అల్లసాని పెద్దనగా కందుకూరి లక్షీ్మనరసింహశాస్త్రి, నంది తిమ్మనగా ఓలేటి బంగారేశ్వర శర్మ, భట్టుమూర్తిగా శిష్టుమధుసూదనరావు, పింగళి సూరనగా పూజ్యం షిరిడీ సాయి, మాదయగారి మల్లనగా మల్లాది శ్రీరామ్, అయ్యలరాజు రామభద్రకవిగా తాతా సందీప్, ధూర్జటిగా రాంభొట్ల పార్వతీశ్వర శర్మ, తెనాలి రామకృష్ణునిగా చేమకూరి సూర్యనారాయణ శర్మ, శ్రీకృష్ణదేవరాయలుగా కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి పరకాయప్రవేశం చేశారు.
నూతన భవనం సాహితీవేదికల కొరత తీరుస్తుంది:
గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంలో ఎంపీ నిధులతో నిర్మాణంలో ఉన్న నూతన భవనం సాహితీకార్యక్రమాలు జరుపుకునే సంస్థలకు ఉపయోగిస్తుందని ముఖ్య అతిథిగా పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పేర్కొన్నారు. భువన విజయం ప్రారంభౠనికి ముందు జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మాతృభాషలో పట్టు లేకపోతే అన్యభాషలలో పట్టు రాదన్నారు. కళాగౌతమి ప్రతినిధులు ఫణి నాగేశ్వరరావు, వరాహగిరి కృష్ణమోహన్, శుభోదయమ్ ఇ¯ŒSఫ్రా అధినేత కె.లక్షీ్మప్రసాద్, సాహిత్యాభిమానులు హాజరయ్యారు.