ఆ ఊరికి కేసీఆర్ కూతురు కవిత పేరు
నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్పై ఉన్న అభిమానం మాదిరిగానే ఆయన కూతురు, ఎంపీ కల్వకుంట్ల కవితపై కూడా ఆమె నియోజవర్గ ప్రజలకు ప్రేమ పొంగిపోతోంది. ఎంతలా అంటే ఆ నియోజకవర్గంలోని ఓ గ్రామ ప్రజలు ఆ గ్రామానికి ఆమె పేరే పెట్టుకునేంత. ఎంపీ కవిత నిజామాబాద్ నుంచి పార్లమెంటు నియోజవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే జిల్లాలోని అర్మూర్ బ్లాక్లో ఖానాపూర్ అనే గ్రామపంచాయతీ ఉంది. శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) పనుల కారణంగాఘా గ్రామంలోని 274 కుటుంబాలు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి కవిత అండగా నిలిచారంట.
తమ సొంత గ్రామం నుంచి కొన్ని కిలో మీటర్ల దూరంలోని ఓ కొత్త ప్రాంతానికి తామంతా వెళ్లాల్సి వచ్చిందని, అలాంటి సమయంలో తమకు కొత్త స్థలం ఎంపిక గ్రామ నిర్మాణంలో కవిత కృషి చేశారని, ముందస్తు చర్యలు తీసుకున్నారని అక్కడి గ్రామస్తులు చెప్పారు. ‘మేం ఎంపీ కవితను కొద్ది రోజుల కిందట కలిశాం. మా 274కుటుంబాలకు డబుల్ బెడ్రూంలు కట్టించాలని కోరాం. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. దీంతో ఆమెపై గౌరవంతో మా ఖానాపూర్ గ్రామానికి ఇక నుంచి కవితాపురంగా మార్చాలని నిర్ణయించుకొని రెండు రోజుల కిందటే తీర్మానం చేశాం’ అని గ్రామ సర్పంచి పెంబర్తి మమత నరేశ్ తెలిపారు. తమ దృష్టిలో ఇక ఖానాపూర్ కవితాపురం అయినట్లేనని అన్నారు. అయితే, దీనిపై ఆర్మూర్ తహశీల్దారు రాజేందర్ స్పందిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు ఖానాపూర్ గానే ఉంటుందని స్పష్టం చేశారు.
కానీ, సర్పంచ్ మాత్రం తమది కవితాపురమే అని చెబుతున్నారు. ఇప్పటికే అదే పేరిట వారు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ఇది ముమ్మాటికి కేసీఆర్ కుటుంబాన్ని పొగడ్తల్లో ముంచె చర్యలని, రహస్యంగా ఆ కుటుంబ సభ్యులే కావాలని ఇలాంటి చర్యలు కొంతమందితో చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఆదిలాబాద్ జిల్లాలోని దండేపల్లి అనే గ్రామంలో కేసీఆర్కు ఆయన మద్దతుదారులు గుడి కూడా నిర్మించిన విషయం తెలిసిందే. కేసీఆర్ కు భారత రత్న కూడా ఇవ్వాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ఇప్పటికే చక్కర్లు కొడుతుందట.