బెడిసికొట్టిన కిడ్నాప్ వ్యూహం
బెంగళూరు : వ్యూహం ఫలించక కిడ్నాపర్లు పోలీసు కాల్పుల్లో గాయపడి ఇక్కడి కేసీ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి కేసీ జనరల్ ఆస్పత్రికి చేరుకుని కిడ్నా పర్లు ధర్మారాం (22), జితేంద్ర (24) పరిస్థితిపై (వీరు రాజస్తాన్‌కు చెందినవారు) ఆరా తీశారు. వివరాలు... కాటన్‌పేట సమీపంలోని సుబ్రమణ్య కాలనీలో నివాసముంటున్న ఆమన్రాం ఇక్కడి చిక్కపేటలో దుస్తు ల దుకాణం నిర్వహిస్తున్నాడు.
ఇతని కుమారుడు వికాస్ (6). బుధవారం మధ్యాహ్నం వికాస్ స్కూల్ వ్యాన్‌లో ఇంటికి బయలుదేరిన సమయంలో ఆ వాహనం అనుసరిస్తూ ధర్మారాం, జితేంద్ర వచ్చారు. వికాస్ ఇంటి సమీపంలో వాహనం దిగిన వెంటనే నిందితులు బాలుడిని బైక్‌లో కిడ్నాప్ చేశారు. కొంత సమయం అనంతరం కిడ్నాపర్లు బాలుడు తండ్రి ఆమన్రాంకు ఫోన్ చేసి రూ. 30 లక్షలు డిమాండ్ చేశారు.
లేదంటే కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆమన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐలు సత్యనారాయణ, సునీల్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆమన్‌కు వస్తున్న ఫోన్లను ట్రాప్ చేసింది. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి కిడ్నాపర్లు చెప్పిన విధంగా ఆమన్ నగదుతో హరిశ్చంద్ర ఘాట్‌కు చేరుకున్నాడు. నగదు అక్కడి ఫుట్‌పాత్‌పై పెట్టాలని సూచించారు. నగదు బ్యాగ్ పెట్టిన ఒక్క నిముషానికే కిడ్నాపర్లు బ్యాగ్ తీసుకోడానికి వచ్చారు.
అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు కిడ్నాపర్లను పట్టుకోడానికి యత్నించారు. నిందితులు మారణాయుధాలతో పోలీసులపై దాడికి దిగారు. దీంతో అప్రమత్తమైన సీఐలు సత్యనారాయణ, సునీల్ కుమార్ తుపాకి కాల్పు లు జరిపారు. రెండు బుల్లెట్లు ధర్మరాం, జితేంద్ర కాళ్లలోకి దూసుకెళ్లడం తో వారు అక్కడే కుప్పకూలిపోయారు. ఈ మేరకు పోలీసులను బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి అభినందించారు.