ke krishnamurthi
-
కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది: కేఈ
వెల్దుర్తి (కర్నూలు): రాష్ట్రాన్ని అడ్డగోలు విభజన చేసిన కాంగ్రెస్‌కు పట్టిన గతే విభజన హామీలు మరిచిన బీజేపీకీ పడుతుందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఎల్. నగరం గ్రామంలో ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేవాదాయ శాఖ పరిధిలో ఎస్జేఎఫ్ కింద ఆలయాల పునరుద్ధరణకు నిధులిస్తున్నామన్నారు. అనంతరం గ్రామంలో నిర్మించిన ఎన్టీఆర్ ఇళ్లను ప్రారంభించారు. అంతకుముందు రత్నపల్లె గ్రామం మీదుగా వస్తుండగా ఆ గ్రామస్తులు తమకు లంచాలతో పింఛన్లు మంజూరు చేస్తున్నారని, మరుగుదొడ్ల బిల్లుల రాలేదని పలువురు గ్రామస్తులు.. డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, టీడీపీ నాయకులు ఎల్ఈ జ్ఞానేశ్వర్‌గౌడ్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతలు చేతకాని దద్దమ్మలు: కోట్ల
డోన్ (కర్నూలు): జిల్లా రైతాంగానికి ఉపయోగపడాల్సిన సాగునీటిని 272 జీవో ద్వారా రాష్ట్రప్రభుత్వం అనంతపురం జిల్లాకు తరలిస్తుంటే అధికారపార్టీ ప్రజాప్రతినిధులు దద్దమ్మలాగా చోద్యం చూస్తున్నారని కేంద్ర రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. నీరు–చెట్టు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఎన్ఆర్ఈజీఎస్ పనుల పేరుతో టీడీపీ నాయకులు కోట్లాది రూపాయలను దిగమింగారని ఆరోపించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, ఇసుక మాఫియాలు చెలరేగిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. హంద్రీనీవా కాల్వనీటితో చెరువులను నింపే హామీని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నాలుగేళ్లు గడిచినా నెరవేర్చలేకపోయామన్నారు. కర్నూలులో ఆగస్టు 18న నిర్వహించే మహాసభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరవుతున్నట్లు తెలిపారు. -
రెయిన్ గన్లతో రైతుల్లో ఆనందం
సామర్లకోట : రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెయిన్ గన్ పథకంతో రైతులకు ఎంతో ప్రయోజనం జరుగుతుందని డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖా మంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. మండలం జి. మేడపాడులో మరో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పతో కలసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో వర్మీ కంపోస్టు యూనిట్‌ను పరిశీలించారు. కమ్యూనిటీ భవనాలు, పంచాయతీ కార్యాలయం, రోడ్లకు వారు శంకుస్థాపన లు చేశారు. సొసైటీ భవనం గోదాములను ప్రారంభించారు. సొసైటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాజప్ప అధ్యక్షత వహించగా కేఈ కృష్ణమూర్తి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. రెయిన్ గన్‌తో గంటకు 10 ఎకరాలు తడుస్తుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తితో జిల్లాలో రైతులకు నీటిఎద్దడి ఏర్పడిన సమయంలో ఏలేరు ప్రాజెక్టుకు పోలవరం ప్రాజెక్టు ద్వారా నీరు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. వెబ్‌ల్యాండ్‌లోని సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత తహసీల్దార్లపై ఉందని, జాప్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మేడపాడును ఓడీఎఫ్ గ్రామం ప్రకటించడం ఆనందంగా ఉందని చెప్పారు. రాయలసీమ జిల్లాలో మేడపాడును ఆదర్శంగా తీసుకొని పని చేస్తామని తెలిపారు. చినరాజప్ప మాట్లాడుతూ పేదల కోసం వెయ్యి ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్లు పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, ముత్యం రాజబ్బాయి, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఎంపీపీ గొడత మార్త, జెడ్పీటీసీ సభ్యురాలు గుమెళ్ల విజయలక్ష్మి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.