భారతీయ బాలికకు అంతర్జాతీయ అవార్డు
హేగ్: యూఏఈకి చెందిన పదహారేళ్ల భారతీయ బాలికకు అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారం లభించింది. వాతావరణ సమన్యాయం, పర్యావరణ క్షీణతపై చేసిన పోరాటానికి గాను పర్యావరణ కార్యకర్త కెహకాషన్ బసును ఈ అవార్డు వరించింది. నెదర్లాండ్స్‌లోని హేగ్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా యూనస్ మాట్లాడుతూ పర్యావరణ సంబంధిత వ్యాధులతో ప్రతి ఏటా ముప్ఫై లక్షల మంది ఐదేళ్ల లోపు చిన్నారులు మరణిస్తున్నారని, పర్యావరణ సమస్యలతో చాలామంది బాలలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ తరుణంలో పర్యావరణ సమస్యలపై పోరాడే కెహకాషన్ బసు వంటివారి అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్నారులు ఆరోగ్యంగా, సురక్షితంగా ఎదిగేందుకు చక్కటి పర్యావరణం అవసరమని.. ఇది వారి హక్కు అని అన్నారు. ఈ హక్కు కోసం కెహకాషన్ బసు పోరాటం చేయడం అభినందనీయమని ప్రశంసించారు. బాలల స్థిరమైన భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత మావంటి వారందరిపై ఉందని బసు చాటిచెప్పిందన్నారు.
ఈ సందర్భంగా బసు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ పురస్కారం కోసం 49 దేశాల నుంచి 120 నామినేషన్లు రాగా.. అందులో గ్రీన్‌హోప్ వ్యవస్థాపకురాలైన బసు ఎంపిక కావడం విశేషం. ఆమ్స్టర్డామ్కు చెందిన గ్లోబల్ చిల్డ్రన్స్ ఎయిడ్ గ్రూప్ ఈ అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని 2005 నుంచి నిర్వహిస్తోంది.