kesa samudram
-
TG And AP: వరదల నీటిలో రైల్వే ట్రాక్.. 18 రైళ్లు ఆలస్యం!
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలుచోట్ల రోడ్లు, రైల్వే ట్రాక్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు.. భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా జలదిగ్బంధమైంది. జిల్లాలో రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకోయింది. దీంతో మట్టి కోతకు గురవడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.కాగా, భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ జలమయం అయ్యాయి. కేసముద్రం మండలంలో రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది. మట్టి కోతకు గురవడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్‌పై నుంచి వరద ప్రవహిస్తుండటంతో పందిపల్లి వద్ద మహబూబ్‌నగర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ నాలుగు గంటల పాటు నిలిచిపోయింది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో మచిలీపట్నం, సింహపురి రైళ్లు నిలిచిపోయాయి. దాదాపు 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో ఈ రైళ్లను దారి మళ్లించే అవకాశం ఉంది.భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్మహబూబాబాద్ - కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి దగ్గర భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్.దీంతో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లను నిలిపేసిన రైల్వే అధికారులు pic.twitter.com/1uJvcXA7Iw— HARISH TIRRI (@TIRRIHARISH) September 1, 2024 -
ఆస్తి కోసం తమ్ముడి హత్య
కేసముద్రం : ఆస్తి కోసం ఆశపడి అనుబంధాన్ని మరిచిపోయిన ఉదంతమిది. తోడపుట్టిన బంధాన్నే మరిచాడు ఓ అన్న..తమ్ముడి అడ్డు తొలగిస్తే ఆస్తి తనదవుతుందని భావించాడు. దీనికి ఓ మిత్రుడు తోడయ్యాడు. దీంతో పథకం ప్రకారంగా ఆ ఇద్దరు కలిసి హత్యకు పాల్పడ్డారు. కేసు ఛేదించిన పోలీసులు ఆ ఇద్దరిని శుక్రవారం అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ డీఎస్పీ నరేష్కుమార్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మహముద్‌పట్నం శివారు కాలనీతండాకు చెందిన వాంకుడోతు శ్రీనుకు ఇద్దరు కుమారులు సంతోష్, నవీన్‌లు ఉన్నారు. వరంగల్‌లో నవీన్ ఇంటర్మీడియట్ చదువుతుండగా, సంతోష్ డిగ్రీ చదువుతున్నారు. ఈ క్రమంలో సంతోష్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని అడుగగా ఏమి ఆస్తి ఉంది.. ఉన్న 5 ఎకరాల్లో నీ తమ్ముడికి సగం పోతే నీకు ఏమీ వస్తుందని ప్రశ్నించింది. దీంతో తనకు పెళ్లి కావాలంటే ఆస్తి ఉండాలని ఆలోచించాడు. ఈ మేరకు రాఖీ పండుగకు అన్నదమ్ములు ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా తన ప్రేమ వ్యవహరంతోపాటు, ఆస్తి విషయాన్ని ఇదే గ్రామంలో ఉంటున్న తన మిత్రుడు చిలువేరు సాయిరాంకు సంతోష్ తెలిపాడు. నీ తమ్ముడు అడ్డు తొలిగితేనే నీకు ఆస్తి వస్తుందంటూ అతడు చెప్పుకొచ్చాడు. దీంతో ఇద్దరు కలిసి నవీన్‌కు చంపాలని పథకం పన్నారు. కాగా గత నెల 27న తన తమ్ముడితో మనం మందు పార్టీ చేసుకుందామని చెప్పాడు. వొడ్కా మందు ఫుల్‌బాటిల్ తెమ్మని కేసముద్రం స్టేషన్‌కు పంపించాడు. ఇంతలో సంతోష్ కేసముద్రం విలేజ్‌లో ఎలుకల మందును తీసుకువచ్చాడు. తర్వాత మహముద్‌పట్నం గ్రామంలో మూడు బీర్లు తీసుకు వచ్చారు. సంతోష్ తన వ్యవసాయబావి వద్దకు మిత్రుడితో కలిసి వెళ్లారు. అక్కడే ఒక బీరు మూత తీసి అందులో ఎలుకల మందును కలిపారు. ఇంతలో అక్కడికి వచ్చిన నవీన్‌కు ఎలుకలమందు కలిపిన బీరు తాగమని ఇవ్వడంతో అతడు అందరితో పాటు తాగాడు. సాయంత్రం వరకు మందు పార్టీ సాగింది. ఈ క్రమంలో నవీన్ తన చొక్కాను విప్పి బండరాయి మీదకు వేసి పడుకున్నాడు.సాయంత్రమైనా నవీన్ ఊపిరితో ఉండడంతో, ఇతడు బతికితే తమ బండారం బయటపడుతుందని భావించి, విప్పిన చొక్కాను మెడకు కట్టి రెండువైపులా లాగి ఉరి వేసి హత్య చేశారు. సంతోష్ తన తమ్ముడి సెల్‌ఫోన్‌ను తీసుకుని వెళ్లాడు. ఇంటికి వెళ్లిన సంతోష్‌ను తమ్ముడు ఎక్కడున్నాడని అడిగితే ఏం సమాధానం చెప్పకపోవడంతో ఫోన్‌చేశారు. సంతోష్ వద్ద ఉన్న తమ్ముడి సెల్‌పోన్ రింగ్ కావడంతో తల్లిదండ్రులకు అనుమానం కలిగి నిలదీశారు. ఈ క్రమంలో సంతోష్, సాయిరాం ఇద్దరు పరారయ్యారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో నవీన్‌ను హత్య చేసిన విషయాన్ని గుర్తించారు. పోలీసులు గాలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఆ ఇద్దరు ఎటూ వెళ్లలేక శుక్రవారం లొంగిపోయి, తమ నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ మేరకు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో రూరల్ సీఐ ముత్తిలింగయ్య, ఎస్సై సతీష్, సిబ్బంది పాల్గొన్నారు. -
సెల్‌ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య
మహబూబాబాద్ : క్షణికావేశంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థికి ఏం బాధలు లేవు..అంతకన్నా కష్టాలు లేవు..కేవలం తల్లిదండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వలేదనే చిన్న కారణంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కేసముద్రం మండలం దన్నసరి గ్రామశివారులోని సబ్‌స్టేషన్ తండాకు చెందిన బానోత్ మోహన్(16) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సెల్‌ఫోన్ కొనివ్వాలని గత కొద్దిరోజుల నుంచి తన తల్లిదండ్రులను అడుగుతున్నాడు. తల్లిదండ్రులు సెల్‌ఫోన్ ఇప్పించడం లేదని తీవ్ర మనస్తాపానికి గురై బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి ఆత్మహత్యతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతర్జిల్లా దొంగ అరెస్ట్
కేసముద్రం, న్యూస్‌లైన్ : జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి డబ్బు కోసం అనేక అడ్డదారులు తొక్కాడు. సులువుగా డబ్బు సంపాదించి సమాజంలో ఉన్నత హోదాలో జీవించాలనే ఆశతో నక్సలైట్ అవతారం ఎత్తి రాష్ర్టంలోని పలు జిల్లాల్లో కిడ్నాప్‌లు, దొంగతనాలకు పాల్పడి చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. ఈ మేరకు మానుకోట సీఐ వాసాల సతీష్, ఎసై ్స రంజిత్‌రావు బుధవారం నిందితుడి వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన వానపాకుల రాంబాబు(అలియాస్ ఆజాద్, బాబు) గతంలో అదే మండలంలోని మైనేని మోహన్‌తో తొలుత 9 మందితో ప్రజాసేవా దళాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మారుమూల గ్రామం నుంచి 2002లో ఆరు సింగిల్ ఫోర్ పిస్టళ్లను కొనుగోలు చేసి ఖమ్మం జిల్లా పాల్వచ పరిసర ప్రాంతాలైన బంగారుచెలుక, ఉల్వనూరు, రేగులగూడెం అటవీ ప్రాంతాల్లో దళ సభ్యులంతా కొద్ది రోజులుగా షూటింగ్‌పై శిక్షణ పొందారు. అనంతరం రాంబాబు పాల్వంచ ప్రాంతంలోని కేటీపీఎస్ కాంట్రాక్టర్ రమేష్‌ను బెదిరించి రూ.2 లక్షలు వసూలు చేశారు. టేకులపల్లిలోని ఓ క్వారీ యజమానిని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తుండగా అక్కడి పోలీసులు అరెస్టు చేసి 6 పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే కొన్ని నెలల పాటు జైలులో ఉండి బెయిల్‌పై వచ్చిన రాంబాబు అదే ఏడాది ఓ కాంట్రాక్టర్‌ను కిడ్నాప్ చేసి మళ్లీ పోలీసులకు చిక్కాడు. అనంతరం 2007లో పాల్వంచలోని కృషి బార్ షాప్ యజమాని రాంమోహన్‌రావును బెదిరించి రూ.లక్ష, 2008లో నర్సంపేటలోని రూపా పేపర్ బైండింగ్ ఓనర్ లింగస్వామివద్ద రూ.20 వేలు వసూలు చేశాడు. 2012లో ఖానాపురంలోని అగ్రహర్ కాలనీలో రాజు అనే వ్యక్తి ఇంట్లో ఉన్న ఎల్‌సీడీని, ఖమ్మం జిల్లాలోని మారెమ్మగుడిలో రూ.30 వేలతోపాటు, 2013 జూన్ 23న వెస్ట్ గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు గ్రామానికి చెందిన గుండెపల్లి పోలీస్ అనే రైస్ మిల్లు వ్యాపారిని కొట్టి రూ.6.30 లక్షలను వసూలు చేసి పరారయ్యాడు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం బీహర్‌లో కొనుగోలు చేసిన ఎయిర్‌గన్‌ను చూపిస్తూ వరంగల్, ఖమ్మం, నల్లగొండ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కష్ణా జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లోని వ్యాపారులను, కిరాణం షాపు యజమానులను, క్వారీ ఓనర్లను బెదిరిస్తూ రూ.2వేల నుంచి మొదలుకుని లక్షల వరకు డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. అలాగే పలు చోట్ల చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతూ దొంగతనాలు చేస్తూ వచ్చాడు. హత్య కేసులోనూ నిందితుడు.. పాల్వంచ గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ అనే మహిళ ఖమ్మం శివారులో హోటల్ నడుపుతోంది. ఆమె తన అల్లుడైన చింతల సత్యనారాయణతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో పెద్దకొడుకు కృష్ణ వీరి వివాహేతర సంబంధానికి అడ్డుతగులుతూ వస్తున్నాడు. అయితే నాగేంద్రమ్మ హోటల్‌కు తరచూ వస్తున్న రాంబాబును వారు సంప్రదించి తమనుంచి కష్ణ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కృష్ణను చంపితే రూ.2లక్షలు ఇస్తామని నాగేంద్రమ్మ, సత్యనారాయణలు ఆశ చూపడంతో రాంబాబు దానికి సరేనన్నాడు. ఈ నేపథ్యంలో 2013 నవంబర్ 11న రాంబాబు.. కృష్ణకు మద్యం తాగించేందుకు బయటికి తీసుకెళ్లి బండరాయితో మోది హతమార్చాడు. కేసముద్రంలో చిక్కిందిలా.. రాంబాబు కేసముద్రం మండలంలోని తిమ్మంపేటకు చెందిన పిట్టల శ్రీనివాస్ అనే వ్యక్తితో కలిసి గతంలో పలు దొంగతనాలను పాల్పడ్డాడు. అయితే శ్రీనివాస్ అతడి నుంచి దూరంగా ఉండడంతో రాంబాబు ఒంటరిగా బెదిరింపులకు దిగుతూ దొంగతనాలు చేస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్ 24 కేసముద్రం మార్కెట్ ఎదురుగా ఉన్న ఎలక్ట్రికల్ షాపులో కాపర్ వైరు దొంగిలించాడు. అనంతరం ఓ పల్లి వ్యాపారిని బెదిరించి రూ.14 వేలు, ఈ నెలలో తిమ్మంపేట గ్రామంలోని ఓ ఇటుక బట్టి వ్యాపారిని బెదిరించి రూ.2వేలు వసూలు చేశాడు. తోట పుల్లయ్య అనే పల్లి వ్యాపారిని కూడా ఎయిర్‌గన్‌తో బెదిరించి తనకు రూ.5 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. అయితే వ్యాపారులందరూ ఇస్తే తాను కూడా డబ్బులు ఇస్తానని చెప్పడంతో వెళ్లిపోయాడు. తర్వాత పసుపు వ్యాపారి రాజన్నను కూడా బెదిరించడంతో అతడు రూ.2వేలు ఇచ్చాడు. ఈ క్రమంలో గత జనవరి 30న సదరు వ్యాపారి రాంబాబు బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు రాంబాబు ఎదురుపడ్డాడు. అయితే రాంబాబును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా చేతిలో ఉన్న ఎయిర్‌గన్‌ను చూపిస్తూ బెదిరించాడు. దీంతో కానిస్టేబుల్ మంగీలాల్ వెనకవైపు నుంచి వచ్చి అతడిని చాకచక్యంగా పట్టుకున్నాడు.