కేసముద్రం, న్యూస్‌లైన్ : జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి డబ్బు కోసం అనేక అడ్డదారులు తొక్కాడు. సులువుగా డబ్బు సంపాదించి సమాజంలో ఉన్నత హోదాలో జీవించాలనే ఆశతో నక్సలైట్ అవతారం ఎత్తి రాష్ర్టంలోని పలు జిల్లాల్లో కిడ్నాప్‌లు, దొంగతనాలకు పాల్పడి చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. ఈ మేరకు మానుకోట సీఐ వాసాల సతీష్, ఎసై ్స రంజిత్‌రావు బుధవారం నిందితుడి వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన వానపాకుల రాంబాబు(అలియాస్ ఆజాద్, బాబు) గతంలో అదే మండలంలోని మైనేని మోహన్‌తో తొలుత 9 మందితో ప్రజాసేవా దళాన్ని ఏర్పాటు చేశాడు.
ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మారుమూల గ్రామం నుంచి 2002లో ఆరు సింగిల్ ఫోర్ పిస్టళ్లను కొనుగోలు చేసి ఖమ్మం జిల్లా పాల్వచ పరిసర ప్రాంతాలైన బంగారుచెలుక, ఉల్వనూరు, రేగులగూడెం అటవీ ప్రాంతాల్లో దళ సభ్యులంతా కొద్ది రోజులుగా షూటింగ్‌పై శిక్షణ పొందారు. అనంతరం రాంబాబు పాల్వంచ ప్రాంతంలోని కేటీపీఎస్ కాంట్రాక్టర్ రమేష్‌ను బెదిరించి రూ.2 లక్షలు వసూలు చేశారు. టేకులపల్లిలోని ఓ క్వారీ యజమానిని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తుండగా అక్కడి పోలీసులు అరెస్టు చేసి 6 పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే కొన్ని నెలల పాటు జైలులో ఉండి బెయిల్‌పై వచ్చిన రాంబాబు అదే ఏడాది ఓ కాంట్రాక్టర్‌ను కిడ్నాప్ చేసి మళ్లీ పోలీసులకు చిక్కాడు.
అనంతరం 2007లో పాల్వంచలోని కృషి బార్ షాప్ యజమాని రాంమోహన్‌రావును బెదిరించి రూ.లక్ష, 2008లో నర్సంపేటలోని రూపా పేపర్ బైండింగ్ ఓనర్ లింగస్వామివద్ద రూ.20 వేలు వసూలు చేశాడు. 2012లో ఖానాపురంలోని అగ్రహర్ కాలనీలో రాజు అనే వ్యక్తి ఇంట్లో ఉన్న ఎల్‌సీడీని, ఖమ్మం జిల్లాలోని మారెమ్మగుడిలో రూ.30 వేలతోపాటు, 2013 జూన్ 23న వెస్ట్ గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు గ్రామానికి చెందిన గుండెపల్లి పోలీస్ అనే రైస్ మిల్లు వ్యాపారిని కొట్టి రూ.6.30 లక్షలను వసూలు చేసి పరారయ్యాడు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం బీహర్‌లో కొనుగోలు చేసిన ఎయిర్‌గన్‌ను చూపిస్తూ వరంగల్, ఖమ్మం, నల్లగొండ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కష్ణా జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లోని వ్యాపారులను, కిరాణం షాపు యజమానులను, క్వారీ ఓనర్లను బెదిరిస్తూ రూ.2వేల నుంచి మొదలుకుని లక్షల వరకు డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. అలాగే పలు చోట్ల చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతూ దొంగతనాలు చేస్తూ వచ్చాడు.
హత్య కేసులోనూ నిందితుడు..
పాల్వంచ గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ అనే మహిళ ఖమ్మం శివారులో హోటల్ నడుపుతోంది. ఆమె తన అల్లుడైన చింతల సత్యనారాయణతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో పెద్దకొడుకు కృష్ణ వీరి వివాహేతర సంబంధానికి అడ్డుతగులుతూ వస్తున్నాడు. అయితే నాగేంద్రమ్మ హోటల్‌కు తరచూ వస్తున్న రాంబాబును వారు సంప్రదించి తమనుంచి కష్ణ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కృష్ణను చంపితే రూ.2లక్షలు ఇస్తామని నాగేంద్రమ్మ, సత్యనారాయణలు ఆశ చూపడంతో రాంబాబు దానికి సరేనన్నాడు. ఈ నేపథ్యంలో 2013 నవంబర్ 11న రాంబాబు.. కృష్ణకు మద్యం తాగించేందుకు బయటికి తీసుకెళ్లి బండరాయితో మోది హతమార్చాడు.
కేసముద్రంలో చిక్కిందిలా..
రాంబాబు కేసముద్రం మండలంలోని తిమ్మంపేటకు చెందిన పిట్టల శ్రీనివాస్ అనే వ్యక్తితో కలిసి గతంలో పలు దొంగతనాలను పాల్పడ్డాడు. అయితే శ్రీనివాస్ అతడి నుంచి దూరంగా ఉండడంతో రాంబాబు ఒంటరిగా బెదిరింపులకు దిగుతూ దొంగతనాలు చేస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్ 24 కేసముద్రం మార్కెట్ ఎదురుగా ఉన్న ఎలక్ట్రికల్ షాపులో కాపర్ వైరు దొంగిలించాడు. అనంతరం ఓ పల్లి వ్యాపారిని బెదిరించి రూ.14 వేలు, ఈ నెలలో తిమ్మంపేట గ్రామంలోని ఓ ఇటుక బట్టి వ్యాపారిని బెదిరించి రూ.2వేలు వసూలు చేశాడు. తోట పుల్లయ్య అనే పల్లి వ్యాపారిని కూడా ఎయిర్‌గన్‌తో బెదిరించి తనకు రూ.5 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు.
అయితే వ్యాపారులందరూ ఇస్తే తాను కూడా డబ్బులు ఇస్తానని చెప్పడంతో వెళ్లిపోయాడు. తర్వాత పసుపు వ్యాపారి రాజన్నను కూడా బెదిరించడంతో అతడు రూ.2వేలు ఇచ్చాడు. ఈ క్రమంలో గత జనవరి 30న సదరు వ్యాపారి రాంబాబు బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు రాంబాబు ఎదురుపడ్డాడు. అయితే రాంబాబును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా చేతిలో ఉన్న ఎయిర్‌గన్‌ను చూపిస్తూ బెదిరించాడు. దీంతో కానిస్టేబుల్ మంగీలాల్ వెనకవైపు నుంచి వచ్చి అతడిని చాకచక్యంగా పట్టుకున్నాడు.
అంతర్‌జిల్లా దొంగ అరెస్ట్
Published Thu, Feb 20 2014 1:50 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement