పరస్పర సహకారంతో ముందుకు
తెలంగాణ, అసోం మంత్రుల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పరస్పర సహకారంతో ఇరు రాష్ట్రాలూ ముందుకు సాగాలని తెలంగాణ, అసోం అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రులు జోగు రామన్న, కేశభ్ మహంత నిర్ణయించారు. ఈ దిశగా ఇరు రాష్ట్రాల మధ్య అటవీ, విద్య, ఐటీ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో త్వరలోనే అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకోనున్నట్టు వారు వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో జోగు రామన్నతో మహంత, ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం, ఐటీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా ఉన్నాయని ఈ సందర్భంగా మహంత ప్రశంసించారు.
తమ రాష్ట్రంలోని ఖాజీరంగా జాతీయ పార్కును సందర్శించాలని జోగు రామన్నను మహంత కోరారు. అందుకు జోగు సానుకూలంగా స్పందించారు. దాదాపు రెండు లక్షల మంది అసోంవారు తెలంగాణలో ఉపాధి పొందుతున్నారని మహంత చెప్పారు. రాష్ర్ట సాంకేతిక మండలి, పర్యావరణ పరిరక్షణ, శిక్షణ పరిశోధన (ఈపీటీఆర్ఐ) కేంద్రాన్ని బృందం సందర్శించింది. అంతకుముందు తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో సమావేశమైంది.