కటిక పేదరికంలోనూ వీడని దురదృష్టం!
►దాతలూ ఆదుకోరూ...
► గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కుమార్తె
► తట్టుకోలేక కుప్పకూలి మృతి చెందిన తండ్రి
► చందాలతో చికిత్స చేయిస్తున్న గ్రామస్తులు
మందస: చిన్నతనం నుంచీ కూతురిని ప్రేమగా పెంచాడు. అయితే పేదరికం కారణంగా వివాహం జరిపించలేకపోయాడు. భార్య మరణంతో మరింత కుంగిపోయిన ఆశలన్నీ కూతురిపైనే పెట్టుకున్నారు. ఓ వైపు పేదరికం పట్టిపీడిస్తున్న ఆ కుటుంబాన్ని మరోవైపు దురదృష్టం వెంటాడింది. హఠాత్తుగా కుమార్తె గుండెపోటుతో ఆస్పత్రి పాలవగా..విషయం తెలిసిన ఆ తండ్రి కుప్పకూలి కన్నుమూశాడు. ఈ సంఘటన మండలంలోని డిమిరియా గ్రామంలో చోటుచేసుకుంది. కుమార్తెకు తండ్రి మరణ వార్త తెలియజేయకుండా గ్రామస్తులు జాగ్రత్తలు పడుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...గ్రామానికి చెందిన డంకూరు రాములు(65) వృత్తిరీత్యా రజకుడు. ఆయన భార్య మూడేళ్ల క్రితం చనిపోయింది. వీరికి కేశమ్మ, ఇద్దరు కుమారులున్నారు.
కుమారులు బతుకుదెరువు కోసం వలసపోయారు. రాములు తన కుమార్తెతో కలసి గ్రామంలోనే ఓ పూరిగుడిసెలో నివాసం ఉండే వారు. కుమార్తెకు పెళ్లీడు వచ్చినప్పటికి పెళ్లి చేసే స్తోమత లేకపోవడంతో అవివాహితగానే ఉండిపోయింది. ఆమె కొన్నాళ్ల క్రితం నుంచి వెలుగు కార్యాలయంలో సీసీగా పని చేస్తున్నారు. కాయకష్టంపై ఆధారపడి జీవిస్తున్న సమయంలో దురదృష్టం వారిని వెంటాడింది. కేశమ్మ మూడు రోజుల క్రితం హఠాత్తుగా గుండెపోటుకు గురవడంతో గ్రామస్తులు 108లో కాశీబుగ్గలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి, చందాలు వేసుకుని ఆమెకు చికిత్స చేయిస్తున్నారు. ఆ సమయంలో తండ్రి రాములు కూలి పనికోసం వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి విషయం తెలిసి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటికే ఊపిరి వదిలేశాడు. దీంతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.
దాతలసాయం కోసం ఎదురు చూపు
నిరుపేద కుటుంబానికి చెందిన కేశమ్మ గ్రామస్తుల సహకారంతో ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమెకు విశాఖపట్నంలోని ఓ పెద్ద ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించాలని, అందుకు సుమారు రూ.3లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో తెలియక గ్రామస్తులు, బంధువులు విలపిస్తున్నారు. సహృదయం గల దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నిండు జీవితం ప్రసాదించాలని కేశమ్మ కోరుతోంది. దాతలు 9866386936 సెల్ నంబర్‌ను సంప్రదించాలని గ్రామస్తులు కోరుతున్నారు.