Keshav Deshiraj
-
‘సర్వేపల్లి’ మనుమడు కేశవ్ దేశిరాజు కన్నుమూత
సాక్షి,చెన్నై/బాపట్ల: మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనుమడు (కుమార్తె కుమారుడు), విశ్రాంత ఐఏఎస్ అధికారి కేశవ్ దేశిరాజు (66) చెన్నైలో ఆదివారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. తన తాత రాధాకృష్ణన్ జయంతి రోజునే ఆయన తనువు చాలించడం విచారకరం. కేశవ్ పూర్వీకులు బాపట్లలోని దేశిరాజు వారి వీధిలో నివసించారు. ఇప్పటికీ చాలామంది దేశిరాజు కుటుంబాల వారు అక్కడ ఉన్నారు. 1978 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కేశవ్.. కేంద్ర ఆరోగ్య శాఖ, వినియోగదారుల శాఖల కార్యదర్శిగా పనిచేశారు. తన తాత సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తిని అణువణువునా పుణికిపుచ్చుకున్న కేశవ్ దేశిరాజు అనేక పుస్తకాలు రాశారు. కేశవ్ దేశిరాజు మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేష్ సంతాపం తెలిపారు. -
ఉల్లి ధరలకు చెక్
* టన్నుకు రూ.18 వేల కనీస ఎగుమతి ధర విధించిన కేంద్రం * తద్వారా ఎగుమతులు తగ్గి.. ధరలు దిగుతాయని ఆశాభావం న్యూఢిల్లీ: ఉల్లిపాయల ధరలు మళ్లీ ఆకాశానికి ఎగబాకే అవకాశాలు కనిపిస్తుండడంతో ఆందోళన చెందిన కేంద్ర ప్రభుత్వం వాటిని దించే దిశగా చర్యలకు ఉపక్రమించింది. ఉల్లిపాయల ఎగుమతులను నియంత్రించడం ద్వారా దేశంలో వాటి సరఫరా పెంచేందుకు వీలుగా కనీస ఎగుమతి ధర(ఎంఈపీ)ను మళ్లీ అమల్లోకి తెచ్చింది. టన్నుకు 300 డాలర్ల చొప్పున(దాదాపు రూ.18,000) ఎంఈపీ విధించింది. పక్షం రోజుల కిందట ఢిల్లీలో రూ.15-20 రేటు ఉన్న కిలో ఉల్లిపాయలు ఇప్పుడు రూ.25-30కు పెరిగిపోవడంతో కంగారుపడిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఈ ఎంఈపీని మార్చి నెలలో రద్దు చేయగా.. మూడు నెలల తర్వాత కొత్త ప్రభుత్వం దాన్ని మళ్లీ అమల్లోకి తేవడం గమనార్హం. ఎంఈపీ కంటే తక్కువ ధరకు ఎవరూ ఉల్లిపాయలను ఎగుమతి చేయడానికి వీలుండదని వాణిజ్య శాఖ మంత్రి విడుదల చేసిన నోటిఫికేషన్లో తెలిపారు. ఆహార ద్రవ్యోల్బణాన్ని అరికట్టే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానమంత్రి కార్యాలయంలో సమావేశం అనంతరం ఈ చర్య తీసుకున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి కేశవ్ దేశిరాజు చెప్పారు. వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాలు, వాణిజ్య మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సగటున ఏడాదికి 15 లక్షల టన్నుల ఉల్లిపాయలు ఎగుమతి అవుతున్నట్లు దేశిరాజు తెలిపారు.