ఉల్లి ధరలకు చెక్ | Onion prices may go up after strike in Nashik market | Sakshi
Sakshi News home page

ఉల్లి ధరలకు చెక్

Published Wed, Jun 18 2014 1:02 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

ఉల్లి ధరలకు చెక్ - Sakshi

ఉల్లి ధరలకు చెక్

* టన్నుకు రూ.18 వేల కనీస ఎగుమతి ధర విధించిన కేంద్రం
* తద్వారా ఎగుమతులు తగ్గి.. ధరలు దిగుతాయని ఆశాభావం

 
 న్యూఢిల్లీ: ఉల్లిపాయల ధరలు మళ్లీ ఆకాశానికి ఎగబాకే అవకాశాలు కనిపిస్తుండడంతో ఆందోళన చెందిన కేంద్ర ప్రభుత్వం వాటిని దించే దిశగా చర్యలకు ఉపక్రమించింది. ఉల్లిపాయల ఎగుమతులను నియంత్రించడం ద్వారా దేశంలో వాటి సరఫరా పెంచేందుకు వీలుగా కనీస ఎగుమతి ధర(ఎంఈపీ)ను మళ్లీ అమల్లోకి తెచ్చింది. టన్నుకు 300 డాలర్ల చొప్పున(దాదాపు రూ.18,000) ఎంఈపీ విధించింది. పక్షం రోజుల కిందట ఢిల్లీలో రూ.15-20 రేటు ఉన్న కిలో ఉల్లిపాయలు ఇప్పుడు రూ.25-30కు పెరిగిపోవడంతో కంగారుపడిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఈ ఎంఈపీని మార్చి నెలలో రద్దు చేయగా.. మూడు నెలల తర్వాత కొత్త ప్రభుత్వం దాన్ని మళ్లీ అమల్లోకి తేవడం గమనార్హం.
 
 ఎంఈపీ కంటే తక్కువ ధరకు ఎవరూ ఉల్లిపాయలను ఎగుమతి చేయడానికి వీలుండదని వాణిజ్య శాఖ మంత్రి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తెలిపారు. ఆహార ద్రవ్యోల్బణాన్ని అరికట్టే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానమంత్రి కార్యాలయంలో సమావేశం అనంతరం ఈ చర్య తీసుకున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి కేశవ్ దేశిరాజు చెప్పారు. వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాలు, వాణిజ్య మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సగటున ఏడాదికి 15 లక్షల టన్నుల ఉల్లిపాయలు ఎగుమతి అవుతున్నట్లు దేశిరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement