ముందు పురుష రూపం.. వెనుక స్త్రీ రూపం
ర్యాలి (ఆత్రేయపురం):ముందు పురుష రూపం.. వెనుక స్త్రీ రూపంతో.. భక్తజన సమ్మోహనంగా శ్రీ మహావిష్ణువు వెలసిన అద్భుత క్షేత్రం ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం. ఇక్కడ స్వామివారు ముందువైపు కేశవస్వామిగా, వెనుకవైపు జగన్మోహినిగా భక్తులకు దర్శనమిస్తుంటారు. అణువణువునా ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ దివ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఆరో దేవాలయంగా ఖ్యాతికెక్కింది. ఈ స్వామిని దర్శించుకుంటే సర్వపాపాలూ హరిస్తాయని భక్తుల విశ్వాసం. కోరిన కోర్కెలు నెరవేర్చే దివ్యస్వరూపుడిగా పేరొందిన ఈ స్వామి వార్షిక దివ్య కల్యాణోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. ఇందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యాన విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
విశిష్ట చరితం.. ఈ క్షేత్రం సొంతం
ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయానికి విశిష్ట చరిత్ర ఉంది. ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో ఇటు గౌతమి, అటు వశిష్ట నదీపాయల మధ్య ఈ క్షేత్రం వెలసింది. ఈ గ్రామానికి ర్యాలి అనే పేరు రావడం వెనుక ఒక యథార్థ గాథ ఉన్నట్టు ఇక్కడి పండితులు చెబుతారు. పూర్వం ఈ ప్రాంతం అరణ్యంగా ఉండేది. విక్రమదేవుడు అనే భక్తుడు ఈ ప్రాంతంలో వేట సాగిస్తూ ఒక చెట్టు వద్ద నిద్రించాడు. అతడికి కలలో కనబడిన శ్రీమహావిష్ణువు స్వయంభూ శిల రూపంలో తాను ఈ ప్రాంతంలో ఉన్నానని, కర్రతో రథం చేయించి లాక్కొని వెళ్తే, ఆ రథం శీల రాలి పడినచోట తవ్వితే విగ్రహం బయట పడుతుందని చెబుతారు. స్వప్న వృత్తాంతం ప్రకారం విక్రమదేవుడి ద్వారా ఈ విగ్రహం బయట పడిందని అంటారు. రథం శీల రాలడం వలన ఈ దైవం వెలసిన ప్రాంతానికి ‘ర్యాలి’ అనే పేరు వచ్చిందని నానుడి. అమృతం కోసం తగవులాడుకుంటున్న దేవతలను, రాక్షసులను శాంతిపజేసి, రాక్షసులకు అమృతం అందకుండా చేసేందుకు శ్రీమహావిష్ణువు జగన్మోహిæనిగా అవతరించారు. ఆ ఘట్టం ముగిసిన తరువాత కళ్లు చెదిరే సౌందర్యంతో ఉన్న జగన్మోహినిని శంకరుడు మోహిస్తాడు. ఆమెను వెంటాడుతాడు. ఆ క్రమంలో జగన్మోహిని ర్యాలి వరకూ వచ్చి అంతర్థానమైనట్టు చరిత్రకారులు వెల్లడిస్తున్నారు.
అడుగడుగునా అద్భుతాలే..
ఈ ఆలయంలో అణువణువునా అద్భుతాలే కనిపిస్తాయి. అత్యంత ఎత్తయిన పురాతన గోపురం అందరినీ ఆకర్షిస్తుంది. గర్భగుడితోపాటు శ్రీదేవి, భూదేవి విగ్రహాలు సహితం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తాయి. గర్భగుడి ప్రాంగణంలో పూర్వం ఉపయోగించారని భావిస్తున్న అత్యంత లోతైన సొరంగ మార్గం చూపరులను ఆకట్టుకుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన వింత స్వామివారి మూర్తి. సాలగ్రామ శిలతో రూపొందిన ఈ విగ్రహం ఐదడుగుల ఎత్తున స్త్రీ, పురుష రూపాల్లో దర్శనమిస్తూ భక్తులను తన్మయత్వంలో ముంచుతుంది. ఈ ఒక్క శిలలోనే రెండు విధాలైన ఆలయాలు, పొన్నచెట్టు, దక్షిణ భాగంలో గోవర్ధన పర్వతం, మకర తోరణం స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సాలగ్రామ ఏకశిలా విగ్రహంలోనే దశావతారాలు కనిపించడం మరో అద్భుత విశేషం. కంఠంలోని హారాలు, కర కంకణాలు, శంఖచక్రాలతో ఈ మూర్తి దైవం కళ్లెదుట సాక్షాత్కరించినట్టుగా అనుభూతిని కలిగిస్తుంది. సాలగ్రామ విగ్రహం పాదాల వద్ద గంగా జలం నిత్యం ఉబుకుతూనే ఉండడం ఇక్కడ మరో విశిష్టత. ఇక్కడి గంగాదేవి విగ్రహం నుంచి ఈ జలం ప్రవహిస్తూ నిత్యం స్వామివారి పాదాలను కడుగుతుందని భక్తుల విశ్వాసం. ఆలయానికి ఎదురుగా, పశ్చిమం వైపు శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ నీరు ఇంకిపోవడం, జగన్మోహనుడి ఆలయంలో స్వామివారి పాదాల నుంచి నిరంతరం గంగ ఉద్భవించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
విగ్రహం వెనుక వైపు ఉన్న జగన్మోహినీ రూపం మరింత సమ్మోహనం. స్త్రీ రూపంలో ఉన్న మహావిష్ణువు అత్యంత సౌందర్యంగా కనిపిస్తారు. సిగ చుట్టూ అప్పుడే సంపంగి నూనె రాసుకొన్నట్లుగా ఉన్న శిరోజాలు, ఆకట్టుకొనే చీరకట్టు, తలలో ముచ్చటగొలిపే చామంతి పువ్వు విశేషంగా కనిపిస్తాయి. అంతేకాకుండా పద్మినీ జాతి స్త్రీలకు శుభసూచకంగా ఉండేలా పుట్టుమచ్చలు సహితం ఈ విగ్రహంలో సాక్షాత్కరించడం భక్తులను భక్తిపారవశ్యంలో ఓలలాడిస్తుంది. ఈ ఆలయంలో భక్తులందరికీ గర్భాలయ ప్రవేశం ఉండటం విశేషం.
చేరుకోవడమిలా..
కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం వైపు నుంచి వచ్చే భక్తులు ర్యాలి పుణ్యక్షేత్రానికి రావులపాలెం మీదుగా చేరుకోవచ్చు. రావులపాలెం నుంచి ఊబలంక మీదుగా ర్యాలి చేరుకునేందుకు ఆరు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. రావులపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రెండు గంటలకోసారి బస్సు సౌకర్యం ఉంది. దీంతో పాటు ప్రైవేటు వాహనాల ద్వారా కూడా ర్యాలి చేరవచ్చు. అలాగే రాజమహేంద్రవరం నుంచి బొబ్బర్లంక, ఆత్రేయపురం మీదుగా కూడా ర్యాలి చేరుకోవచ్చు.
కల్యాణ క్రతువు జరిగేదిలా..
స్వామివారికి 25వ తేదీ ఉదయం ప్రత్యే క పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం గరుడవాహన సేవ, రాత్రి 8.45 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం జరుగుతాయి. 29వ తేదీన సదస్యం, 31న చక్రస్నానం, ఏప్రిల్ 1న శ్రీపుష్పోత్సవం నిర్వహిస్తారు. దీంతో కల్యాణ మహోత్సవాలు ముగుస్తాయి.