జగన్మోహిని కొలువున్న చోటు..?
కౌన్సెలింగ్
విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో కొలువైన ప్రాంతమేది? దాని విశేషాలేంటి?
- ప్రసాద్, విజయనగరం
విష్ణుమూర్తి జగన్మోహినీ రూపంలో కొలువైన క్షేత్రం ర్యాలి. ఇది తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంది. ఇక్కడున్న జగన్మోహినీ కేశవస్వామి ఆలయంలో విష్ణుమూర్తి జగన్మోహినీ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. అంటే విగ్రహానికి ముందు వైపు విష్ణుమూర్తి, వెనుక వైపు జగన్మోహిని రూపం భక్తులకు కనిపిస్తుంది. సాలగ్రామ శిలగా ఉన్న ఈ విగ్రహం పొడవు ఐదు అడుగులు. వెడల్పు మూడు అడుగులు. ఈ విగ్రహంలోని శిల్ప సౌందర్యం వర్ణనాతీతం. ప్రపంచంలో ఇలాంటి విగ్రహం మరెక్కడా లేదంటారు.
హనుమంతుడిని వెన్నతో అలంకరించే క్షేత్రమేది? అది ఎక్కడ ఉంది?
- సి.హెచ్.కుమార్, ఈమెయిల్
హనుమంతుడిని వెన్నతో అలంకరించే క్షేత్రం శుచీంద్రం. ఈ క్షేత్రంలోని స్థానేశ్వర స్వామి ఆలయంలో ఉన్న భారీ హనుమంతుడిని రోజూ వెన్నతో అభిషేకించి, వెన్నతోనే అలంకారం చేస్తారు. ఇలాంటి సంప్రదాయం దేశంలో ఇదొక్కటే కావడం విశేషం. హనుమంతుడు ఇక్కడ భారీ ఆకారంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు స్వామి వారికి వెన్న సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. శుచీంద్రం తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి క్షేత్రానికి సుమారు ఇరవై కిలోమీటర్ల ఈవల ఉంది.