4 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని డిల్లీలో మరో ఘోరం. కేశవపురం ప్రాంతంలో ఆదివారం రాత్రి ఓ నాలుగేళ్ల చిన్నారిని రేప్ చేసి హత్య చేశారు. బ్రిటానియా రైల్వే లైన్ సమీపంలోని ఇంటి బయట ఆమె ఆడుకుంటుండగా ఇద్దరు ఎత్తుకెళ్లి రేప్ చేశారని, ఆ తరువాత గొంతు నులిమి చంపి దగ్గర్లోని రైలు పట్టాలపై పడేశారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సోమవారం చిన్నారి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. సమీపంలోని ఫ్యాక్టరీలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో నిందితులు బాలికను తీసుకెళ్తున్నట్లు గుర్తించామని వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
చిన్నారి కుటుంబం 20 ఏళ్లుగా కేశవపురం ప్రాంతంలో నివసిస్తోంది. ఆమె తండ్రి ఓ గోడౌన్ లో కూలీగా పనిచేస్తున్నాడు. బాధితురాలి కుటుంబ సభ్యులను ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలివాల్ పరామర్శించారు. ఢిల్లీలో మహిళలు, ఆడ పిల్లలకు భద్రత లేకుండా పోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది ఇదే ప్రాంతంలో గతేడాది నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిందని గుర్తు చేశారు. ఈ ప్రాంతం ఏమాత్రం సురక్షితం కాదని అన్నారు.