తమిళనాడు ఎన్నికల బరిలో తెలుగువాళ్లు
చెన్నై: తమిళనాడులో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగువారు పోటీ చేస్తున్నట్టు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదేశ్వరరెడ్డి పేర్కొన్నారు. తమిళనాడులో బాషా పరిరక్షణ ఉద్యమంలో భాగంగా తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో భాషపరంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తెలుగువారు పోటీచేస్తున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదేశ్వరరెడ్డి, సంస్థ కార్యదర్శులు మండ్లు శ్రీనివాసరావు, డి. శివశంకరరెడ్డి, యు. పించలయ్య, బి. గోవర్థన్, కె. మోహన కృష్ణ, ఎస్. బాలాజీలతో పాటు తమిళనాడుకు చెందిన తెలుగు సంఘాల ప్రముఖులందరూ చిత్తూరు పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించినట్టు తెలిపారు.
త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సినీరంగ ప్రముఖులను కలిసి ఎన్నికలలో పోటీ చేయనున్న తెలుగువారికి, తెలుగు సంఘాలకు మద్దతు తెలపాలని కోరుతామని కేతిరెడ్డి తెలిపారు.