శింబు,నయన మధ్య ప్రేమ ఎలా మొదలైంది?
శింబు, నయనతార రియల్ ప్రేమకథ తెరకెక్కడానికి ముహూర్తం పడి చాలా రోజులైంది. పది శాతం చిత్రీకరణ కూడా జరిగి ఆగిపోయింది. ఈ చిత్రం పేరు కెట్టవన్. అంటే చెడ్డవాడు అని అర్థం. నిజ జీవితంలో శింబు, నయనతార మధ్య ప్రేమ ఎలా మొదలైంది? ఎంత శిఖరాగ్రానికి చేరింది? ఎలా ముగిసింది? ఇత్యాది అంశాలతో కూడిన ఈ చిత్రంలో హీరోయిన్ మాత్రం లేఖ వాషింగ్టన్. నవ దర్శకుడు నందు కథ, దర్శకత్వం బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. అయితే ఫైనాన్స్ సమస్య కారణంగా చిత్ర నిర్మాణం అటకెక్కిందని సమాచారం.
ఈ కారణంగా ప్రేక్షకులకు శింబు, నయనతార ప్రేమకథను తెరపై చూసే అవకాశం లేకుండా పోయింది. ఆ చిత్రానికి మళ్లీ ఇప్పుడు బూజు దులుపుతున్నారనే విషయం అందరికీ శుభవార్తే. చిత్ర నిర్మాణాన్ని పునః ప్రారంభించడానికి ఆ చిత్ర నిర్మాత సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ విషయమై దర్శకుడు నందు ఇటీవల శింబుతో కలిసి చర్చించినట్లు తెలిసింది. శింబు కూడా దీనికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ప్రస్తుతం శింబు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఒక చిత్రం, గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అచ్చం ఎంబదు మడమయ డా చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసి కెట్టవన్కు సిద్ధమవుతానని మాట ఇచ్చినట్లు తెలి సింది.
మొదట ఈ చిత్రంలో నటించిన నటి లేఖా వాషింగ్టన్‌ను ఇప్పుడు ప్రేక్షకులు మర్చిపోవడంతో ఆ పాత్రలో ఒక ప్రముఖ నటిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తెరకెక్కించడాన్ని అప్పట్లో నయనతార తీవ్రంగా వ్యతిరేకించినట్లు ప్రచారం జరిగింది. ఆమే ఇప్పుడు శింబుతో కలిసి ఇదు నమ్మ ఆళు చిత్రంలో నటించారు. మరి కెట్టవన్ పునః ప్రారంభం గురించి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.