KG basin pipeline
-
బతుకులు తెల్లారుతున్నాయ్
మలికిపురం: అది 2012 సంవత్సరం జూలై 21వ తేదీ..సమయం: ఉదయం 5 గంటలు. ప్రాంతం: మలికిపురం మండలంశంకరగుప్తం గ్రామం అడవిపాలెం. ఉదయమే అందరూ నిద్రలేచి బయటకు వెళ్తున్నారు. సరిగ్గా అప్పుడే, సమీపంలోనే గ్యాస్ బావుల సముదాయం వద్ద పైప్‌లైన్ భారీ పేలుడు. ఆ ప్రాంతం అంతా పొగలాగా గ్యాస్ ఆవరించి తీవ్రంగా వాసనవస్తుంటే పరిస్థితిని గమనించి, కంగారు పడ్డ ఓ తల్లి తన ఇద్దరి పిల్లను చంకన వేసుకుని కంగారుగా ఆ ప్రాంతం వదిలి పరుగులు తీసింది. పొయ్యి వెలిగించ వద్దంటూ ఆర్తనాదాలు చేసింది. ఆమెతో పాటు ఆ ప్రాంతంలో కూలీ నాలీ చేసుకునే వందలాది మంది ప్రజలు పరుగులు తీశారు. అనంతరం.. అదే రోజు ఉదయం: 8 గంటలు స్థానికంగా ఉన్న గెయిల్ అధికారులు తాపీగా వచ్చి గ్యాస్ అదుపు చేశారు. ఆ రోజు సాయంత్రం వరకూ ఆ ప్రాంతంలో వంట చేసుకునేందుకు పొయ్య వెలిగించడానికి కూడా స్థానికులు భయపడ్డారు. అప్పట్లో ప్రాణాపాయం తప్పింది. అదే పరిస్థితి మళ్లీ.. 2014 జూన్ 27వ తేదీ గురువారం సమయం : ఉదయం 5 గంటలు. ప్రాంతం: మామిడికుదురు మండలం తాటిపాక సమీపంలో నగరం మినీ రిఫైనరీ ఎదుట. ఏం జరిగిందో తెలుసుకోక ముందే మరో తల్లి తన బిడ్డలను పట్టుకుని రక్షించుకునే లోపే మంటల వలయాల్లో చిక్కుకుని ఒకరినొకరు పట్టుకుని బూడిదగా మారారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. సంఘటన ప్రదేశంలోనే 13 మంది బూడిదయ్యారు. అలా రోడ్డుపై ప్రమాణిస్తున్న కొందరితో పాటు మరికొందరు మంటల్లో కాలి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. మొత్తం 24 మంది మృత్యువాత పడ్డారు. ఓఎన్జీసీ, గెయిల్ చరిత్రలో ఇదొక మరచిపోలేని భయంకర దుర్ఘటన. ఇలా ఒకటి కాదు.. తరచూ కేజీ బేసిన్ పరిధిలో జరుగుతున్న సంఘటనలు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. భూగర్భంలోని చమురు నిక్షేపాలను వెలికి తీస్తున్నామని సగర్వంగా ప్రకటించే ఆయా సంస్థలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. ప్రజలకు ప్రాణ సంకటంగా మారిన అనేక సంఘటనలు జిల్లాలో జరిగాయి. 1990 ప్రాంతంలో మామిడికుదురు మండలం కొమరాడ ఆయిల్ బావి బ్లో అవుట్ నుంచి 1994 అమలాపురం వద్ద బోడసకుర్రు బ్లో అవుట్. 1995లో కొత్తపేట మండలం దేవరపల్లి బ్లోఅవుట్ లు ఆయిల్ నిక్షేపాల అన్వేషణలో జరిగాయి. ఐదేళ్ల్ల క్రితం రాజోలు మండలం కడలిలో పొన్నమండ నుంచి తాటిపాకకు వెళ్లే గెయిల్ పైపు పేలి అనేక ఎకరాల్లో పంట కాలిపోయింది. దగ్గర్లో నివాసాలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మూడేళ్లక్రితం రాజోలు మండలంలో కాట్రేనిపాడులో కరవాక ఓఎన్జీసీలో బావి బ్లో అవుట్ కొద్దిలో తప్పింది. 2017 సంవత్సరంలో తూర్పుపాలెంలో ఒక డ్రిల్లింగ్ పూర్తయిన బావికి ప్రొడక్షన్ టెస్టింగ్‌లో బ్లో అవుట్ తప్పింది. ఇక రాజోలు దీవిలో వారానికోసారి పైప్లైన్ల ద్వారా గ్యాస్ లీకవుతూనే ఉంది. తాజాగా తూర్పుపాలెం, గొల్లపాలెం గ్రామాల్లో ఏకంగా సోమ, మంగళవారాల్లో వరుసగా మూడుసార్లు లీకయ్యాయి. దీంతో ప్రజల్లో అలజడి రేగింది. చమురు, గ్యాస్ పైప్ వల్ల ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోననే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. నిర్వహణ లోపం గెయిల్ పైప్లైన్లను తరచూ పరిశీలిస్తూ నిర్వహణ సాగాలి. కానీ కేజీ బేసిన్లో వీటి నిర్వహణ సక్రమంగాలేదు. వీటి ద్వారా ప్యూర్ గ్యాస్ మాత్రమే వెళ్లాలి. కానీ వాటర్, క్రూడాయిల్‌తో కూడిన గ్యాస్ సరఫరా అవుతుంది. ఈ ప్రాంతంలో పేలిన లీకైన గ్యాస్ పైప్‌లను చూస్తుంటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. దీని వల్ల పైప్‌లైన్ తక్కువ కాలానికే పాడైపోతున్నాయి. అలాగే గ్యాస్ సరఫరా జరిగే సమయంలో కూడా అధిక ఒత్తిడి వల్ల కూడా పైపులు రాపిడికి గురై పాడవుతున్నాయి. ఎటువంటి లోపాలూ లేని పైపులు సుమారు çపదేళ్ల పైబడి పని చేస్తాయి. అయితే ఇన్ని లోపాలు ఉన్న ఈ పైప్లైన్లు రెండేళ్లకోసారి పాడైపోతాయి. పూర్తి నిర్లక్ష్యం గ్యాస్ పైప్‌లు తరచూ ఒత్తిడి, రాపిడికి గురై పాడైపోతున్నా వాటిని మార్చాల్సిన సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. గ్యాస్ విక్రయాల ద్వారా రూ.కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నా.. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నాయి తప్ప, మరమ్మతులకు చర్యలు తీసుకోవడం లేదు. నాణ్యత లోపం కూడా... పైప్లైన్ల నిర్మాణంలో కూడా నాణ్యత లోపం చాలా ఉంటోంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న పైప్లైన్ల నిర్మాణంలో బాధ్యతగా వ్యవహరించకుండా ఇష్టానుసారం కాంట్రాక్టులు ఇచ్చి, నాణ్యత లేని పైప్లైన్లు వేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇష్టానుసారం పైప్లైన్లు వేసి దోచుకుంటున్నారు తప్ప పనుల్లో నాణ్యత ఉండడం లేదు. ప్రజా ప్రతినిధులు ఎక్కడ? ఓఎన్జీసీ, గెయిల్ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులకు వ్యతిరేకంగా ఇప్పటి వరకూ పలువురు రాజకీయ నాయకులు అనేక పోరాటాలు చేశారు. ప్రజలు పోరాడినా నాయకులు ప్రవేశించి ఉద్యమాలను నీరుగార్చారు. ఆ నాయకులంతా ఆ సంస్థలు ఇచ్చే చిల్లర పైసలకు కక్కుర్తి పడి ప్రజా ఉద్యమాలను అణగదొక్కిన సంఘటనలు కోనసీమలో అనేకం ఉన్నాయి. కోనసీమలో ఇన్ని ప్రమాద సంఘటనలు జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం విచారకరమని ప్రజలు పేర్కొంటున్నారు. శిథిల పైప్లైన్లే కారణం.. కేజీ బేసిన్ (కృష్ణా, గోదావరి బేసిన్)లో మొత్తం 900 కిలోమీటర్లు గ్యాస్ పైప్లైన్లు విస్తరించి ఉన్నాయి. వీటిలో పది నుంచి 12 అంగుళాల పైప్‌లైన్ సుమారు 200 కిలోమీటర్లు, 18 అంగుళాల పైప్లైన్లు సుమారు 700 కిలోమీటర్లు. కోనసీమతో పాటు కోనసీమ నుంచి హైదరాబాద్ వరకూ వీటిని ఏర్పాటు చేశారు. కోనసీమలోని వివిధ ప్రాంతాల్లోని సుమారు 100కు పైగా గ్యాస్ బావుల నుంచి తాటిపాక రిఫైనరీ వద్దకు నాలుగు అంగుళాల పైప్లైన్ల ద్వారా గ్యాస్‌ను తరలిస్తారు. తాటిపాక నుంచి విజయవాడ, హైదరాబాద్‌లలోని వివిధ ఫ్యాక్టరీలకు 18 అంగుళాల పైప్లైన్ల ద్వారా గెయిల్ గ్యాస్‌ను తరలిస్తుంది. దోపిడీ తప్ప అభివృద్ధి శూన్యం చమురు నిక్షేపాలను తరలించుకు పోతున్న సంస్థలు ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు కంటితుడుపుగానే ఉన్నాయి. కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు గ్యాసును కేటాయిస్తున్నాయి. కానీ ఇక్కడ కనీసం రోడ్డు వేయడానికి నిధులు ఇవ్వరు. ఆ సంస్థ వాహనాల రాకపోకల వల్ల పాడైపోతున్న రోడ్లను కూడా ప్రభుత్వం వేయించాల్సి వస్తోంది. కుంగిన కోనసీమ ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల కోనసీమ మూడడుగులు కిందికి దిగిందని అధ్యయన బృందాలు ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన సదస్సులో తేల్చాయి. దీంతో సముద్రం నుంచి ఉప్పునీరు భూభాగం పైకి వస్తుందని ఆ బృందం స్పష్టం చేసింది. -
గోదావరి గుండెలపై... మందుపాతర
దిన దిన గండంగా జిల్లా ప్రజల జీవనం కేజీ బేసిన్ కల్లోలం మరమ్మతులు ట్రంక్ లైన్లకే పరిమితం 900 కిలోమీటర్లకు 95 కిలో మీటర్లు మాత్రమే మార్పు గడువు తీరినా పట్టించుకోని వైనం లీకేజీలు షరా మామూలే... ‘నగరం’ విషాద ఘటనతో గుణపాఠం ఏదీ? తూర్పుగోదావరి జిల్లా పేరు వినగానే దశాబ్దాల కిందట మదిలో మెదిలే అందమైన భావన ఇది. కాలం మారుతోంది ... ప్రకృతి కనువిందులపై మందుపాతరలు పేలుతున్నాయి. కంటినిండా కునుకు రాదు ... రెప్ప పడితే ఉదయం తెరుచుకుంటుందో...లేదోననే భయం కోనసీమలో అలుముకుంది. మామిడుకుదురు మండలంలోని నగరం గ్రామంలో గ్యాస్ బుసకొట్టి మృత్యువు కబళించిన ఆ విషాద ఘటనలు మరవకముందే మరోసారి గత వారం, పది రోజులుగా బుసలు కొడుతూ గ్యాస్ పెల్లుబికి ముచ్చెమటలు పట్టిస్తుంది. జనం గుండెలపై మందుపాతర్లగా పేలుతున్నాయి. పచ్చని జీవితాల్లో అల్లకల్లోలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథన మిదీ... మలికిపురం : రెండేళ్ల క్రితం సంభవించిన నగరం పేలుడు దుర్ఘటన ఆయిల్, గ్యాస్ వ్యాపార సంస్థలకు ఏమాత్రం గుణపాఠం నేర్పలేదని తరచూ సంభవిస్తున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇలాంటి విషాద ఘటనలు జరుగుతాయని ముందే ఊహించారేమో కేజీ బేసిన్‌కు 30 ఏళ్ల క్రితం పెట్టిన పేరేమిటో తెలుసా ‘మందుపాతర’. భూ గర్భంలోని చమురు నిక్షేపాలను బయటకు తీస్తున్నామని సగర్వంగా ప్రకటించే ఆయా అన్వేషణ సంస్థల నిర్లక్ష్య వైఖరి ప్రజల పాలిట ప్రాణ సంకటంగా మారుతోంది. మొత్తం 900 కిలో మీటర్లు.. మార్చింది 95 కిలో మీటర్ల కేజీ బేసిన్లో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)కు మొత్తం 900 కిలోమీటర్లు గ్యాస్ పైప్లైన్లు విస్తరించి ఉన్నాయి. కెయిర్న్, రిలయన్స్‌లకు చెందిన గ్యాస్లైన్లూ ఉన్నాయి. గెయిల్ లైన్లు కోనసీమతోపాట కొవ్వూరు, విజ్జేశ్వరం, వేమగిరి, కాకినాడ, విజయవాడ, కొండపల్లి, హైదరాబాద్ వరకూ వీటిని ఏర్పాటు చేశారు. నగరంలో గెయిల్ పైప్ లైన్ పేలుడు అనంతరం కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాల మేరకు పలు సర్వే సంస్థలచే నాణ్యత పరిశీలిన అనంతరం ఇచ్చిన నివేదిక ఆధారంగా కేజీ బేసిన్లో గెయిల్ గ్యాస్ పైపు లైన్లన్నీ సుమారు 25 ఏళ్ల క్రితం వేసినవేనని, వీటిలో సుమారు 700 కిలోమీటర్ల లైన్లు మార్చాలని గ్యాస్ సంస్థలకు సూచించినట్లు సమాచారం. ఇప్పటి వరకూ కేవలం 95 కిలోమీటర్ల మేర మాత్రమే పైప్లైన్లు మార్చారు. అది కూడా ప్రమాదానికి గురైన తాటిపాక - విజయవాడ ట్రంక్ లైన్లో కేవలం తాటిపాక నుంచి దిండి వరకూ మాత్రమే 20 కిలోమీటర్లు మార్చారు. విజయవాడ నుంచి దిండి వరకూ సుమారు 170 కిలోమీటర్ల లైన్ మార్చ లేదు. అయినప్పటికీ గ్యాస్ సరఫరా జరుగుతూనే ఉంది. దిండి- కొవ్వూరు మధ్య సుమారు 75 కిలో మీటర్ల లైన్ పనులు వచ్చే ఏడాది ప్రారంభిస్తామంటున్నారు. ఈ లైన్లో కూడా విజ్జేశ్వరం పవర్‌ప్లాంట్ సహా పలు విద్యుత్ ప్రాజెక్టులకు గ్యాస్ సరఫరా సాగుతూనే ఉంది. కాకినాడ- తాటిపాక మధ్య 75 కిలోమీటర్ల లైన్ పనులు పూర్తయ్యాయి. ఈ కొత్త లైన్ ప్రారంభం కాలేదు కానీ ఇక్కడ కూడా పాత లైన్లోనే గ్యాస్ సరఫరా అవుతూనే ఉంది. ఆయిల్ లైన్లు కూడా అంతే... కోనసీమలోని వివిధ ప్రాంతాల్లోని సుమారు 100కు పైగా గ్యాస్ బావుల నుంచి తాటిపాక రిఫైనరీ వద్దకు నాలుగు అంగుళాల పైప్లైన్లు ద్వారా ఆయిల్ కమ్ గ్యాస్‌ను తరలిస్తారు. మరో వంద బావుల నుంచి కేశనపల్లి, అడవిపాలెం, కేశవదాసుపాలెం జీసీఎస్‌లకు కూడా నాలుగు అంగుళాల పైప్లైన్ల నుంచి గ్యాస్, ఆయిల్‌ను తరలిస్తారు, ఇవి ఓఎన్జీసీ పరిధిలో ఉంటాయి. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల నివాసాల మధ్య ఉన్నాయి. ఇవి కూడా శిధిలమై తరచూ పేలిపోతున్నాయి. బావుల వద్ద తరచూ లీకేజీలే. పొగమంచుని చూసినా... గ్రామాల్లో ఆయిల్ బావుల వద్ద, గ్యాస్ లైన్లు వెళ్లిన ప్రాంతాల్లోనూ పొగమంచును చూసినా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న పైప్లైన్ల నిర్మాణంలో బాధ్యతగా వ్యవహరించవ్యవహరించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. కోనసీమలో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు వెతికితీత ప్రారంభం నుంచి... 1990 లో కొమరాడ ఆయిల్ బావి బ్లోఅవుట్. 1994లో అమలాపురం వద్ద బొడసకుర్రు బ్లోఅవుట్ 1995లో కొత్త పేట మండలం దేవరపల్లి బ్లోఅవుట్ 2011లో రాజోలు మండంలో కడలిలో పొన్నమండ నుంచి తాటిపాకకు వెళ్లే గెయిల్ పైపు పేలుడు 2012లో రాజోలు మండలంలో కాట్రేని పాడులంక బావి బ్లోఅవుట్ తృటిలో తప్పింది 2014 గొల్లపాలెం- కరవాకలో బ్లో అవుట్ కూడా వెంట్రుకవాసిలో తప్పింది 2015 లో కేశవదాసుపాలెం జీసీఎస్లో ఆయిల్ పైప్ పేలుడు దశలవారీగా మారుస్తాం నగరం పేలుడు అనంతరం కేంద్ర ప్రభుత్వం నియమించిన పలు సర్వే సంస్థల నివేదిక ఆధారంగా పైప్లైన్లను దశల వారీగా మారుస్తున్నాం. ఇప్పటి వరకూ దిండి- తాటిపాక మధ్య 20 కిలోమీటర్లు, తాటిపాక- కాకి నాడ మధ్య 75 కిలోమీటర్లు మార్చాం. త్వరలో దిండి- కొవ్వూరు మధ్య లైన్ పనులు ప్రారంభిస్తాం. - వై.ఎ. కుమార్, గెయిల్ చీఫ్ మేనేజరు