బతుకులు తెల్లారుతున్నాయ్‌ | KG Basin Gas Leakage In East Godavari | Sakshi
Sakshi News home page

బతుకులు తెల్లారుతున్నాయ్‌

Published Wed, Jul 11 2018 6:35 AM | Last Updated on Wed, Jul 11 2018 6:35 AM

KG Basin Gas Leakage In East Godavari - Sakshi

పైప్‌ లీకై వస్తున్న గ్యాస్‌

మలికిపురం:  అది 2012 సంవత్సరం జూలై 21వ తేదీ..సమయం: ఉదయం 5 గంటలు.
ప్రాంతం: మలికిపురం మండలంశంకరగుప్తం గ్రామం అడవిపాలెం.
ఉదయమే అందరూ నిద్రలేచి బయటకు వెళ్తున్నారు. సరిగ్గా అప్పుడే, సమీపంలోనే గ్యాస్‌ బావుల సముదాయం వద్ద  పైప్‌లైన్‌ భారీ పేలుడు. ఆ ప్రాంతం అంతా పొగలాగా గ్యాస్‌ ఆవరించి తీవ్రంగా వాసనవస్తుంటే పరిస్థితిని గమనించి, కంగారు పడ్డ ఓ తల్లి తన ఇద్దరి పిల్లను చంకన వేసుకుని కంగారుగా ఆ ప్రాంతం వదిలి పరుగులు తీసింది. పొయ్యి వెలిగించ వద్దంటూ ఆర్తనాదాలు చేసింది. ఆమెతో పాటు ఆ ప్రాంతంలో కూలీ నాలీ చేసుకునే వందలాది మంది ప్రజలు పరుగులు తీశారు.

అనంతరం.. అదే రోజు
ఉదయం: 8 గంటలు
స్థానికంగా ఉన్న గెయిల్‌ అధికారులు తాపీగా వచ్చి గ్యాస్‌ అదుపు చేశారు. ఆ రోజు సాయంత్రం వరకూ ఆ ప్రాంతంలో వంట చేసుకునేందుకు పొయ్య వెలిగించడానికి కూడా స్థానికులు భయపడ్డారు. అప్పట్లో ప్రాణాపాయం తప్పింది.

అదే పరిస్థితి మళ్లీ..
2014 జూన్‌ 27వ తేదీ గురువారం
సమయం : ఉదయం 5 గంటలు.
ప్రాంతం: మామిడికుదురు మండలం తాటిపాక  సమీపంలో నగరం మినీ రిఫైనరీ ఎదుట.  
ఏం జరిగిందో తెలుసుకోక ముందే మరో తల్లి తన బిడ్డలను పట్టుకుని రక్షించుకునే లోపే మంటల వలయాల్లో చిక్కుకుని ఒకరినొకరు పట్టుకుని బూడిదగా మారారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. సంఘటన ప్రదేశంలోనే 13 మంది బూడిదయ్యారు. అలా రోడ్డుపై ప్రమాణిస్తున్న కొందరితో పాటు  మరికొందరు మంటల్లో కాలి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. మొత్తం 24 మంది మృత్యువాత పడ్డారు. ఓఎన్‌జీసీ, గెయిల్‌ చరిత్రలో ఇదొక మరచిపోలేని భయంకర దుర్ఘటన.

ఇలా ఒకటి కాదు.. తరచూ కేజీ బేసిన్‌ పరిధిలో జరుగుతున్న సంఘటనలు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.  భూగర్భంలోని చమురు నిక్షేపాలను వెలికి తీస్తున్నామని సగర్వంగా ప్రకటించే ఆయా సంస్థలు పూర్తి నిర్లక్ష్యంగా  వ్యవహరించి ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. ప్రజలకు ప్రాణ సంకటంగా మారిన అనేక సంఘటనలు జిల్లాలో జరిగాయి. 1990 ప్రాంతంలో మామిడికుదురు మండలం కొమరాడ ఆయిల్‌ బావి బ్లో అవుట్‌ నుంచి 1994 అమలాపురం వద్ద బోడసకుర్రు బ్లో అవుట్‌. 1995లో కొత్తపేట మండలం దేవరపల్లి బ్లోఅవుట్‌ లు ఆయిల్‌ నిక్షేపాల అన్వేషణలో జరిగాయి. ఐదేళ్ల్ల క్రితం రాజోలు మండలం కడలిలో పొన్నమండ నుంచి తాటిపాకకు వెళ్లే గెయిల్‌ పైపు పేలి అనేక ఎకరాల్లో పంట కాలిపోయింది. 

దగ్గర్లో నివాసాలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.  మూడేళ్లక్రితం రాజోలు మండలంలో కాట్రేనిపాడులో కరవాక ఓఎన్జీసీలో బావి బ్లో అవుట్‌ కొద్దిలో తప్పింది. 2017 సంవత్సరంలో తూర్పుపాలెంలో ఒక డ్రిల్లింగ్‌ పూర్తయిన బావికి ప్రొడక్షన్‌ టెస్టింగ్‌లో బ్లో అవుట్‌ తప్పింది. ఇక రాజోలు దీవిలో  వారానికోసారి పైప్‌లైన్ల ద్వారా గ్యాస్‌ లీకవుతూనే ఉంది. తాజాగా తూర్పుపాలెం, గొల్లపాలెం గ్రామాల్లో ఏకంగా సోమ, మంగళవారాల్లో వరుసగా మూడుసార్లు లీకయ్యాయి. దీంతో ప్రజల్లో అలజడి రేగింది. చమురు, గ్యాస్‌ పైప్‌ వల్ల ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోననే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

నిర్వహణ లోపం
గెయిల్‌ పైప్‌లైన్లను తరచూ పరిశీలిస్తూ నిర్వహణ సాగాలి. కానీ కేజీ బేసిన్‌లో వీటి నిర్వహణ సక్రమంగాలేదు. వీటి ద్వారా ప్యూర్‌ గ్యాస్‌ మాత్రమే వెళ్లాలి. కానీ వాటర్, క్రూడాయిల్‌తో కూడిన గ్యాస్‌ సరఫరా అవుతుంది. ఈ ప్రాంతంలో పేలిన లీకైన గ్యాస్‌ పైప్‌లను చూస్తుంటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. దీని వల్ల పైప్‌లైన్‌ తక్కువ కాలానికే పాడైపోతున్నాయి. అలాగే గ్యాస్‌ సరఫరా జరిగే సమయంలో కూడా అధిక ఒత్తిడి వల్ల కూడా పైపులు రాపిడికి గురై పాడవుతున్నాయి. ఎటువంటి లోపాలూ లేని పైపులు సుమారు çపదేళ్ల పైబడి పని చేస్తాయి.  అయితే ఇన్ని లోపాలు ఉన్న ఈ పైప్‌లైన్లు రెండేళ్లకోసారి పాడైపోతాయి.

పూర్తి నిర్లక్ష్యం
గ్యాస్‌ పైప్‌లు తరచూ ఒత్తిడి, రాపిడికి గురై పాడైపోతున్నా వాటిని మార్చాల్సిన సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. గ్యాస్‌ విక్రయాల ద్వారా రూ.కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నా.. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నాయి తప్ప, మరమ్మతులకు చర్యలు తీసుకోవడం లేదు.

నాణ్యత లోపం కూడా...
పైప్‌లైన్ల నిర్మాణంలో కూడా నాణ్యత లోపం చాలా ఉంటోంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న పైప్‌లైన్ల నిర్మాణంలో బాధ్యతగా వ్యవహరించకుండా ఇష్టానుసారం కాంట్రాక్టులు ఇచ్చి, నాణ్యత లేని పైప్‌లైన్లు వేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇష్టానుసారం పైప్‌లైన్లు వేసి దోచుకుంటున్నారు తప్ప పనుల్లో నాణ్యత ఉండడం లేదు.

ప్రజా ప్రతినిధులు ఎక్కడ?
ఓఎన్జీసీ, గెయిల్‌ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులకు వ్యతిరేకంగా ఇప్పటి వరకూ పలువురు రాజకీయ నాయకులు అనేక పోరాటాలు చేశారు. ప్రజలు పోరాడినా నాయకులు ప్రవేశించి ఉద్యమాలను నీరుగార్చారు. ఆ నాయకులంతా ఆ సంస్థలు ఇచ్చే చిల్లర పైసలకు కక్కుర్తి పడి ప్రజా ఉద్యమాలను అణగదొక్కిన సంఘటనలు కోనసీమలో అనేకం ఉన్నాయి.  కోనసీమలో ఇన్ని ప్రమాద సంఘటనలు జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం విచారకరమని ప్రజలు పేర్కొంటున్నారు.

శిథిల పైప్‌లైన్లే కారణం..
కేజీ బేసిన్‌ (కృష్ణా, గోదావరి బేసిన్‌)లో మొత్తం 900 కిలోమీటర్లు గ్యాస్‌ పైప్‌లైన్లు విస్తరించి ఉన్నాయి. వీటిలో పది నుంచి 12 అంగుళాల పైప్‌లైన్‌ సుమారు 200 కిలోమీటర్లు, 18 అంగుళాల పైప్‌లైన్లు సుమారు 700 కిలోమీటర్లు. కోనసీమతో పాటు కోనసీమ నుంచి హైదరాబాద్‌ వరకూ వీటిని ఏర్పాటు చేశారు. కోనసీమలోని వివిధ ప్రాంతాల్లోని సుమారు 100కు పైగా గ్యాస్‌ బావుల నుంచి తాటిపాక రిఫైనరీ వద్దకు నాలుగు  అంగుళాల పైప్‌లైన్ల ద్వారా గ్యాస్‌ను తరలిస్తారు. తాటిపాక నుంచి విజయవాడ, హైదరాబాద్‌లలోని వివిధ ఫ్యాక్టరీలకు 18 అంగుళాల పైప్‌లైన్ల ద్వారా గెయిల్‌ గ్యాస్‌ను తరలిస్తుంది.

దోపిడీ తప్ప అభివృద్ధి శూన్యం
చమురు నిక్షేపాలను తరలించుకు పోతున్న సంస్థలు ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు కంటితుడుపుగానే ఉన్నాయి.  కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు గ్యాసును కేటాయిస్తున్నాయి.   కానీ ఇక్కడ కనీసం రోడ్డు వేయడానికి నిధులు ఇవ్వరు. ఆ సంస్థ వాహనాల రాకపోకల వల్ల పాడైపోతున్న రోడ్లను కూడా ప్రభుత్వం వేయించాల్సి వస్తోంది.

కుంగిన కోనసీమ
ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల కోనసీమ మూడడుగులు కిందికి దిగిందని అధ్యయన బృందాలు ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన సదస్సులో తేల్చాయి. దీంతో సముద్రం నుంచి ఉప్పునీరు భూభాగం పైకి వస్తుందని ఆ బృందం స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement