khadarlinga swamy
-
ఘనంగా ఖాదర్‌లింగ స్వామి జన్మదిన వేడుకలు
కౌతాళం: మండల కేంద్రంలో వెలసిన జగద్గురు ఖాదర్‌లింగ స్వామి 397వ జన్మదినం సందర్భంగా గురువారం వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా తెల్లవారు జామున 5గంటలకు ప్రత్యేక ఫాతెహాలు నిర్వహించి భక్తులను దర్శనానికి వదిలారు. సాయంత్రం స్వామి చిత్రపటానికి పూలమాల వేసి గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, డిల్లీ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఆచారం ప్రకారం స్వామి చిత్రపటాన్ని గ్రామానికి చెందిన లింగాయితీ వంశస్థులు మోసుకుంటూ తిరిగారు. హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నంగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. వేడుకల్లో ఫకీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఖాదర్‌లింగ స్వామి దర్గా ధర్మకర్త సయ్యద్‌సాహెబ్ పీర్ వుసేని చిష్తీ ఆశీస్సులతో ఈవిన్యాసాలను చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన డ్రమ్సులు వారు చేసిన డప్పు వాయిద్యాలు అలరించాయి. కార్యక్రమాల్లో పీఠాధిపతి ఖాదర్‌బాషా చిష్తీ, గుల్షన్ కమిటీ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు మున్నాపాషా, నజీర్అహ్మద్, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. -
కిటకిటలాడిన కౌతాళం
కౌతాళం: జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసు సందర్భంగా మండలకేంద్రం కౌతాళానికి భక్తజనం పోటెత్తారు. కులమతాలకు అతీతంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది స్వామి దర్గాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ప్రసాదం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దర్గా ధర్మకర్త సయ్యద్ సాహెబ్‌పీర్ ఇంట్లో ప్రత్యేకంగా తయారు చేసి తెచ్చిన ఈ మహాప్రసాదాన్ని పొందేందుకు భక్తులు ఎగబడ్డారు. అనంతరం పలువురు ఖాదర్‌లింగ స్వామి శిష్యరికం పొందారు. ఎలాంటి చేడు పనులు చేయకూడదని, మంచి మార్గంలో నడుస్తూ ఐదుపూటల నమాజు చేయాలనిlధర్మకర్త ఈ సందర్భంగా వారికి బోధించారు. కార్యక్రమంలో గుల్షన్ కమిటీ గౌరవ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, అధ్యక్షుడు మున్నపాష, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ నల్లప్ప గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. -
ఘనంగా ఖాదర్‌లింగ ఉరుసు
కౌతాళం: మండల కేంద్రమైన కౌతాళంలో వెలసిన జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసు ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. తెల్లవారు జామున 3 గంటలకు దర్గా ధర్మకర్త సయ్యద్‌సాహెబ్ పీర్ చిష్తి ఇంటి నుంచి ఊరేగింపుగా గంధాన్ని దర్గాకు తీసుకెళ్లారు. ఈసందర్భంగా పక్కీర్లు చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. గంధం దర్గా చేరిన అనంతరం ప్రత్యేక ఫాతెహాలు, ప్రార్థనలు నిర్వహించారు. దర్గా దర్శనం కోసం రాష్ట్రాం నలుమూలల నుంచే కాక తెలంగాణ, మహరాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, జమ్ముకాశ్మీర్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు రెండులక్షలకుపైగా భక్తులు తరలివచ్చారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధర్మకర్త అన్ని ఏర్పాట్లు చేపట్టారు. అన్నదానం కూడా నిర్వహించారు. తరలివచ్చిన వివిధ దర్గాల ధర్మకర్తలు: ఖాదర్‌లింగ స్వామి ఉరుసు ఉత్సవంలో వివిధ దర్గాల పీఠాధిపతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వీరు మంగళవారం తెల్లవారు జామున జరిగిన గంధం వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఫాతెహలు నిర్వహించారు. బీదర్‌కు చెందిన సయ్యద్‌షా అసదుల్లా ఉసేని సజ్జదా నసీమ్, ఖ్వాజా అబుల్‌ఫైజ్ ఉసేని, ఐనూద్దీన్ ఉసేని, సయ్యద్‌షా మద్గీ ఉసేని, గుల్బర్గాకు చెందిన పీఠాధిపతులు సయ్యద్ ముజఫర్ ఉసేని చిష్తీ, సయ్యద్ ఖుబుల్లా ఉసేని సజ్జదే, సయ్యద్ ఖుద్బీ ఉసేని చిష్తీ, కర్నూల్ ఖాలీక్‌లింగ దర్గా ధర్మకర్త, కాంగ్రెస్ పార్టీ డీసీసీ కార్యదర్శి ఖలీల్‌బాష తదితర ప్రముఖులు దర్గాను దర్శించుకున్నవారిలో ఉన్నారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్ఐ నల్లప్ప పోలీసు బందోబస్తు నిర్వహించారు.