కిటకిటలాడిన కౌతాళం
కౌతాళం: జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసు సందర్భంగా మండలకేంద్రం కౌతాళానికి భక్తజనం పోటెత్తారు. కులమతాలకు అతీతంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది స్వామి దర్గాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ప్రసాదం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దర్గా ధర్మకర్త సయ్యద్ సాహెబ్‌పీర్ ఇంట్లో ప్రత్యేకంగా తయారు చేసి తెచ్చిన ఈ మహాప్రసాదాన్ని పొందేందుకు భక్తులు ఎగబడ్డారు. అనంతరం పలువురు ఖాదర్‌లింగ స్వామి శిష్యరికం పొందారు. ఎలాంటి చేడు పనులు చేయకూడదని, మంచి మార్గంలో నడుస్తూ ఐదుపూటల నమాజు చేయాలనిlధర్మకర్త ఈ సందర్భంగా వారికి బోధించారు. కార్యక్రమంలో గుల్షన్ కమిటీ గౌరవ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, అధ్యక్షుడు మున్నపాష, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ నల్లప్ప గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.