సాక్షి, కౌతాళం(కర్నూలు) : కూలీలతో కలిసి పొలంలో విత్తనాలు నాటారు. పని ముగింపు దశలో తల్లీకూతురు ఓ చెట్టు కింద భోజనానికి ఉపక్రమించారు. సాధకబాధకాలు మాట్లాడుకుంటూ భోంచేశారు. తర్వాత తల్లి పైనున్న తీగను పట్టుకుని లేవడానికి ప్రయత్నించింది. ఒక్కసారిగా ‘షాక్’! ఆమెకు ఏమైందో తెలీక కాపాడబోయిన కుమార్తెదీ ఇదే పరిస్థితి. ఇద్దరూ గిలగిలా కొట్టుకుంటూ క్షణాల్లోనే ప్రాణాలొదిలారు. తర్వాత తెలిసింది వారిని బలిగొన్నది విద్యుత్ తీగ రూపంలోని మృత్యుపాశమని!
కౌతాళం మండలం చూడి పంచాయతీ తిప్పలదొడ్డి గ్రామంలో శుక్రవారం ఉదయం విద్యుదాఘాతానికి గురై తల్లీ కూతురు నరసమ్మ(58), రామాంజనమ్మ(38) మృతిచెందారు. గ్రామానికి చెందిన సోమిరెడ్డి (లేట్)కి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య నరసమ్మ. ఈమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె రామాంజనమ్మను ఇదే మండల పరిధిలోని చిరుతాపల్లికి చెందిన ఈరన్నకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ముగ్గురు సంతానం. ఇటీవల తిప్పలదొడ్డిలో మట్టి ఎద్దుల పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రామాంజనమ్మ పుట్టింటికి వచ్చింది.
శుక్రవారం ఉదయం చిరుతాపల్లికి తిరిగి వెళతానని తల్లితో చెప్పింది. ‘రేపు వెళ్దువులే’ అనడంతో ఆమె ప్రయాణాన్ని విరమించుకుంది. తర్వాత తల్లీకూతురు గ్రామానికి చెందిన కూలీలతో కలిసి పొలంలో పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లారు. విత్తనాలు నాటే పని పూర్తవుతున్న దశలో వెళ్లి భోంచేయాలని కూలీలు వారికి సూచించారు. దీంతో తల్లీకూతురు పొలంలోని ఓ చెట్టు కింద భోజనానికి ఉపక్రమించారు. దాని గుండానే విద్యుత్ తీగలు వెళ్లాయి. ఈ విషయాన్ని వారు గమనించలేదు. భోజనం పూర్తి కాగానే నరసమ్మ పైకి లేవడానికి సపోర్టుగా పైనున్న తీగ పట్టుకుంది.
క్షణాల్లోనే విద్యుత్ షాక్‌కు గురైంది. గిలగిలా కొట్టుకుంటుండగా కుమార్తె కాపాడబోయింది. ఆమె కూడా షాక్‌కు గురైంది. పొలంలోని కూలీలు గమనించి హుటాహుటిన అక్కడికి వచ్చారు. ఆలోపే ఇద్దరూ మృత్యువాత పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారొచ్చి విద్యుత్ తీగలను వేరుచేసి.. ఆ శాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నాగార్జునరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కూడా కన్పిస్తోంది. విద్యుత్ తీగలు ఇంత కింద వేలాడుతున్నా సరిచేయలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment