koutalam
-
రోడ్లు ఛిద్రం..! దుమ్ముతో నిత్యం నరకం అనుభవిస్తున్నాం..!!
కుమరం భీం: ప్రకృతి వనరులు కొల్లకొడుతూ క్వారీల నుంచి యాజమాన్యాలు భారీగా ఆదాయం అర్జిస్తున్నాయి. అయితే క్రషర్ల నుంచి కంకర తరలించే వాహనాలతో స్థానిక రహదారులన్నీ ధ్వంసమవుతున్నా మరమ్మతులకు కనీస మొత్తంలో నిధులు కేటాయించడం లేదు. గనులశాఖకు ఏటా సీనరేజీ నిధులు వస్తున్నా ప్రభావిత పల్లెల అభివృద్ధికి పైసా ఖర్చు చేయడం లేదు. పరిశ్రమల శాఖ, మైనింగ్, విద్యుత్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి శాఖల అధికారులు నిబంధనల అమలులో చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గుంతలతో తిప్పలు.. కౌటాల మండలం ముత్తంపేట నుంచి పార్డీ గ్రామానికి వెళ్లే మార్గంలో ఐదు కంకర క్వారీలు, క్రషర్లు ఉన్నాయి. జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులకు నిత్యం వందలాది భారీ వాహనాల్లో ఇక్కడి నుంచే కంకర తరలిస్తున్నారు. ఫలితంగా వాహనాలు వెళ్లే కాగజ్‌నగర్, కౌటాల, ముత్తంపేట, తలోడి, సిర్పూర్(టి), టోంకిని గ్రామాల వద్ద ప్రధాన రహదారి అనేకచోట్ల గుంతలతో అధ్వానంగా మారింది. పరిమితికి మించిన లోడ్‌తో డ్రైవర్లు అతివేగంగా లారీలను నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం నరకం.. దుమ్ముతో నిత్యం నరకం అనుభవిస్తున్నాం. వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుండడంతో కంకర దుమ్ము పంటలపై పడుతుంది. దిగుబడి తగ్గుతోంది. క్రషర్లతో మా గ్రామానికి వెళ్లే రోడ్డు ఎప్పుడూ గుంతలతోనే ఉంటుంది. రోడ్డుకు మరమ్మతులు చేపట్టి బీటీ రోడ్డు వేయాలి. – డి.సంజీవ్, పార్డి, మం.కౌటాల ► ఐదేళ్ల క్రితం కౌటాల – కాగజ్‌నగర్ మార్గంలో డబుల్ రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు పైనుంచి అధిక లోడుతో వాహనాలు వెళ్తుండడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ముత్తంపేట సమీపంలో గుంతల్లో వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ► కౌటాల మండలం పార్డీ, సాండ్‌గాం, వీరవెల్లి పంచాయతీలతోపాటు కౌఠి గ్రామానికి 20 ఏళ్ల కిందట ప్రపంచ బ్యాంకు నిధులతో మొరం రోడ్డు వేశారు. మ్తుతంపేట ప్రధాన ఆర్అండ్బీ రోడ్డు నుంచి పార్డీ మీదుగా సాండ్‌గాం వరకు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు ఉంది. రోడ్డును ఆనుకుని ఉన్న స్టోన్ క్రషర్ల నుంచి లారీలు వెళ్తుండడంతో గుంతలు పడుతున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు రోడ్డు బురదమయంగా మారింది. మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామాలకు ఇప్పటికీ తారురోడ్డు సౌకర్యం లేకపోవడం గమనార్హం. మరమ్మతులు చేయిస్తాం.. అధిక లోడు వాహనాలతో బీటీ రోడ్లపై గుంతలు పడుతున్నాయి. గతేడాది రోడ్లకు మరమ్మతులు చేపట్టాం. మూడు నెలల క్రితం వేసిన బీటీ రోడ్డుపై కూడా పగుళ్లు వచ్చాయి. గుంతలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధుల మంజూరు కాగానే గుంతలు పడిన చోట మరమ్మతులు చేయిస్తాం. – లక్ష్మీనారాయణ, ఆర్అండ్బీ డీఈ, కాగజ్‌నగర్ పంటలకు తీవ్ర నష్టం.. కంకర లారీలతో రోడ్లు ఛిద్రం కావడంతోపా టు రహదారుల వెంబడి సాగు చేస్తున్న పంట పై దుమ్ము ప్రభావం పడుతోంది. పార్డీ– సాండ్‌గాం గ్రామాల సమీపంలో సాగు చేస్తున్న పంటలపై విపరీతమైన దుమ్ము పడుతోంది. దీంతో పంట దిగుబడి సగానికి పడిపోతుంద ని రైతులు వాపోతున్నారు. పంటలకు పరిహా రం చెల్లించాలని కొంతమంది అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా లారీ ల నుంచి పడుతున్న కంకరతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. అదుపు తప్పి బైక్‌లు కిందపడిపోతున్నాయి. ఇప్పటికైనా స్పందించి ఓవర్‌లోడ్‌తో కంకర తరలిస్తున్న క్రషర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
మహనీయుడు..ఖాదర్ లింగ స్వామి
సాక్షి, కౌతాళం(కర్నూలు) : మానవుడు ఆరాధిస్తున్న భగవంతుడు ఏ ఒక్క మతానికి చెందినట్లు కాదని, మతం అనేది మనిషి మనిషికి మధ్యనే కాని మనసుకు కాదని నిరూపించిన మహనీయుడు శ్రీజగద్గురు ఖాదర్‌లింగ స్వామి. చరాచర జీవకోటి రాశులకే మూల సూత్రమైన పరమేశ్వరుడినే మెప్పించి భక్తుల్లో మతసామరస్యాన్ని చాటారు. మండల కేంద్రమైన కౌతాళంలో వెలిసిన దర్గాకు ఎంతో విశిష్టత ఉంది. కులమతాలకు అతీతంగా దర్గాను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఏటా ఖాదర్ లింగ స్వామి 315 ఉరుసును వైభవంగా నిర్వహిస్తారు. 14వ తేదీ (నేడు) స్వామి సమాధికి సుగంధ పానీయాలతో శుభ్రం చేస్తారు. 15న గంధం కార్యక్రమం, 16న ఉరుసు ఉత్సవం, 17న బుధవారం సఫ్రా (ప్రసాదం పంపిణీ), 18న జియారత్ వేడుక ఉంటుందని ధర్గా దర్మకర్త సయ్యద్ సాహెబ్‌పీర్ వుసేని చిష్తీ తెలిపారు. ఈ స్వామిని శ్రీజగద్గురు మహపురుష సయ్యద్–షా– ఖాదర్‌లింగస్వామి గా ఈ ప్రాంత వాసులతో నిత్యం కొనియాడబడుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఖాదర్ లింగ, లింగ్బంద్, జగద్గురు ఖాదర్‌లింగస్వామి, ఖాదర్వలిగా పేరుగాంచారు. స్వామి చరిత్ర: పూర్వం కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ పట్టణంలో కొలవైన అమినూద్దీన్ అలిఆలా షేర్ఏఖుదా వారికి హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా అబ్దుల్ ఖాదరి వుసేని చిష్తీ 12 ఏళ్లు శిష్యరికం చేశారు. గురువు ఆజ్ఞానుసారం మానవుల్లో తమ మౌఢ్యాన్ని తొలగించి మతసామరస్యాన్ని చాటేందుకు కర్ణాటక సరిహద్దులో ఉన్న కౌతాళానికి చేరుకున్నారు. అప్పట్లో ఆయన మెడలో లింగమూర్తిని ధరించడాన్ని ఈ ప్రాంతంలో ఉన్న శైవ మతస్థులు కొందరు అభ్యంతరం చెప్పారు. భగవంతుడు ఎవరి సొంతం కాదని పరమేశ్వరుని ప్రతీక అయిన లింగంపై ఎవరికీ హక్కు లేదని వారితో వాదించారు. శైవ మతస్తులను సమావేశ పరిచి వారి మెడలో ఉన్న లింగాలను బావిలో వేసి వాటిని మరలా రప్పించి ధరిస్తానని, తాను అలా చేయని పక్షంలో గ్రామం వదలి వెళ్తానని చెప్పారు. ఈ ప్రయత్నంలో ఆయన శివున్ని మెప్పించి లింగాలను బావి నుంచి రప్పించారు. అప్పటి నుంచి గ్రామస్తులంతా ఆయనను ఖాదర్‌లింగ స్వామిగా పూజించడం ప్రారంభించారు. ఆయనకు ముగ్గురు భార్యలు, ఐదుగురు కుమారులు. 315 సంవత్సరాల క్రితం గ్రామంలోనే సమాధి అయ్యారు. ఆయన వంశస్థులు అయిన ప్రస్తుత ధర్మకర్త సయ్యద్ సాహెబ్‌పీర్ వుసేని చిష్తీ ట్రస్టీగా ఉన్నారు. -
విద్యుత్ తీగల రూపంలో మృత్యుపాశం
సాక్షి, కౌతాళం(కర్నూలు) : కూలీలతో కలిసి పొలంలో విత్తనాలు నాటారు. పని ముగింపు దశలో తల్లీకూతురు ఓ చెట్టు కింద భోజనానికి ఉపక్రమించారు. సాధకబాధకాలు మాట్లాడుకుంటూ భోంచేశారు. తర్వాత తల్లి పైనున్న తీగను పట్టుకుని లేవడానికి ప్రయత్నించింది. ఒక్కసారిగా ‘షాక్’! ఆమెకు ఏమైందో తెలీక కాపాడబోయిన కుమార్తెదీ ఇదే పరిస్థితి. ఇద్దరూ గిలగిలా కొట్టుకుంటూ క్షణాల్లోనే ప్రాణాలొదిలారు. తర్వాత తెలిసింది వారిని బలిగొన్నది విద్యుత్ తీగ రూపంలోని మృత్యుపాశమని! కౌతాళం మండలం చూడి పంచాయతీ తిప్పలదొడ్డి గ్రామంలో శుక్రవారం ఉదయం విద్యుదాఘాతానికి గురై తల్లీ కూతురు నరసమ్మ(58), రామాంజనమ్మ(38) మృతిచెందారు. గ్రామానికి చెందిన సోమిరెడ్డి (లేట్)కి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య నరసమ్మ. ఈమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె రామాంజనమ్మను ఇదే మండల పరిధిలోని చిరుతాపల్లికి చెందిన ఈరన్నకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ముగ్గురు సంతానం. ఇటీవల తిప్పలదొడ్డిలో మట్టి ఎద్దుల పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రామాంజనమ్మ పుట్టింటికి వచ్చింది. శుక్రవారం ఉదయం చిరుతాపల్లికి తిరిగి వెళతానని తల్లితో చెప్పింది. ‘రేపు వెళ్దువులే’ అనడంతో ఆమె ప్రయాణాన్ని విరమించుకుంది. తర్వాత తల్లీకూతురు గ్రామానికి చెందిన కూలీలతో కలిసి పొలంలో పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లారు. విత్తనాలు నాటే పని పూర్తవుతున్న దశలో వెళ్లి భోంచేయాలని కూలీలు వారికి సూచించారు. దీంతో తల్లీకూతురు పొలంలోని ఓ చెట్టు కింద భోజనానికి ఉపక్రమించారు. దాని గుండానే విద్యుత్ తీగలు వెళ్లాయి. ఈ విషయాన్ని వారు గమనించలేదు. భోజనం పూర్తి కాగానే నరసమ్మ పైకి లేవడానికి సపోర్టుగా పైనున్న తీగ పట్టుకుంది. క్షణాల్లోనే విద్యుత్ షాక్‌కు గురైంది. గిలగిలా కొట్టుకుంటుండగా కుమార్తె కాపాడబోయింది. ఆమె కూడా షాక్‌కు గురైంది. పొలంలోని కూలీలు గమనించి హుటాహుటిన అక్కడికి వచ్చారు. ఆలోపే ఇద్దరూ మృత్యువాత పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారొచ్చి విద్యుత్ తీగలను వేరుచేసి.. ఆ శాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నాగార్జునరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కూడా కన్పిస్తోంది. విద్యుత్ తీగలు ఇంత కింద వేలాడుతున్నా సరిచేయలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
దయనీయం..మేదర జీవనం
అడవికెళ్లి కంకతెచ్చి.. నిలువునా చీల్చి.. ఎండకు ఆరబెట్టి.. ఓపికతో అల్లి.. మార్కెట్‌కు తీసుకెళ్లి.. అమ్మితే వచ్చే డబ్బులతో జీవనం సాగించే మహేంద్రులకు (మేదరులకు) ఉపాధి లేకుండా పోతోంది. వాళ్లు అల్లిన తట్టలకు, బుట్టలకు ఆదరణ తగ్గిపోతుండడంతో మేదరి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్లాస్టిక్ దెబ్బకు మేదరుల అల్లికలకు ఆదరణ తగ్గుతోంది. వృత్తిని నమ్ముకుని దుర్భర స్థితిలో కుటుంబాలు వెళ్లదీస్తున్న మేదరి కుటుంబాలపై ‘సాక్షి’ ప్రేత్యేక కథనం.. కౌటాల(సిర్పూర్): కుమురం భీం జిల్లాలో 304 మేదరి కుటుంబాలు ఉండగా వీటిలో 283 కుటుంబాలు వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. కుటుంబమంతా కష్టపడితే కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని మేదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ఖర్చులు పోను పిల్లల చదువులు, ఇతర అవసరాలకు సంపాదన సరిపోక ఇబ్బందులు పడుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. అడవి నుంచి అధికారులు వెదురును తీసుకెళ్లని వ్వకపోవడంతో చేతినిండా పనిదొరకక కొన్ని నెలలుగా మేదరులు ఆర్థికంగా ఇబ్బందులు ప డుతున్నారు. చాలా మంది మేదరి కులస్తులు వృత్తికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ప్ర భుత్వం ఆదుకోవాలని మేదరులు కోరుతున్నారు. వెదురుతో రూపు దిద్దుకునేవి ఇవే.. మేదరులు వెదురుతో తడకలు, వెదురు బుట్టలు, గొర్ల తడకలు, చాటలు, గంపలు, పెళ్లి పందిళ్లు, మొక్కల పెంపకానికి చిన్నచిన్న బుట్టలు తయారు చేస్తారు. గంపలు, నిచ్చెనలు, పూలతొట్టీలు, విసనకర్రలు, పొయ్యి గొట్టాలు, ఆటవస్తువులు, తరాజు, బుట్టలు, ధాన్యం నిల్వ చేసే గంపలు, వస్తువులను మేదరులు తయారు చేస్తారు. దొరకని ముడిసరుకు.. గతంలో అడవులు ఎక్కువగా ఉన్న కారణంగా ఎక్కడపడితే అక్కడ కంకబొంగు లభిస్తుండేది. దీని ద్వారా మేదరుల అల్లికలకు ముడి సరుకు విరివిగా లభించేది. అడవులు అంతరిస్తుండడంతో అధికారులు కంకబొంగును అడవి నుంచి తీసుకురానివ్వడం లేదు. దీంతో మేదరులకు చేతినిండా పనిదొరకక కుటుంబం నడవని స్థితి. హరితహారంలో అధిక సంఖ్యలో వెదురు మొక్కలు నాటాలని మేదరులు కోరుతున్నారు. వెదురుతో తయారు చేసిన తట్టలు, బుట్టలు ముత్తంపేటలో తట్టలు అల్లుతున్న మేదరులు అన్నింటా ప్లాస్టిక్.. ప్రస్తుతం అన్ని వస్తువులు ప్లాస్టిక్‌లో లభిస్తుండడంతో మేదరులకు ఉపాధి కరువవుతోంది. అడవి నుంచి వెదురును తీసుకెళ్లడానికి అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వాలాని, ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు అందించి ఆదుకోవాలని మేదరులు కోరుతున్నారు. మేదరి కులస్తులను ఆదుకోవాలి కుమురం భీం జిల్లాలో 304 మేదరి కుంటుబాలు ఉన్నాయి. వీటిలో 283 మేదరి కుటుంబాలు మేదరి వృత్తి పైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం మేదరుల అభివృద్ధి కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి. ప్లాస్టిక్ వాడకం తగ్గించి వెదురు బొంగుతో తయారు చేసిన వస్తువులను వినియోగించాలి. అడవుల్లో వెదురు మొక్కలను ఎక్కువగా నాటాలి. ప్రభుత్వం రుణాలు అందించాలి. – సుల్వ కనకయ్య, మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు కుటుంబ పోషణ భారంగా మారింది నా పేరు రాచర్ల లక్ష్మి నారాయణ. మాది కౌటాల మండలం గురుడుపేట. నేను పుట్టుకతోనే వికలాంగుడిని. 30 ఏళ్లుగా మేదరి వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాను. అధికారులు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు అందించి మేదరులను ప్రోత్సాహించాలి. లేకుంటే కులవృత్తి కనిపించకుండాపోతుంది. ఆర్నెళ్ల నుంచి అటవీ అధికారులు వెదురును అడవిలో నుంచి తీసుకురానివ్వడం లేదు. దీంతో పని లేక పస్తులుంటున్నాం. ఆరు నెలల నుంచి కుటుంబ పోషణ భారంగా మారింది. మా తమ్ముడు అడవి నుంచి వెదురు తెస్తే నేను ఇంటి వద్దే ఉంటూ వెదురు వస్తువులు తయారు చేస్తాను. తయారు చేసిన వెదురు వస్తువులను మా తమ్ముడు గ్రామాల్లో, వార సంతల్లో అమ్ముతాడు. మేదరి వృత్తిపైనే నేను. నా భార్య, నా కూతురు, మా తమ్ముడు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఆదరణ తగ్గిపోవడంతో, అటవీ అధికారుల ఆంక్షలతో వృత్తిని వీడాల్సి వస్తోంది. -
ఘనంగా ఖాదర్‌లింగ స్వామి జన్మదిన వేడుకలు
కౌతాళం: మండల కేంద్రంలో వెలసిన జగద్గురు ఖాదర్‌లింగ స్వామి 397వ జన్మదినం సందర్భంగా గురువారం వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా తెల్లవారు జామున 5గంటలకు ప్రత్యేక ఫాతెహాలు నిర్వహించి భక్తులను దర్శనానికి వదిలారు. సాయంత్రం స్వామి చిత్రపటానికి పూలమాల వేసి గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, డిల్లీ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఆచారం ప్రకారం స్వామి చిత్రపటాన్ని గ్రామానికి చెందిన లింగాయితీ వంశస్థులు మోసుకుంటూ తిరిగారు. హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నంగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. వేడుకల్లో ఫకీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఖాదర్‌లింగ స్వామి దర్గా ధర్మకర్త సయ్యద్‌సాహెబ్ పీర్ వుసేని చిష్తీ ఆశీస్సులతో ఈవిన్యాసాలను చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన డ్రమ్సులు వారు చేసిన డప్పు వాయిద్యాలు అలరించాయి. కార్యక్రమాల్లో పీఠాధిపతి ఖాదర్‌బాషా చిష్తీ, గుల్షన్ కమిటీ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు మున్నాపాషా, నజీర్అహ్మద్, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. -
కౌతాళం చేరిన టీబీ డ్యాం నీరు
కౌతాళం: ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేసిన 1.5టీఎంసీల నీరు శనివారం మండలంలోని ఎల్ఎల్సీకి చేరింది. ఇటీవల మండల రైతులు తమ పంటల పరిస్థితిని ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోపోవడంతో వారు స్పందించి ఈ నీటిని విడుదల చేయించారు. ఈ నీరు శనివారం మండల సరిహద్దులోకి చేరింది. -
ఎల్లెల్సీ ఈఈ కార్యాలయం ముట్టడి
ఎల్ఎల్సీ నీటి వాటా తగ్గించడంపై రైతుల ఆగ్రహం ఈఈతో వాగ్వాదం ఆదోని రూరల్ : రబీలో తమకు రావాల్సిన నీటి వాటా పూర్తిగా తగ్గించడాన్ని నిరసిస్తూ కౌతాళం మండలంలోని ఎల్ఎల్సీ ఆయకట్టు రైతులు ఆదోనిలో ఉన్న ఎల్ఎల్సీ ఈఈ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. దాదాపు 200 మంది రైతులు కార్యాలయం ముందు బైఠాయించారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి ఈఈ భాస్కర్‌రెడ్డి బయటకొచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడంతో ఆయన బయటకు వచ్చారు. దీంతో రైతులు ఈఈని చుట్టముట్టి తమ ఆవేదనను వెళ్లగక్కారు. సమాధానం చెప్పలేక ఈఈ నీళ్లు నమిలారు. పంటలు ఎండుముఖం పట్టాయి.. రైతులు, సాగునీటి సంఘం నాయకులు వెంకటపతి రాజు, రాఘవరెడ్డి, సుబ్బరాజు, శీనురాజు మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్ఎల్సీకి రావాల్సిన నీటి వాటాలో తమ డీపీ 74కు పూర్తిగా నీరు నిలిచిపోయిందన్నారు. దీంతో రబీ కింద సాగు చేసిన పత్తి, వరి, మిరప పంటలు(సుమారు వెయ్యి ఎకరాలు) ఎండుముఖం పట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.40–50వేలు దాకా పెట్టుబడులు పెట్టామని, ఉన్నట్టుండి నీటిని నిలిపివేస్తే ఎలా అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం అందించాలని, లేనిపక్షంలో కదిలేదిలేదని భీష్మించారు. చివరికి ఈఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి ఽతీసుకెళ్ళి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైతులు ధర్మరాజు, గోవిందయ్య, దొడ్డయ్య, ఈరన్న, రామాంజనేయులు, ఉరుకుందప్ప పాల్గొన్నారు. -
ఘనంగా జియారత్ వేడుకలు
కౌతాళం: కౌతాళంలో వెలసిన జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం జియారత్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్గా ధర్మకర్త సయ్యద్ సాహెబ్‌పీర్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి మ«ధ్యాహ్నం వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం దర్గాలో ప్రత్యేక ఫాతెహాలు చేశారు. అనంతరం ఖాదర్‌లింగ శిష్యరికం పొందిన వారికి, కొత్త పక్కీర్లుగా మారిన వారికి నూతన వస్త్రాలను దానం చేశారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఖాదర్‌బాషా చిష్తీ స్వామి తీర్థాన్ని వారికి ఇచ్చారు. అనంతరం సలాముల ఆలపాన తర్వాత పక్కీర్లను సాగనంపే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గుల్షన్ కమిటీ గౌరవఅధ్యక్షడు, అధ్యక్షడు నజీర్అహ్మద్, మున్నపాష, గ్రామ పెద్దలు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. -
కిటకిటలాడిన కౌతాళం
కౌతాళం: జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసు సందర్భంగా మండలకేంద్రం కౌతాళానికి భక్తజనం పోటెత్తారు. కులమతాలకు అతీతంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది స్వామి దర్గాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ప్రసాదం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దర్గా ధర్మకర్త సయ్యద్ సాహెబ్‌పీర్ ఇంట్లో ప్రత్యేకంగా తయారు చేసి తెచ్చిన ఈ మహాప్రసాదాన్ని పొందేందుకు భక్తులు ఎగబడ్డారు. అనంతరం పలువురు ఖాదర్‌లింగ స్వామి శిష్యరికం పొందారు. ఎలాంటి చేడు పనులు చేయకూడదని, మంచి మార్గంలో నడుస్తూ ఐదుపూటల నమాజు చేయాలనిlధర్మకర్త ఈ సందర్భంగా వారికి బోధించారు. కార్యక్రమంలో గుల్షన్ కమిటీ గౌరవ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, అధ్యక్షుడు మున్నపాష, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ నల్లప్ప గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. -
ఖాదరలింగస్వామి ఉరుసు ప్రారంభం
– పదిరోజులపాటు ఉత్సవాలు కౌతాళం: మతసామరస్యానికి ప్రతీకగా మండల కేంద్రం కౌతాళంలో వెలసిన జగద్గురు ఖాదర్‌లింగ స్వామి 312వ ఉరుసు ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దర్గా ధర్మకర్త సయ్యద్ సాహెబ్‌పీర్ వుసేని చిష్తీ, పీఠాధిపతి సయ్యద్ ఖాదర్‌బాష చిష్తీలు వారి శిష్యరిక బందం ప్రత్యేక ఫాతెహాల చేసి స్వామి సమాధికి సుగంధ ద్రవ్యలు, పానీయాలతో శుభ్రం చేశారు. ప్రత్యేకంగా తెచ్చిన చాదర్‌ను సమాధిపై వేసి పూలతో అలంకరించారు. అనంతరం నగారా వాయించారు. దీంతో ఉరుసు ప్రారంభమైనట్లు ధర్మకర్త తెలిపారు. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. వీరి కోసం అవసరమైన అన్ని సౌకర్యాలను దర్గా ఆవరణలో ఏర్పాటు చే సినట్లు గుల్షన్ కమిటీ గౌరవ అధ్యక్షుడు, అధ్యక్షుడు నజీర్ అహ్మద్, మున్నపాష తెలిపారు. -
మహిళా రైతు ఆత్మహత్య
కౌటాలం (కర్నూలు) : అప్పుల బాధ భరించలేక మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లా కౌటాలం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రంజానమ్మ(46) తనకున్న ఏడెకరాల భూమిలో ఐదెకరాలలో పత్తి, మరో రెండెకరాలలో మిర్చి సాగు చేసింది. ఈ క్రమంలో పంటల పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.