ఎల్లెల్సీ ఈఈ కార్యాలయం ముట్టడి
ఎల్లెల్సీ ఈఈ కార్యాలయం ముట్టడి
Published Tue, Oct 18 2016 11:08 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
ఎల్‌ఎల్సీ నీటి వాటా తగ్గించడంపై రైతుల ఆగ్రహం
ఈఈతో వాగ్వాదం
ఆదోని రూరల్ : రబీలో తమకు రావాల్సిన నీటి వాటా పూర్తిగా తగ్గించడాన్ని నిరసిస్తూ కౌతాళం మండలంలోని ఎల్‌ఎల్సీ ఆయకట్టు రైతులు ఆదోనిలో ఉన్న ఎల్‌ఎల్సీ ఈఈ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. దాదాపు 200 మంది రైతులు కార్యాలయం ముందు బైఠాయించారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి ఈఈ భాస్కర్‌రెడ్డి బయటకొచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడంతో ఆయన బయటకు వచ్చారు. దీంతో రైతులు ఈఈని చుట్టముట్టి తమ ఆవేదనను వెళ్లగక్కారు. సమాధానం చెప్పలేక ఈఈ నీళ్లు నమిలారు.
పంటలు ఎండుముఖం పట్టాయి..
రైతులు, సాగునీటి సంఘం నాయకులు వెంకటపతి రాజు, రాఘవరెడ్డి, సుబ్బరాజు, శీనురాజు మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్‌ఎల్సీకి రావాల్సిన నీటి వాటాలో తమ డీపీ 74కు పూర్తిగా నీరు నిలిచిపోయిందన్నారు. దీంతో రబీ కింద సాగు చేసిన పత్తి, వరి, మిరప పంటలు(సుమారు వెయ్యి ఎకరాలు) ఎండుముఖం పట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.40–50వేలు దాకా పెట్టుబడులు పెట్టామని, ఉన్నట్టుండి నీటిని నిలిపివేస్తే ఎలా అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం అందించాలని, లేనిపక్షంలో కదిలేదిలేదని భీష్మించారు. చివరికి ఈఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి ఽతీసుకెళ్ళి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైతులు ధర్మరాజు, గోవిందయ్య, దొడ్డయ్య, ఈరన్న, రామాంజనేయులు, ఉరుకుందప్ప పాల్గొన్నారు.
Advertisement