
దర్గా విశిష్టత :కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం నుంచి మత ప్రబోధనలు చేస్తూ వచ్చిన హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి 1916లో కమలాపురానికి వచ్చి స్థిర పడ్డారు. ఆయన తన భక్తులకు బోధనలు చేస్తూ ఎన్నో మహిమలు చూపారు. దీంతో ఈ ప్రాంతంలో చాలా మంది ఆయనకు శిష్యులుగా మారారు. ఈ నేపథ్యంలో పరిపూర్ణులై విరాజిల్లుతున్న గఫార్ షా ఖాద్రి తన ప్రియ శిష్యుడైన దస్తగిర్‌షా ఖాద్రికి గురుత్వం బోధించి 1924 జనవరి 10న సమాధి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దస్తగిర్‌షా ఖాద్రి వంశీయులే పీఠాధిపతులుగా కొనసాగుతున్నారు. దాదాపు 50 ఏళ్లకు పైగా పీఠాధిపతిగా కొనసాగిన హజరత్ హాజీ జహీరుద్దీన్ షా ఖాద్రి ఇటీవల స్వర్గస్తులయ్యారు. దీంతో ఆయన కుమారుడు ఫైజుల్ గఫార్‌షా ఖాద్రి గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కమలాపురం :కమలాపురం పట్టణంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, ఖాదరియా మత సామరస్యానికి ప్రతీకగా, భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన ఈ దర్గాలో వెలసిన శ్రీ హజరత్ అబ్దుల్ గఫార్‌షాఖాద్రి, శ్రీ హజరత్ దస్తగిర్‌షాఖాద్రి, శ్రీ హజరత్ మౌలానా మౌల్వి ఖాదర్ మొహిద్దీన్ షా ఖాద్రి , శ్రీ హజరత్ జహీరుద్దీన్ షాఖాద్రి ఖుద్దస సిర్రహుం వార్లు వెలసి ఉన్నారు. ప్రతి ఏటా ఈ ఉరుసు మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం గత 50 ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది.
స్వర్గీయ పీఠాధిపతి హజరత్ హాజి జహీరుద్దీన్ షా ఖాద్రి ఆధ్వర్యంలో ఈ ఉరుసు ఉత్సవాలు నిర్వహించేవారు. ఆయన పరమ పదించిన తర్వాత ఆయన వారసులు, ప్రస్తుత పీఠాధిపతి సజ్జాదె–ఏ–నషీన్ హజరత్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి ఆధ్వర్యంలో ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 30వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. 30వ తేదీన నషాన్‌తో ఉరుసు మహోత్సవాలు ప్రారంభమై, 31న గంధం, ఏప్రిల్ 1న ఉరుసు, 2న తహలిల్‌తో కార్యక్రమాలు ముగుస్తాయి. ఉరుసు ఉత్సవాలకు దర్గా సుందరంగా ముస్తాబు అవుతోంది. రాష్ట్రం నలు మూలల నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వేలాదిగా తరలి రానున్నారు. భక్తుల సౌకర్యార్థం గఫారియా ట్రస్ట్ అధ్యక్షుడు జియా ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏప్రిల్ 1న బండ లాగుడు పోటీలు:ఏప్రిల్ 1వ తేదీన దర్గా ప్రాంగణంలో పాల దంతాలు కలిగిన వృషభ రాజములచే చిన్న బండ లాగుడు పోటీలు నిర్వహించ నున్నారు. గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతి రు.25,116, ద్వితీయ బహుమతి రు.10వేలు, తృతీయ బహుమతి రు.7వేలు, నాల్గవ బహుమతి రు.5వేలు ఇవ్వనున్నారు.
అన్నదానం:ఉరుసు మహోత్సవాల్లో భాగంగా నషాన్ రోజున టి. హుసేన్ మియ్య, గంధం, ఉరుసు రోజుల్లో మోహన్ బీడీ యజమాని మహబూబ్ సాహెబ్, తహలిల్ రోజున ముంబాయి ఖాదర్ వారు అన్నదానం చేయనున్నారు.
మతసామరస్యానికి ప్రతీక
హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి దర్గాను హిందువులే నిర్మించడంతో ఈ దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. హజరత్ దస్తగిర్‌రిషా ఖాద్రికి ముఖ్య శిష్యుడుగా ఉన్న నామా నాగయ్య శ్రేష్ఠి ధర్మకర్తగా కొనసాగారు. ఇప్పటికి నాగయ్య కుమారులే ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు.
గొప్ప ఖవ్వాలి
ఉరుసు మహోత్సవాలను పురస్కరించుకొని దర్గా ప్రాంగణంలో గంధం, ఉరుసు రెండు రోజుల పాటు గొప్ప ఖవ్వాలి పోటీ నిర్వహించ నున్నారు. ప్రముఖ ఖవ్వాల్‌లు యూపీకి చెందిన సర్‌ఫరాజ్ చిష్టి, రాజస్థాన్‌కు చెందిన దిల్‌షాద్ ఇర్షాద్ సాబిరి ల మధ్య గొప్ప ఖవ్వాలి పోటీ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment