Kida Movie
-
IFFI: కిడకి అభినందనలు
ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. పూ రామన్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో ఆర్ఏ వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కింది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని గోవాలో జరుగుతున్న ‘ఇఫీ’ (‘భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు’)లో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించగా, వీక్షకులు ‘స్టాండింగ్ ఒవేషన్’తో అభినందించారు. ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘ఏఆర్ వెంకట్‌కి ‘కిడ’ తొలి సినిమా అయినా బాగా తీశాడు. సినిమాకు భాషాపరమైన ఎల్లలు, హద్దులు లేవు. మంచి సినిమా వస్తే చూస్తారనే నమ్మకంతో తమిళంలో తీశాను’’ అన్నారు. ఆర్ఏ వెంకట్ మాట్లాడుతూ– ‘‘తాత, మనవడు, మేక చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. పనోరమాలో పదర్శించిన సినిమాని చాలామంది స్టూడెంట్స్ చూశారు.. వారికి బాగా నచ్చింది. నా తొలి సినిమాకు రవికిశోర్లాంటి నిర్మాత లభించడం నా అదృష్టం’’ అన్నారు. -
ఇఫీకి అంతా సిద్ధం
ఈ ఏడాది జరగనున్న ‘ది ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫీ)కి రంగం సిద్ధం అయింది. 53వ ఇఫీ వేడుకలు గోవాలో నవంబరు 20 నుంచి 28 వరకు జరగనున్నాయి. పన్నెండుమంది సభ్యులున్న జ్యూరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 25 సినిమాలను, ఆరుగురు సభ్యుల జ్యూరీ నాన్ – ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 20 సినిమాలను ఎంపిక చేసింది. ఇండియన్ పనోరమ సెక్షన్ కింద ఈ 45 చిత్రాలు ప్రదర్శించబడతాయి. ఇందులో పది హిందీ చిత్రాలు, ఐదు మరాఠీ చిత్రాలు, నాలుగేసి చొప్పన తెలుగు, తమిళ సినిమాలు, ఇంకా ఇతర భాషల చిత్రాలు ఉన్నాయి. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం..రణం..రుధిరం), బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’, హిందీ నుంచి అడివి శేష్ ‘మేజర్’, అనుపమ్ ఖేర్ – పల్లవీ జోషి భాగమైన ‘ది కశ్మీరీ ఫైల్స్’, ఆర్ఏ వెంకట్ దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తమిళ చిత్రం ‘కిడ’ వంటివి ఉన్నాయి. నాన్–ఫీచర్ విభాగంలో ‘టాంగ్’, ‘రే– ఆర్ట్ ఆఫ్ సత్యజిత్ రే’, ‘క్లింటన్ అండ్ ఫాతిమా’ వంటి సినిమాలు ఉన్నాయి. కాగా మెయిన్‌స్ట్రీమ్ సెక్షన్లో ‘ది కశ్మీరీ ఫైల్స్’ (హిందీ), ‘ఆర్ఆర్ఆర్’ (తెలుగు), ‘అఖండ’ (తెలుగు), ‘టానిక్’ (బెంగాలీ), ‘ధర్మవీర్: ముక్కమ్ పోస్ట్’ (మరాఠీ) చిత్రాలు ఉన్నాయి. అలాగే ఇండియన్ పనోరమ సెక్షన్లో తెలుగు చిత్రాలు ‘సినిమా బండి’ (దర్శకుడు కంద్రేగుల ప్రవీణ్), ‘ఖుదీరామ్ బోస్’ (దర్శకుడు విద్యాసాగర్ రాజు) ఉన్నాయి. -
ఇఫీలో ఇండియన్ పనోరమాకు ఎంపికైన 'కిడ', 'ఖుదీరామ్ బోస్'
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఇండియన్ పనోరమాకు ఎంపిక చేసిన 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌ను ఈ రోజు వెల్లడించారు. ఫీచర్ ఫిల్మ్స్‌లో 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తమిళ సినిమా 'కిడ', స్వాతంత్ర్య సమర యోధుడు ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్ర ఆధారంగా ‘ ఖుదీరామ్ బోస్’ ఎంపికయ్యాయి. ఈ చిత్రాలు నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరిగే 53వ 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా'లో ప్రదర్శించబడతాయి. 'కిడ'లో పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తాత, మనవడు, మేక పిల్ల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. తమ సినిమాకు అరుదైన గౌరవం లభించడంతో ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ సంతోషం వ్యక్తం చేశారు. విజయ్ జాగర్ల మూడి, డి. వి. యస్. రాజుల దర్శకత్వంలో రజిత విజయ్ జాగర్లమూడి నిర్మిస్తున్న స్వాతంత్ర్య సమర యోధుడు బయోపిక్ చిత్రం ‘ఖుదీరామ్ బోస్’. రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమ చిత్రం ఇండియన్ పనోరమాకు ఎంపికవడం పట్ల నిర్మాత రజిత విజయ్ జాగర్లమూడి, దర్శకులు విజయ్ జాగర్లమూడి, డివిఎస్ రాజు సంతోషం వ్యక్తం చేశారు.